ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని కేంద్రం ఆమోదిస్తుందా?

ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని కేంద్రం ఆమోదిస్తుందా?
x
Highlights

ఏపీ రాజకీయం మరింత హీటెక్కుతోంది. అమరావతి వ్యవహారం మరో రాజకీయ యుద్ధానికి తెరతీసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏసీబీ దూకుడు మీదుంది సీబీఐ...

ఏపీ రాజకీయం మరింత హీటెక్కుతోంది. అమరావతి వ్యవహారం మరో రాజకీయ యుద్ధానికి తెరతీసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏసీబీ దూకుడు మీదుంది సీబీఐ దర్యాప్తు జరపాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది నిజాలు నిగ్గు తేల్చాల్సిందే అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆసక్తికరంగా మారిన అమరావతిపై స్పెషల్‌ స్టోరీ.

అమరావతి భూ సమీకరణ వ్యవహారాలు, దాని చుట్టూ జరిగిన వ్యవహారాలపైనా CBI దర్యాప్తు జరుగుతుందా? ACB విచారణ ఎంతవరకు వచ్చింది? ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని కేంద్రం ఆమోదిస్తుందా?

ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజధాని అమరావతి మీద రచ్చ జరుగుతూనే ఉంది. రాజధాని కోసం 29 గ్రామాల రైతుల నుంచి 33 వేల 500 ఎకరాలు సేకరించిన నాటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నాయకలు తొలి నుంచీ విమర్శిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాగానే అమరావతి అక్రమాలకు విచారణ జరిపించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏసీబీ విచారణ జరుగుతోంది. కొంతమంది నిందితుల్ని కూడా గుర్తించారు. పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వం మొత్తం వ్యవహారంపైన, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పైన సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

భూ సమీకరణ తర్వాత ప్రపంచస్థాయి రాజధాని పేరుతో సింగపూర్‌ కంపెనీతో ఒప్పందాలు, కోర్‌ కేపిటల్‌ కోసం డిజైన్ల రూపకల్పన, తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించి పాలన సాగించారు. నాలుగేళ్ళ పాటు సాగిన ఈ వ్యవహారం తర్వాత తుది డిజైన్లను ఆమోదించి శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఈ శంకుస్థాపనలు జరిగాయి. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. తెలుగుదేశం స్థానంలో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అధినేత జగన్‌ అమరావతికి జై కొట్టారు. అయతే ఆ తర్వాత భూ సమీకరణలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ప్రతిపక్షం ఆరోపించింది. అధికారంలోకి వచ్చాక ఆరోపణలకు మరింత పదును పెట్టింది.

రాజధాని ప్రకటనకు ముందే బినామీ పేర్లతో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున భూములు కొన్నారని భావించిన వైసీపీ ప్రభుత్వం దీనిపై నిగ్గు తేల్చడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని వేసింది. అక్రమాలు నిజమేనని మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా భూములు కొన్నవారిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, పలువురు టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంగం నిర్థారించింది. 2014 జూన్‌ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31 వరకు ఈ కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌ బినామీగా చెబుతున్న వేమూరి రవి కుటుంబం పేరుతో 62 ఎకరాలు భార్యా, బంధువుల పేర్లతో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ కొన్ని వందల ఎకరాలు కొన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.

చంద్రబాబు మంత్రివర్గంలో ఉండి అమరావతి వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన నారాయణ సైతరం తన సన్నిహితుల పేర్లతో 55.27 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి సైతం బినామీ పేర్లతో 68.6 ఎకరాలు కొన్నట్లు సమాచారం. మరో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం గుమ్మడి సురేష‌్‌ పేరుతో 40 ఎకరాలు కొన్నారని మైత్రీ ఇన్‌ఫ్రా పేరుతో ప్రస్తుత బీజేపీ నేత, నాటి టీడీపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కూడా 40 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. అలాగే జగ్గయ్యపేట దగ్గర హిందూపురం ఎమ్మల్యే నందమూరి బాలక్రిష్ణ వియ్యంకుడికి చెందిన విబిసి కెమికల్స్‌కు 498 ఎకరాలు కేటాయించడంలో కూడా అవకతవకలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో తెలిపింది. తమ మనుషుల ద్వారా భూములు కొనిపించిన తర్వాతే CRDA పరిధిని దానికి అనుగుణంగా మార్చారని తేల్చింది. 1977 అసైన్డ్‌ భూముల చట్టాన్ని 1989 SC, ST హక్కుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్థారించింది.

అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇది దేశంలోనే పెద్ద కుంభకోణమన్నారాయన. అందుకే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని తమ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తప్పు చేయకపోతే అమరావతి భూములపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయనే స్వయంగా కోరాలని డిమాండ్‌ చేశారు అంబటి రాంబాబు.

భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మిగిలిన పని పూర్తి చేయడానికి ఏసీబీని రంగంలోకి దింపింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణను ఇతర పార్టీలు సమర్థిస్తున్నాయి ఒక్క టీడీపీ మాత్రమే కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. పనిలో పనిగా విశాఖలో వైసీపీ నేతల భూముల దందాపై కూడా దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.

భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మిగిలిన పని పూర్తి చేయడానికి ఏసీబీని రంగంలోకి దింపింది. నాటి ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. దమ్మాలపాటి తీగలాగితే డొంకంతా కదులుతుందనే చర్చ వినిపిస్తోంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ప్రభుత్వం దానిపై పూర్తిస్థాయి ఆధారాలు ప్రజల ముందు పెట్టే పనిలో బిజీగా ఉంది. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ తో పాటు 12 మందికి నోటీసులిచ్చింది. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏసీబీ విచారణను స్వాగతిస్తున్నాయి. నాటి ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల వ్యవహారంలో కుంభకోణం నిజమే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై నిజం నిగ్గు తేల్చాల్సిందే అంటున్నాయాన. అయితే వరుస దెబ్బలతో కుదేలవుతున్న టీడీపీ ఈ విచారణల పట్ల ఎలా పోరాడుతుందో చూడాలి. ఇప్పటికే పలు కేసులపై కోర్టులను ఆశ్రయిస్తున్న టీడీపీ ఏసీబీ విచారణపై ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తి కరంగా ఉంది. ఇదంతా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప అక్కడ ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటున్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణను స్వాగతిస్తున్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో ఎవరి పాత్ర ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నాయి వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు. మొత్తంగా ఇప్పుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఏసీబీ కేసు సీబీఐ కేసులతో ఎటువంటి ఆసక్తికర పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories