MLA Roja: ఈసారి కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమేనా?

Will MLA Roja Gets Cabinet Minister Post This Time
x

MLA Roja: ఈసారి కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమేనా?

Highlights

MLA Roja: ఫైర్‌బ్రాండ్ రోజాకు రాజకీయం కలిసి రావడం లేదా? అధికారంలోకి వస్తే అందలమెక్కడం ఖాయమనే లెక్కలు ఎప్పటికప్పుడు తప్పుతున్నాయా?

MLA Roja: ఫైర్‌బ్రాండ్ రోజాకు రాజకీయం కలిసి రావడం లేదా? అధికారంలోకి వస్తే అందలమెక్కడం ఖాయమనే లెక్కలు ఎప్పటికప్పుడు తప్పుతున్నాయా? రాజకీయ సుడిగుండాల్లో ఉన్న రోజాకు ఆశించిన పదవి దక్కుతుందా? ఈసారైనా అమాత్య యోగం పడుతుందా? మంత్రి పదవిని ఆశిస్తున్న రోజాకు ముఖ్యమంత్రి సరేనంటారా సర్దుకోమంటారా? అదే నిజమైతే అప్పుడు ఏపీఐఐసీ, ఇప్పుడు ఏంటి?

ఏపీలో దసరా తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి కొత్త మంత్రులు రాబోతున్నారన్న చర్చ జరుగుతున్నా ఆ కొత్తవారు ఎవరన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్. అప్పట్లో అన్నీ ఈక్వేషన్లను లెక్కలేసి చక్కగా కూర్చిపెట్టి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గానికి సీఎం జగన్ ఇచ్చిన సమయం దాదాపు ముగిసిపోతోంది. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రుల మార్పు ఉంటుందని అప్పట్లోనే ప్రకటించడంతో పొజీషన్‌లో ఉన్న వారందరూ కూడా క్లారిటీతో ఉన్నారు. కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది.

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన రోజా ఎన్నాళ్ల నుంచో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. తొలిసారి గురి తప్పినా ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా ఉంది ఆమె ధీమా. త్వరలో జరగబోయే క్యాబినెట్‌లో బెర్తు ఖాయమని ఆమె అనుచరులు ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. కానీ అప్పడు ఉన్నట పరిస్థితులు ఇప్పుడు లేవని, మళ్లీ మారుతున్నాయన్న ప్రచారం మధ్య రోజా మరోసారి డల్‌ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణ మధ్య ఈసారి కూడా ఆమెకు సర్దుబాటు పోస్టేననే టాక్‌ వినిపిస్తోంది.

దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఏం చేసినా ఓ సంచలనంగా మారుతున్న రోజా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ఆటుపోట్లనే ఎదుర్కొంటున్నారు. జగన్ కోసం చేసిన పొలిటికల్ ఫైట్‌లో ఆమె చాలానే లాసయ్యారని చెప్పుకుంటున్నారు. ఆఖరకు ఎమ్మెల్యేగా ఉండి ఏడాదికి పైగా అసెంబ్లీలో అడుగుపెట్ట లేకపోయారు. ప్రభుత్వం రాగానే కోల్పోయినవన్నీ తిరిగి పొందొచ్చనే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో వాటిని లెక్కచేయకుండా ఎదురేగారు. ఆ తర్వాత ఆమె అనుకున్నట్టే జరిగింది. పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది ప్రభుత్వమైతే ఏర్పాటైంది కానీ ఆమె రాత మాత్రం మారలేదట. తొలి మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు ఆశించిన గుర్తింపు రాలేదు. ఆమెను ఓదార్చడానికి ఇచ్చిన ఏపీఐఐసీ పదవి ఎందుకూ పనికి రాలేదన్న ప్రచారం నడిచింది.

ప్రభుత్వంలో ప్రాధాన్యత విషయం అటుంచితే, సొంత నియోజకవర్గంలోనూ ఆమెకు అడుగడుగునా అడ్డంకులే వస్తున్నాయట. జిల్లాలో పగబట్టిన పాతకాపులు కోడెనాగులై బుసకొడుతున్నా ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారట. దీంతో సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ లీడర్లు తనకు వ్యతిరేకంగా నిలబడి బహిరంగంగా తొడగొట్టే పరిస్థితి నెలకొంది. ఈ కృంగుబాటు నుంచి కోలుకోవాలన్నా నియోజకవర్గంలో తన పలుకుబడి పునరేకీకరణ జరగాలన్నా తనకు మంత్రి పదవి రాకపోతే కుదరదని జగన్ దగ్గర ఆయన సన్నిహిత టీం దగ్గర ఆమె మొరపెట్టుకున్నట్లుగా సమాచారం.

ఈసారి మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండబోదన్నది రోజా ఆలోచన. జిల్లాలో పరిస్థితులను ధీటుగా ఎదుర్కోవాలన్నా, నియోజకవర్గంలో ఏం చేయాలన్నా అధికారం ఉంటే తప్ప సాధ్యం కాదని ఆమెకు అర్థమైందంటున్నారు విశ్లేషకులు. దీంతో సీఎం నుంచి బలమైన భరోసా దొరికినట్లు ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. కాకపోతే, జిల్లాలో మాత్రం భిన్నమైన ప్రచారం జరుగుతోంది. మారిన పరిస్థితుల వల్ల ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డిని తొలగించే పరిస్థితులు ఉండకపోవచ్చన్న టాక్‌ నడుస్తోంది. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఉద్వాసన పలికినా అదే సామాజికవర్గానికి మంత్రిపదవి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయాల్సి వచ్చినప్పుడు జగన్‌నే నమ్ముకున్న కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శీనుకు ఆ అవకాశం దక్కనుంది. ఒకే సామాజికవర్గం నుంచి ఇద్దరికి మంత్రిపదవులు సాధ్యం కాకపోవచ్చు. మూడు ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు రిజర్వుడు కేటగిరిలో ఉన్న చిత్తూరు జిల్లాలో వెనుకబడిన కులాల నుంచి మంత్రి వర్గానికి ప్రతిపాదించే అవకాశాలు పరిశీలన చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది.

రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాల్సి వస్తే ఆ బెర్తు కోసం జగన్ అనుంగు నేత చెవిరెడ్డి ఖర్చీఫ్ వేసి ఉంచేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం కూడా అతని పట్ల సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. దీంతో ఈ జిల్లా నుంచి రోజాను ఈసారి కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్నది డౌట్‌గానే ఉందంటున్నారు. తొలిసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రోజాకు గతంలో ఏపీఐఐసీ పదవి ఇచ్చినట్లే ఈసారి ఆమెకు మరేదో పదవిచ్చే ఆలోచన జరగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. టీటీడీ బోర్డులోకి ప్రవేశం ఉన్న తుడా ఛైర్మన్‌ను ఆమెకు అప్పగించడం ద్వారా డబుల్ ధమాకా అవకాశం కల్పించడం ప్రొటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా కల్పించడం అయినట్లవుతుందన్నది ఓ స్కెచ్ అట. అలాగే ప్రభుత్వ చీప్ విప్ పదవిని కూడా కట్టబెట్టే యోచన జరుగుతోందట. అలా చేస్తే సరిపోతుందని, క్యాబినెట్ కూర్పు చేసే కీలక నేతల ముందు కొందరు ఈ మ్యాప్ వేసినట్లు ప్రచారం జరగుతోంది. ఇంటాబయట పోరాడుతూ అధికారాన్ని ఆస్వాదించలేక లావాలా రగులుతున్న ఆవేదనను దిగమింగుకుని ఆశతో ఎదురుచూస్తున్న రోజా వీటిని అంగీకరిస్తారా? అది ప్రశ్నార్థకమే. గతంలో ఏపీఐఐసీ పదవినే వద్దని విసిరేసిన ఆమెను పార్టీ పెద్దలు బుజ్జగించే వరకు చేపట్టని రోజా, మంత్రిపదవిలో ఈ మలుపులే జరిగితే ఎలా వ్యవహరిస్తారనేది జిల్లా రాజకీయల్లో చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories