సిక్కోలు వైపీపీలో దువ్వాడ కలకలమేంటి?

సిక్కోలు వైపీపీలో దువ్వాడ కలకలమేంటి?
x
సిక్కోలు వైపీపీలో దువ్వాడ కలకలమేంటి?
Highlights

ఆయన గెలుస్తాడని అనుకున్నారు. కానీ డామిట్‌ కథ అడ్డం తిరిగింది. ఓడిపోయారు. మళ్లీ ఎన్నికల్లోనే హడావుడి వుంటుందని, ఇక సైలెంటేనని అందరూ అనుకున్నారు. కానీ...

ఆయన గెలుస్తాడని అనుకున్నారు. కానీ డామిట్‌ కథ అడ్డం తిరిగింది. ఓడిపోయారు. మళ్లీ ఎన్నికల్లోనే హడావుడి వుంటుందని, ఇక సైలెంటేనని అందరూ అనుకున్నారు. కానీ రివర్స్‌ గేర్‌లో చెలరేగిపోతున్నారట ఆ నాయకుడు. సెగ్మెంట్‌లో పవర్‌లేకపోయినా, స్టేట్‌లో పవర్‌ తనదేనంటూ, పార్టీని, పార్టీలో వున్న నేతలందర్నీ ఒక చూపు చూస్తూ, ఒక ఆట ఆడుకుంటున్నారట. తనకు ఎవరు అడ్డొచ్చినా వారికే ఇబ్బంది, తాను ఎదురెళ్లినా వారికే ఇబ్బంది అంటూ, ఆ జిల్లాలో సినిమా లెవల్‌లో స్టంట్‌లు చేస్తున్నారట. ఇంతకీ మూవీస్‌లో బాలయ్యనే మించిపోయినట్టు కనిపిస్తున్న, ఆ నేత ఎవరు? పార్టీలో వున్న నేతలందరూ మూకుమ్మడిగా ఎందుకు అతనిపై ఫిర్యాదులు చేస్తున్నారు?

శ్రీకాకుళం జిల్లా అధికార వైఎసార్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సింగిల్ ఎజెండాతో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని ఇతర నాయకులకు తలనొప్పిగా మారిందట. పార్టీలోని సీనియర్లను సైతం పట్టించుకోకుండా సిఎంకి దగ్గర వ్యక్తిని కాబట్టి, నచ్చింది చేస్తా ఎవ్వరి మాటా వినను అనేలా వ్యవహరిస్తున్న ఓ నేత, పార్టీలోని నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారట.

టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ వైసిపి అధినేత వైఎస్ జగన్‌కు ప్రతినిధిగా చెప్పుకుంటాడు. అపాయింట్ మెంట్ లేకపోయినా నేరుగా సిఎం జగన్‌ను కలిసే చనువు, తనకు వుందని చెప్పుకుంటాడట దువ్వాడ. అంతేకాకుండా జిల్లాలో ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత వైఎస్ జగన్ దువ్వాడకు ఇస్తున్నారని, అదీ తమ లీడర్‌ తడాఖా అంటూ దువ్వాడ ఫాలోవర్స్ ఘనంగానే చాటుకుంటున్నారట. అయితే ఈ ధీమాతోనే దువ్వాడ శ్రీనివాస్ తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నానే చర్చ జోరందుకుంది. జిల్లాలో సీనియర్ నాయకులను సైతం పట్టించుకోకుండా దువ్వాడ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోందట.

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత పైరవీలతో మొదలైన ఈ అంతర్గత పోరాటం ఇప్పుడు జిల్లా స్థాయికి చేరుకుందట. టెక్కలిలో ఎవరు కొలువు చేయాలన్నా దువ్వాడ శ్రీనివాస్ అనుగ్రహం కావాల్సిందే అన్న హుకుం జారీ చేస్తున్నారట. ముఖ్యంగా టెక్కలి పంచాయితీ ఎక్జిక్యూటివ్ అధికారి విషయంలో దువ్వాడ చేసిన హంగామా అప్పట్లో పెను దుమారమే రేపిందట. నియోజకవర్గంలోని మిగిలిన వైసిపి నాయకులు అంతా ఎక్జిక్యూటివ్ అధికారి విషయంలో అంగీకరించినా, కేవలం దువ్వాడకు నచ్చలేదనే కారణంతో ఆయనకు ఉద్వాసన పలకాల్సిందేనని ఆయన రచ్చ చేశారట. అయితే జిల్లాలో ఆధిపత్య రగడ మొదలయ్యింది కూడా ఇక్కడి నుంచేనని పార్టీలోని ఇతర నాయకులు చర్చించుకుంటున్నారట.

ఇకపోతే జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలో సైతం దువ్వాడ జోక్యం శ్రుతి మించుతోందనే చర్చా పార్టీలో సాగుతోందట. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ పలాసలో వైసిపి నేతగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకి దువ్వాడ సోదరులకి మధ్య అంతగా పొసగాడంలేదన్న వార్తలూ వినిపిస్తున్నాయట. మునిసిపల్ వ్యవహారాల్లో దువ్వాడ సోదరుల జోక్యాన్ని ఎమ్మెల్యే అప్పలరాజు వ్యతిరేకిస్తుండగా, దువ్వాడ శ్రీనివాస్ ముఖ్యమంత్రి ప్రతినిధి కాబట్టి తమదే పైచేయి అంటూ దువ్వాడ సోదరులు ప్రకటించుకుంటున్నారట. అదేసమయంలో ఇచ్చాపురం విషయానికి వస్తే ఇప్పటికే వైసిపిలో ఆరు గ్రూపులు రాజకీయం చేస్తున్నాయి. అందులో కొందరు ధర్మాన ప్రసాదరావును ప్రసన్నం చేసుకునే పనిలో పడగా, మరికొందరు ధర్మాన కృష్ణదాస్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారట. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సైతం ఇందులో దూరి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారనే, చర్చ తెరపైకి వస్తోందట. కాగా దీని ఫలితంగా ఇచ్చాపురం మునిసిపల్ చైర్మన్ ప్రతినిధికి ఘోర అవమానం జరిగిందనే చర్చ అప్పట్లో హాట్ టాపికయ్యింది.

శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్, ఎన్నికల అనంతరం ఇతర నియోజకవర్గాల్లో పర్యటనలు కానీ, పార్టీ వ్యవహారాలను కానీ పట్టించుకున్న దాఖలాలు లేవట. పోనీ అనుభవం కలిగిన కిల్లి కృపారాణి అదే నియోజకవర్గానికి చెందిన వారైనప్పటికీ, దువ్వాడ ఆమెకు కనీసం సహకారాన్ని కూడా ఇవ్వలేదని పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇంతలా విభేదాలకు కారణమవుతున్న దువ్వాడ శ్రీనివాస్, ఏ విధంగా పార్టీ పదవులకు అర్హత సాదిస్తారంటూ ఆ పార్టీలోని కొందరు నాయకుల నుంచి ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయట.

అంతేకాకుండా పార్టీ సీనియర్ నాయకులు అయిన ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావుతో, దువ్వాడ శ్రీనివాస్‌కు అంత సామరస్యమైన పరిస్థితులు కనపడటం లేదట. దీంతో దువ్వాడ దుందుడుకు విధానాన్ని పార్టీ ముఖ్య నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియని దువ్వాడ శ్రీనివాస్‌తో ఎలా వేగాలంటూ పార్టీలోని కొందరు ముఖ్యనాయకులు ఆంతరంగిక సంభాషణల్లో తర్జనభర్జనపడుతున్నారట. ఈ నేపధ్యంలోనే దువ్వాడ పై పార్టీలోని సీనియర్ నాయకులు ఏకంగా తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారట. ఎక్కువ చనువు ఇవ్వడం వల్ల దువ్వాడకు అడ్డుకట్ట వేయడం ఇబ్బందిగా మారుతోందని వైఎస్ జగన్ వద్ద అభిప్రాయపడ్డారట. దువ్వాడ వ్యవహారతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశమూ లేకపోలేదని అధినేత వద్ద ప్రస్తావించారట. ఇప్పటికైనా దువ్వాడ చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే భావనను, జగన్ వద్ద వ్యక్తపరిచారట. ముఖ్యంగా నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత లుకలుకల వల్ల ప్రత్యర్ధిగా ఉన్న అచ్చెన్నాయుడు మరింత బలశాలిగా మారే ప్రమాదముందని అంటున్నారట.

మొత్తం మీద పార్టీలో మొదాలైన అంతర్గత పోరు రోజు రోజుకూ తారాస్థాయికి చేరుకుంటుండగా, దీనిపై అధినేత వైఎస్ జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories