దగ్గుబాటి దంపతులకు వైసీపీ ఇచ్చిన అల్టిమేటం ఏంటి?

దగ్గుబాటి దంపతులకు వైసీపీ ఇచ్చిన అల్టిమేటం ఏంటి?
x
Highlights

భర్త ఒక పార్టీలో. భార్య మరో పార్టీలో. జాతీయ పార్టీలో ఒకరు. ప్రాంతీయ పార్టీలో మరొకరు. ఒకే ఇంట్లో రెండు పార్టీలు. మొన్న ఎన్నికల వరకు కూడా, కొన్ని విమర్శలు ఎదురైనా, పెద్దగా ప్రాబ్లమైతే రాలేదు.

భర్త ఒక పార్టీలో. భార్య మరో పార్టీలో. జాతీయ పార్టీలో ఒకరు. ప్రాంతీయ పార్టీలో మరొకరు. ఒకే ఇంట్లో రెండు పార్టీలు. మొన్న ఎన్నికల వరకు కూడా, కొన్ని విమర్శలు ఎదురైనా, పెద్దగా ప్రాబ్లమైతే రాలేదు. కానీ ఇప్పుడు ఆ దంపతుల మధ్య, ఆ రెండు పార్టీల చర్చే, రచ్చవుతోంది. ఇంట్లో ఇద్దరూ బానే వున్నా, బయటే సూటి పోటీ మాటలు ఎక్కువయ్యాయట. దీంతో, భార్యాభర్త వుంటే గింటే, ఒకే పార్టీలో వుండండి, లేదంటే లేదు అనేశారట ఆ పార్టీ అధినేత. భార్యతో రాజీనామా చేయించి, తమ పార్టీలో చేర్పించాలని కూడా సలహా ఇచ్చారట. మరి భర్త బాటలో భార్య నడుస్తుందా తన పార్టీని వదిలేసి భర్త వున్న పార్టీలోకి వస్తారా ఆ దంపతుల దారెటు?

ప్రకాశం జిల్లా పర్చూరులో రాజకీయంగా ఎదురులేని దగ్గుబాటి కుటుంబానికి, కాలం కలిసిరావడం లేదు. పార్టీలు కూడా కలిసిరావడం లేదు. కాంగ్రెస్‌ తర్వాత మారిన ఏ పార్టీలోనూ, దగ్గుబాటి దంపతులు ఇమడలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా వీరిద్దరూ చెరో పార్టీ కావడంతో, ఇబ్బంది కాస్త ఎక్కువైంది.

దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆ‍యన కుమారుడు చెంచురామ్ వైసీపీలో వుంటే, దగ్గుబాటి పురంధ్రేశ్వరి మాత్రం భారతీయ జనతా పార్టీలో వున్నారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ చెరో పార్టీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఒకే ఇంట్లో రెండు పార్టీలంటూ, అప్పడే పెద్ద ఎత్తున సూటిపోటీ మాటలు ఎదురైనా, ఇంట్లో ఒక్కటైనా, బయట ఎవరిదారి వారిదేనని, కపుల్స్ ఇద్దరూ చెప్పుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రంలో బీజేపీ మళ్లీ వచ్చింది. మొన్నటి వరకూ మిత్రపక్షంగా కనిపించిన ఈ రెండు పార్టీల మధ్య, ఇప్పుడు ఏపీలో భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే దగ్గుబాటి ఫ్యామిలీలోనూ మంట రేపుతోంది.

కొద్దిరోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవితవ్యంపై అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తోంది. శ్రేయోభిలాషులు, ముఖ్య అనుచరులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్న ఆయన, సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను చూసి కలత చెందుతున్నారట. భార్యాభర్తలు వుంటే, గింటే ఒకే పార్టీలో వుండాలని, లేదంటే లేదని ఏకంగా వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయన్న వార్తలు, దగ్గుబాటి వర్గీయుల్లో వాడివేడి చర్చకు దారి తీశాయి.

అయితే పర్చూరులో మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న దగ్గుబాటి, సీఎం జగన్‌ను కలిసి మాట్లాడేందుకు రెడీ అయ్యారట. అయినా సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదట. అదేక్రమంలో ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబును కొద్దిరోజుల క్రితం తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్‌ సమక్షంలోనే రామనాథం బాబు పార్టీలో చేరారు. అయితే, ఈ పరిణామాలు దగ్గుబాటిని మరింత కలచివేశాయట. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, రామనాథంను చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో కలత చెందిన దగ్గుబాటి, నియోజకవర్గానికి వెళ్లడం మానేసి, సీఎంను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశారట. అయినా ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకలేదట. దీంతో విజయసాయిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారట. పదేపదే మెసేజ్‌లు పంపగా ఒక్కసారి ఫోన్‌లో క్లుప్తంగా మాట్లాడినట్లు సమాచారం.

అయితే, జగన్‌ను కలిసేందుకు దగ్గుబాటి చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా చేశారట మంత్రి బాలినేని. ఎట్టకేలకు సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకడంతో, ఆయన తన కుమారుడితోపాటు సీఎంను కలిశారట. 'పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలి' అని జగన్‌ సూటిగా చెప్పినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పురందేశ్వరి బీజేపీలో ఉండటం సమంజసం కాదని చెప్పినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో దగ్గుబాటిని, ఆయన కూమారుడిని రాజకీయంగా ప్రోత్సహిస్తామని, నియోజకవర్గ బాధ్యత విషయంలోనూ ఇబ్బందులు ఉండవని, జగన్‌ హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. పురందేశ్వరితో మాట్లాడి నిర్ణయాన్ని తెలియజేస్తానని దగ్గుబాటి చెప్పారట. దీంతో ఇప్పుడు జగన్‌ మాటగా, దగ్గుబాటి చేసే ప్రతిపాదనకు పురంధ్రీశ్వరి ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి గుడ్‌ బై చెప్పి, వైసీపీలో చేరతారా? లేకపోతే రాష్ట్రంలో పవర్‌లో వున్న వైసీపీలోకి వెళతారా అన్నది, తీవ్రమైన ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి పొమ్మనలేక పొగబెడుతున్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయని, దగ్గుబాటి తీవ్ర ఆవేదన చెందుతున్నారని, పర్చూరు వైసీపీలో చర్చ జరుగుతోంది. చూడాలి, దగ్గుబాటి కుటుంబ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories