వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభం

Arun Chilukuri
Published on: 28 Sept 2020 1:47 PM IST
వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభం
X

ఏపీలో వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ వ్యవసాయ బోర్లు వేయనున్నారు. 'వైఎస్‌ఆర్‌ జలకళ' కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయబోతుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్‌ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందిస్తామని తెలిపారు.

ఇక, పథకాన్ని ఉపయోగించుకోవాలనుకున్న రైతన్నలు తమ పరిధిలోని వాలంటీర్ల ద్వారా.. పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ అప్లై చేసుకునే వీలు ఉంది. బోరు డ్రిల్లింగ్‌ వేసేముందు రైతు పొలంలో హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు. అయితే, ఈ పథకంలో లబ్ధి పొందాలనుకునే రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. దీనికి సంబంధించిన సమాచారం అప్టేడ్స్ సదరు రైతుకు ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story