logo

ఉగాది పండుగ విశిష్టత ఏమిటంటే..

ఉగాది పండుగ విశిష్టత ఏమిటంటే..

ఉగాది.. 'ఉగ' అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ ఉగాదిని జరుపుకుంటారు. ఈ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం తెలుగువారికి అనాదిగా వస్తున్న ఆచారం.

ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఈరోజున పంచాంగ శ్రవణం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని తినడం ప్రశస్త్యమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. "ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు , కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.

ఈ పచ్చడి కోసం చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి వాడతారు. ఇక ఉగాది సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్నానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణము చేస్తారు. ఈ రోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి ఈ ఉగాది సర్వులకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖమయజీవనాన్ని అందించాలని ఆశిస్తూ.. hmtv వీక్షకులు, పాఠకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

???? ????

Share it
Top