ఒక కేసుకు వంద కేసులు.. తమ్ముళ్లలో వైసీపీ కొత్త టెన్షన్?

ఒక కేసుకు వంద కేసులు.. తమ్ముళ్లలో వైసీపీ కొత్త టెన్షన్?
x
Highlights

ఒక కేసుకు వంద కేసులు. 2014 ఎన్నికల్లో ఏ కేసులనైతే అస్త్రాలుగా సంధించారో జనంలో పలుచన చేసే ప్రయత్నం చేశారో అలాంటి కేసులతోనే రివెంజ్‌...

ఒక కేసుకు వంద కేసులు. 2014 ఎన్నికల్లో ఏ కేసులనైతే అస్త్రాలుగా సంధించారో జనంలో పలుచన చేసే ప్రయత్నం చేశారో అలాంటి కేసులతోనే రివెంజ్‌ రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో. తన చిరకాల ప్రత్యర్థి టిడిపిపై బదులు తీర్చుకునే సమయం వైసీపీకి వచ్చిందా..? అయితే తమ చేతికి మట్టి అంటకుండా, కాగల కార్యాన్ని కేంద్రమే తీర్చాలన్న వ్యూహంతో అధికార వైసీపీ ముందుకు వెళ్తోందా...? ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సూత్రాన్ని సూటిగా అమలు చెయ్యబోతోందా? ఏపీ నుంచి ఢిల్లీ దాకా హోరెత్తుతున్న సీబీఐ విచారణల డిమాండ్‌ సారమేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మొదటి నుంచీ అగ్నిపర్వతంలా భగ్గుమంటూనే వుంది. ప్రతిరోజూ పొలిటికల్‌ హీటే. అయితే, ఇప్పుడు మరింత వేడి రగిలే పరిస్థితులు కనపడుతున్నాయి. తన చిరకాల ప్రత్యర్ధి టిడిపిపై రివేంజ్ తీర్చుకునే సమయం వైసీపీకి వచ్చిందా? అయితే తమ చేతికి మట్టి అంటకుండా, కాగల కార్యాన్ని కేంద్రమే తీర్చాలన్న వ్యూహంతో అధికార వైసీపీ ముందుకు వెళ్తుందా...? ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని సూటిగా అమలు చేయబోతోందా..?

2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి చేతిలో వైసీపీ ఓటమిపాలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి, బయటకు వచ్చి సానుభూతి పవనాలతో జనాల్లో ఆదరణ కలిగి ఉన్నప్పటికీ, జగన్ ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీనికి కారణం టిడిపి పన్నిన వ్యూహం పక్కాగా ఫలించటమే. బీజేపీ, జనసేనలు టిడిపిని గట్టెక్కించటానికి అదనపు అస్త్రాలుగా ఉపయోగపడగా, వైసీపీ అధినేత జగన్ పై ఆ పార్టీ చేసిన ఆరోపణలూ కారణమయ్యాయన్నది విశ్లేషకుల మాట. సీబీఐ కేసుల్లో ఉన్న జగన్ పూర్తిగా జైలుకే పరిమితం కానున్నారనీ, అంతకుముందు గడిపిన 16 నెలల జైలు జీవితం ఇక శాశ్వతం కానుందనీ, అలాంటి అవినీతి మరకలున్న వ్యక్తికి అధికారం అప్పజెబితే కొత్త రాష్ట్రం భవిష్యత్తు నాశనం అవుతుందన్న విమర్శలు సంధిస్తూ ప్రజల్ని తమవైపు డైవర్ట్ చేసేలా పక్కా వ్యూహం అమలు చేసింది. దీనికి అనుకూల మీడియా సైతం జత కలిసింది. ఫలితం 2014 ఎన్నికల్లో ప్రజలు టిడిపి వైపు మొగ్గేలా వచ్చింది.

అయితే కాలం మారింది, పరిస్థితులూ మారాయి. దాంతోనే ప్రభుత్వం కూడా మారింది. వ్యూహాల అమలు విషయంలో ఇప్పుడు అధికార వైసీపీదే పైచేయి. ముఖ్యమంత్రి హోదాలో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన జగన్, అటు పాలననూ, ఇటు రాజకీయాల్నీ సమానంగా నడిపించేస్తున్నారు. పదేపదే మీడియా ముందుకు వచ్చి రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు కురిపించే విధానాలకు స్వస్తి చెప్పి సైలెంట్ గా, రివేంజ్ తీర్చుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు చుట్టూ ఉన్న సీనియర్ నేతల నోళ్లకు తాళాలు వేయించారు. ఏ నేతలైతే తనను జైలు పక్షి అని ఆరోపణలు చేశారో, ఎవరైతే తనను దుర్భాషలాడారో వారందరికీ జైలు జీవితం రుచిచూపించారు. వారిపై గతంలో ఉన్న కేసుల్ని తిరగదోడి ముందు వీటి నుంచి, బయటపడితే చాలు, రాజకీయాలు తర్వాత చూసుకోవచ్చన్నంత రీతిలో రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించారు ముఖ్యమంత్రి జగన్.

ఇక ఇంతటితో ఆగితే కిక్కేముంది అనుకున్నారో, ఏమో కానీ నెక్స్ట్ ఫేజ్ లోకి దిగిపోయారు సదరు వైసీపీ ముఖ్యనేతలు. అధినేత జగన్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుంటున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్న ఆరోపణలకు ఆధారాలున్నాయనీ వీటన్నింటిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఐదుగురు మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రధానంగా టిడిపి హయాంలో రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ టెండర్లు, అసైన్డ్ భూముల కొనుగోళ్లలో అవకతవకలు, విద్యుత్ కంపెనీలతో జరిగిన లావాదేవీల్లో అక్రమాల వంటి వాటిని అస్త్రాలుగా చేసుకుని అధికార వైసీపీ పావులు కదుపుతోంది. ఇందుకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ, సీఐడీ సంస్థల విచారణలో వచ్చిన నివేదికల్నే సీబీఐ ముందుంచబోతున్నట్లు సమాచారం.

మరి సీఎం జగన్ అంతటితో ఆగితే పెద్ద చర్చేముంది...? అంతకుమించి ఏమైనా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఏవైతే ఆరోపణలు చేసి జనాల్లో తనను పలుచన చెయ్యాలని చూశారో, అవే ఆరోపణలకు దొరికిన ఆధారాలను బేస్ చేసుకుని తన చిరకాల ప్రత్యర్ధికి చెక్ పెట్టటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అందించటంతో పాటు కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని భారత్ నెట్ పథకంలో భాగంగా జరిగిన ఏపీ ఫైబర్ నెట్ అమలులో సుమారు 2 వేల కోట్లరూపాయల అవినీతి జరిగిందని వైసీపీ సర్కారు నిర్ధారణ చేసింది. అటు భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ కానీ ఇటు ఫైబర్ గ్రిడ్ లో కానీ, మొత్తం 4 వేల కోట్ల అవినీతి జరిగిందనేది వైసీపీ అంచనా. దీంతో ఈ రెండూ కేంద్రం పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, కేంద్రంతోనే దర్యాప్తు చేయిస్తే బెటరని జగన్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఢిల్లీలో తమ నేతలతో గ్రౌండ్ ప్రిపేర్ చేయించేస్తున్నారన్న మాటలు వినపడ్తున్నాయి.

మొత్తంగా ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వంటబట్టించుకున్నట్లు వైసీపీ వర్గాలు తెగ గుసగుసలాడుకుంటున్నాయి. సీఐడీ, ఏసీబీ వంటి నివేదికల ఆధారంగా తామే చర్యలు తీసుకుంటే, టిడిపిపై రాజకీయ సానుభూతి వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్ సర్కార్, తమ చేతికి మట్టి అంటకుండా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇవిగో ఆధారాలు తీసుకోండి చర్యలంటూ కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో, మరి కేంద్రం ఇప్పుడేం చేయబోతోందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. టిడిపి హయాంలో ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలతో పాటు, జాతీయస్థాయిలో తమపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు వైఖరిని బీజేపీ మరచిపోతుందా...? లేక ఇదే సరైన సమయమని సరైన నిర్ణయం తీసుకుంటుందా...? టిడిపిపై దూకుడుగా ఉన్న రాష్ట్ర నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయటానికి దీన్ని ఓ అస్త్రంగా వాడుకుంటుందా...? ఇవే అంశాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి హస్తిన మంత్రాంగం ఎలా ఉందో కానీ, ఇప్పటికైతే వైసీపీ తంత్రానికి సొంతపార్టీ నేతలు పదిమార్కుల బోర్డెత్తేస్తున్నారు. చూద్దాం మరి, రాజకీయ తెరపై ఈ పొలిటికల్ స్టోరీ ఏ మలుపు తిరుగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories