త్వరలో బ్రాహ్మణికి చంద్రబాబు పార్టీలో బాధ్యతలు ఇవ్వబోతున్నారా?

Brahmani TDP Chief Chandrababu Naidu
x
త్వరలో బ్రాహ్మణికి చంద్రబాబు పార్టీలో బాధ్యతలు ఇవ్వబోతున్నారా?
Highlights

నందమూరి కూతురు, నారావారి కోడలు బ్రాహ్మణి, పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దమవుతోందా? త్వరలో ఆమెకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించబోతున్నారా? తాజాగా లోకేష్‌...

నందమూరి కూతురు, నారావారి కోడలు బ్రాహ్మణి, పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దమవుతోందా? త్వరలో ఆమెకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించబోతున్నారా? తాజాగా లోకేష్‌ దంపతులు ఇచ్చిన విందే, అందుకు తొలి అడుగా? నారా బ్రాహ్మణికి ఎలాంటి పదవి ఇవ్వాలని, అధినేత ఆలోచిస్తున్నారు? అటు లోకేష్‌ విందు రాజకీయం ఎందుకు వివాదం రేపుతోంది?

తెలుగుదేశం విందు రాజకీయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి, బ్రాహ్మణి దంపతులు ఏర్పాటు చేసిన ఈ విందుపై వివాదాలే కాదు, భవిష్యత్తు రాజకీయాల సంకేతాలున్నాయన్న మాటలు వినపడ్తున్నాయి. ఈ విందులో పాల్గొన్నది మొత్తం టీడీపీ నేతల రాజకీయ వారసులే. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన సుపుత్రులు, సుపుత్రికలే. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది విందు.

పేరుకే విందు కార్యక్రమం. కానీ తాజా రాజకీయ పరిణామాలే ప్రధానాంశాలుగా సమాలోచనలు జరిగాయట. భవిష్యత్ కార్యాచరణతో పాటూ పార్టీ బలోపేతంపై డిస్కషన్ చేశారట. అయితే, ఈ మొత్తం పార్టీలో హైలెట్‌ ఎవరంటే, బ్రాహ్మణే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకేష్‌తో కలిసి నేతలతో మాట్లాడుతూ, అందరితో సరదాగా కలియతిరిగారట బ్రాహ్మణి. యంగ్‌స్టర్స్‌ మీటింగ్‌లో బ్రాహ్మణి కూడా తన ఆలోచనల్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై లోకేష్‌తో కలిసి పార్టీ నేతలతో చర్చించారట.

ఎన్నడూలేనిది పార్టీ యువనేతలతో జరిగిన సమావేశంలో నారా బ్రాహ్మణి పాల్గొనడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె మళ్లీ ఈ విందు కార్యక్రమంతో యాక్టివ్ అయ్యారంటున్నారు. అంతేకాదు, ఆమె రాజకీయ ఆరంగేట్రం సైతం చేస్తారన్న అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రాకపోయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారనే ప్రచారం నడుస్తోంది.

బ్రాహ్మణిని కూడా రాజకీయాల్లో క్రియాశీలకం చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలతో మమేకం చేసేందుకు ఆలోచిస్తున్నారట. లోకేష్‌కు చేదోడువాదోడుగా వుండేలా క్రియాశీలకం చెయ్యాలనుకుంటున్నారట. త్వరలో ఆమెకు పార్టీలో బాధ్యతలు సైతం అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది.

నందమూరి ఆడపడుచుగా, నారా కోడలిగా బ్రాహ్మణికి పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అంతేకాదు, చక్కగా తెలుగు, ఇంగ్లీష్‌లో మాట్లాడి మెప్పించగల నేర్పరిగానూ ఆమెను కొనియాడేవారున్నారు. అందుకే ఆమె రాజకీయాల్లోకి రావాలని, గతంలోనే డిమాండ్‌ వినపడింది. అయితే ఆమె మాత్రం, తనకిప్పుడు ఇంట్రెస్ట్‌ లేదని చెబుతూ వచ్చారు. తన దృష్టి మొత్తం బిజినెస్‌పై ఉందన్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యమూ ఇందుకు బలాన్నిస్తోంది. చంద్రబాబుకు వయసు మీదపడుతోందని, కొత్త తరం చేతుల్లోకి పార్టీ మారకతప్పదన్న మాటలు వినపడ్తున్నాయి. అందుకే భవిష్యత్తులో నారాలోకేష్‌కు చేదోడువాదోడుగా వుండేందుకు, బ్రాహ్మణికి పార్టీలో ఏదో ఒక పోస్టు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట చంద్రబాబు.

నారా బ్రాహ్మణిపై రాజకీయ అంచనాలను పక్కనపెడితే, విందు రాజకీయం మాత్రం తెలుగుదేశంలో కొత్త వివాదానికి ఆజ్యంపోసింది. రాజకీయ వారసులనే పార్టీకి పిలిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఓడిపోయిన నేతలు, మంత్రుల సుపుత్రులు, సుపుత్రికలే రాబోయే కాలంలోనూ రాజకీయ వారసులుగా చెలామణి అవుతారని, వారికే పార్టీలో ప్రాధాన్యం వుంటుందన్న సంకేతాలు, లోకేష్ ఇచ్చారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారసత్వ రాజకీయాలు పక్కనపెట్టి, పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహించాల్సిందిపోయి, మళ్లీ వారసులనే తెరపైకి తేవడమేంటన్న మాటలు వినపడ్తున్నాయి. అంటే తరతరాలుగా ద్వితీయ శ్రేణి నేతలు, అగ్రనాయకులు, వారి వారసుల పల్లకిని మోసే బోయలుగా వుండాల్సిందేనా అన్న విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్నాయి. మొత్తానికి పార్టీలో యంగ్‌ నేతలకు పార్టీ ఇచ్చి, పార్టీలో జోష్‌ నింపుదామనుకున్న లోకేష్‌కు, విందు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్టయ్యింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories