2021-22 బడ్జెట్: ఈసారైన ఏపీకి న్యాయం జరుగుతుందా?

2021-22 బడ్జెట్: ఈసారైన  ఏపీకి న్యాయం జరుగుతుందా?
x

2021-22 బడ్జెట్: ఈసారైన ఏపీకి న్యాయం జరుగుతుందా?

Highlights

*ప్రత్యేక హోదాతో విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులు *పరిశ్రమలు లేకపోవడంతో కష్టమైన ఉపాధి *ప్రైవేటురంగంలోనూ భారీగా పరిశ్రమలు వచ్చేలా కేంద్రం చొరవ చూపాలి

ఈసారైనా కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? భారీ వరాలు లేకపోయినా, ఇచ్చిన హామీలనైనా కేంద్రం పూర్తిగా నెరవేరుస్తుందా? అని ఎదురుచూడటం, బడ్జెట్‌ చూశాక నిట్టూర్చడం అలవాటైపోయింది..! ఈసారి బడ్జెట్‌లోనైనా తమ ఆకాంక్షలు నెరవేరుతాయా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ అమలు వంటి డిమాండ్‌లను నెరవేరుస్తుందా? అని మరోసారి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

దేశ ఆర్థిక పురోభివృద్ధి గమనాన్ని నిర్ణయించేది కేంద్ర బడ్జెట్. బడ్జెట్​ అంటే అన్ని రంగాల్లో ఆశలు, అంచనాలు సహజమే. అయితే ఈ సారి బడ్జెట్లోనైనా ఏపీ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్రానికి హోదా ప్రకటించే దిశగా ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రత్యేక హోదాతో విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులను, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల్లో సింహభాగం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి కష్టమైపోయింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలతోపాటు ప్రైవేటురంగంలోనూ భారీగా పరిశ్రమలు వచ్చేలా కేంద్రం చొరవ తీసుకోవాలని, బల్క్‌డ్రగ్‌ పార్కులు వంటి ప్రాజెక్టుల్ని మంజూరు చేసి ఫార్మారంగం అభివృద్ధికి ఊతమివ్వాలని రాష్ట్రం కోరుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఒకట్రెండు తప్ప పెద్ద పరిశ్రమలు లేవు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా పనులు పూర్తయితే... కొత్త పరిశ్రమలు వస్తాయి. ఆ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. వాటిని వేగంగా పూర్తి చేయటానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సి ఉంది. విభజన చట్టంలో భాగంగా కేంద్రం హామీ ఇచ్చిన సంస్థల్లో గిరిజన యూనివర్శిటీ కూడా ఉంది. దాని ఏర్పాటు దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగూ పడలేదు. ఏపీలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. వాటిలో ఒక్క విశాఖకు మాత్రమే కొవిడ్‌కి ముందు వరకు మూడు నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండేవి. కొవిడ్‌ తర్వాత అవీ నిలిచిపోయాయి. అంతర్జాతీయ విమానాలు వచ్చేలా చర్యలు ప్రకటించాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదు. ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కాకుండా కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిపి, పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలి.

విశాఖ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించి రెండేళ్లవుతోంది. రాష్ట్రంలోని 3,496 కి.మీ. మార్గమంతా దీని పరిధిలోకి వచ్చేలా అధికారులు డీపీఆర్‌ పంపారు. గత బడ్జెట్‌లో కొత్త జోన్‌, రాయగడలో కొత్త డివిజన్‌ ఏర్పాటుకు కలిపి తూర్పుకోస్తా జోన్‌ బడ్జెట్‌లో మొక్కుబడిగా 3 కోట్లు కేటాయించారు. వాటిని రాయగడకే ఖర్చ చేస్తున్నారు. విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారి-65 వెంట హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ప్రాజెక్ట్‌ కావాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ఇదివస్తే తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం సులభమవ్వడమే కాకుండా, దూరమూ తగ్గుతుంది. ఇక విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరుకు మూడు మార్గాలుగా కలిపి 106 కి.మీ. మేర కొత్తలైన్‌ మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పలు ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ దశాబ్దాలుగా పూర్తవడం లేదు. పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. మొత్తానికి రైలు ప్రాజెక్టులకు సరిపడా నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. మరి ఈసారి ఏమిస్తారో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories