త్వరలో ఉత్తరాంధ్ర టీడీపీ ఖాళీ కావడం ఖాయమా?

త్వరలో ఉత్తరాంధ్ర టీడీపీ ఖాళీ కావడం ఖాయమా?
x
Highlights

ఉత్తరాంధ్ర, మొన్నటి వరకు టీడీపీకి కంచుకోట. 2019లో విశాఖ నగరంలోనూ ఫ్యాన్‌ గాలి పని చెయ్యలేదు. సైకిలే రయ్యిన దూసుకెళ్లింది. అయితే, సాగర తీరం పరిపాలనా...

ఉత్తరాంధ్ర, మొన్నటి వరకు టీడీపీకి కంచుకోట. 2019లో విశాఖ నగరంలోనూ ఫ్యాన్‌ గాలి పని చెయ్యలేదు. సైకిలే రయ్యిన దూసుకెళ్లింది. అయితే, సాగర తీరం పరిపాలనా రాజధాని అవుతుండటంతో, స్పెషల్‌ ఫోకస్ పెట్టింది వైసీపీ. విశాఖ సహా మిగతా రెండు జిల్లాల్లో టీడీపీని ఖాళీ చెయ్యాలని వ్యూహాలు రచిస్తోంది. అదే తమ్ముళ్లలో దిగులు పెంచుతోందట.

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రపై పట్టు కోసం, అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాగరతీర నగరంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఆ పార్టీ అధినేత జగన్‌, ఎప్పటి నుంచో పట్టు సాధించాలని చూస్తున్నారు. 2014 ఎన్నికల బరిలో నేరుగా తన తల్లి విజయమ్మనే నిలిపారు. బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారామె. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ విజయఢంకా మోగించినా, విశాఖ నగరంలోని నాలుగు స్థానాల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక్కడ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. విశాఖలో ఈ విధమైన తీర్పును వైసీపీ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా ఆ నలుగుర్నీ పార్టీలోకి రప్పించుకుంటే, విశాఖలో ఇక తిరుగుండదని, వ్యూహాలకు పదును పెట్టింది. దీనిపై చాలాకాలంగా మంతనాలు సాగుతున్నాయి.

సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికంటే ముందుగా వైసీపీ తీర్థం తీసుకునేందుకు యత్నించారు. అయితే కొన్ని కారణాలు వలన అయన పార్టీ లో చేరడం ఆలస్యమవుతోంది. కొన్ని రోజుల్లోనే గంటా వైసీపీ గంట కొట్టే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన పార్టీ లో చేరితే ఇప్పటికే ఖాళీగా ఉన్న వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవి ఇస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరంలలో టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే విజయనగరంలో సీనియర్ నాయకులు, ఇక్కడ పసుపు జెండా పట్టిన మొదటి వ్యక్తిగా పేరు పొందిన గద్దె బాబురావు పార్టీని వీడారు. తనను తెలుగుదేశం నుంచి బయటకు పంపలేక, పొమ్మనలేక పొగబెట్టారని, పార్టీ వీడుతూ ఆవేదనగా చెప్పారు బాబూరావు. అయితే ఇంకా ఆయన ఏపార్టీలో చేరుతారో ప్రకటించకపోయినప్పటికి, వైసీపీలో చేరుతారన్న మాటలు వినపడ్తున్నాయి. విజయనగరంలో మరో సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమ సొంత ట్రస్ట్ మాన్సాస్‌లో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత, ఆయన పెద్దగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అశోకగజపతి రాజు సైలెంట్ గా ఉండడంతో పార్టీ పూర్తిగా నీరుగారిపోయినట్టయ్యింది. ఆయన వైఖరితో విసుగు చెందిన కొందరు వైసిపి వైపు చూస్తున్నారు. ఇదేకానీ జరిగితే విజయనగరంలో టీడీపీకి పెద్ద దెబ్బే. టీడీపీ అధినేత చంద్రబాబు నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీకి, కిమిడి నాగార్జునను అధ్యక్షులుగా నియమించారు. ఈయన పార్టీని విజయనగరంలో ఎంతవరకు సమన్వయం చేస్తారో వేచిచూడాల్సి ఉంది.

ఉత్తరాంధ్రలో మరో జిల్లా శ్రీకాకుళంలో, తెలుగుదేశం పరిస్థితి అంతంత మాత్రమే. జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, పార్టీ ఉనికిని చాటుకోలేకపోతున్నారు. ఇటీవలే జిల్లాలో కీలక నేత అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టు కావడం, పార్టీ నైతికస్థైర్థ్యాన్ని దెబ్బతీసిందన్నది జరుగుతున్న చర్చ. అయితే, అదే అచ్చెన్న నాయకత్వంలో పార్టీ మరింత దూకుడుగా వెళుతుందని కార్యకర్తలంటున్నారు. జిల్లాలో ఇంకో నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ,అధికారులను బెదిరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆయనను అధ్యక్షులుగా నియమించారు. జిల్లాలో ఆయన పార్టీని ఎంత వరకు సమన్వయం చేస్తారో చూడాలి.

ఇక విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. చడీచప్పుడు లేకుండా అమరావతి వెళ్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి వైసీపీకి మద్దతు పలికారు. ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని కొద్దికాలంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో కరోనా ఎక్కువగా వున్నందున, అది తగ్గిన తర్వాత వైసీపీ వైపు అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదేగాని జరిగితే ఇక విశాఖలో మిగిలేది తూర్పు నియోజకవర్గం ఒక్కటే. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబు మొదటి నుంచీ టీడీపీ సానుభూతిపరుడు. ఈయన మాత్రం వైసీపీలోకి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విశాఖ టీడీపీకీ ఈయన ఒక్కడే దిక్కని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ కేడర్ పట్టుదలా వుంది. దీనితో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులను తమ పార్టీలో కలుపుకోవాలని, గట్టి ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. ఇదే కానీ జరిగితే ఉత్తరాంధ్ర లో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చాలామంది టచ్‌లో వున్నారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories