Reddy Shanthi Husband Death: ఏపీ ఎమ్మెల్యే భర్త కన్నుమూత

Raj
By Raj
Published on: 22 July 2020 12:38 PM IST
Reddy Shanthi Husband Death: ఏపీ ఎమ్మెల్యే భర్త కన్నుమూత
X

Reddy Shanthi Husband Death: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి నాగభూషణరావు మృతిచెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాగభూషణరావు ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కాగా, శాంతి-నాగభూషణరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా జాతీయ స్థాయిలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. మొదట గోవా ఫారెస్ట్ కంజ‌ర్వేటర్‌గా, అలాగే డామ‌న్ డ‌య్యూ ప్రాంత టూరిజం డైర‌క్ట‌ర్‌గా, ప‌ర్యావ‌ర‌ణం, కాలుష్యం, అడ‌వులు, ఇంద‌న‌వ‌న‌రుల‌ శాఖ‌ల‌కు సంబంధించిన ప‌లు కీలక విభాగాల్లో ఆయన పనిచేశారు.

అంతేకాదు గతంలో కొంతమంది కేంద్ర మంత్రుల వ‌ద్ద కూడా ఓఎస్‌డీగా కూడా పనిచేశారు. పార్ల‌మెంట్ డిప్యూటీ స్పీక‌ర్ వ‌ద్ద ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా విధులు నిర్వర్తిస్తూ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అయితే దురదృష్టవశాత్తు గతేడాది ఆయన క్యాన్సర్‌ భారిన పడ్డారు. దాంతో ఢిల్లీలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన భార్య శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలిగా ఉన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Raj

Raj

Next Story