హైకమాండ్‌కు సోము పంపిన సీల్డ్‌ కవర్‌తో బీజేపీలో భూకంపమేనా?

హైకమాండ్‌కు సోము పంపిన సీల్డ్‌ కవర్‌తో బీజేపీలో భూకంపమేనా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయా? సోము వీర్రాజుకు సహాయ నిరాకరణ సాగుతోందా? బీజేపీలో వున్న ఏ లీడర్‌, సోముకు వ్యతిరేకంగా పావులు...

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయా? సోము వీర్రాజుకు సహాయ నిరాకరణ సాగుతోందా? బీజేపీలో వున్న ఏ లీడర్‌, సోముకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు? ఇక వీరితో వేగలేకపోతున్న సోము, బీజేపీ అధిష్టానానికి నివేదిక ఇచ్చారా? ఏపీ బీజేపీలో ఆ రిపోర్ట్‌ ప్రకంపనలు రేపడం ఖాయమా?

సోమువీర్రాజు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు. దూకుడుకే దూకుడు అన్నట్టుగా యమ స్పీడ్‌గా వుంటారన్న పేరు. ఏపీలో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఏకైక లక్ష్యంతో, ఎప్పటికప్పుడు అలజడి రేపుతున్నారు. నిత్యం ఏదో ఇష్యూపై స్పందిస్తుంటారు. అయితే, స్టేట్‌ బీజేపీలో ఆయనను ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే ఇప్పుడు సోమువర్గంలో అలజడి రేపుతోంది.

పార్టీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి, ప్రక్షాళకు శ్రీకారం చుట్టారు సోము. కన్నా హ‍యాంలో ఏవైతే తప్పులు దొర్లాయో, అవి జరక్కుండా చూసుకోవాలకున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు, నేతల పట్ల సీరియస్‌గా దృష్టిపెట్టారట సోము. ముందే అలర్టయిన సదరు నేతలు, సోము ముందరికాళ్లకు బంధనం వేసేందుకు ఎత్తులు ప్రారంభించారట. ఆ ఎత్తులుపైఎత్తుల ప్రచ్చన్న యుద్ధమే కాషాయంలో నివురుగప్పిన నిప్పులా వుందట.

సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత, సుజనా చౌదరి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆయన అనుచరులకు పైతం చెక్‌పెట్టడం ప్రారంభించారు సోము. సుజనాకు, అత్యంత సన్నిహితుడైన లంకా దినకర్‌ను సోము వీర్రాజు పార్టీ నుంచి సస్పెండ్ చేయించారట. దీంతో మరింత రగిలిపోయిన సుజనా, ఇలాగే వదిలేస్తే, బీజేపీలో తన కథ కంచికేనని డిసైడే, కౌంటర్ స్ట్రాటజీలకు పదునుపెట్టారట. సోమువీర్రాజుకు సహాయ నిరాకరణ అందులో మొదటిది. ఆ‍యన ఎలాంటి పిలుపునిచ్చినా, స్పందన పెద్దగా రాకుండా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. బీజేపీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెళ్లేలా చేస్తున్నారట. బీజేపీలోనే వుంటూ, బీజేపీకే వ్యతిరేకంగా పావులు కదుపుతూ, అంతిమంగా టీడీపీకి మేలు జరిగేలా చేస్తున్నారని, సుజనా వర్గంపై రగిలిపోతున్నారట సోము. అందుకే అధిష్టానానికే, సుజనాపై కంప్లైయింట్ చేశారట. సీల్డ్‌కవర్‌ నివేదికలో అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు వెల్లడించారట. ఆ రిపోర్టే, బీజేపీలో ప్రకంపనలు రేపడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

సుజనా వర్గానికి సైతం అదే నివేదిక కలవరపెడుతోందట. బీజేపీలో వున్నా, టీడీపీ గురించే ఈ నేతలంతా ఆలోచిస్తున్నారని, అది అంతిమంగా బీజేపీకి నష్టదాయకమని నివేదికలో చెప్పారట సోము. రాజ్యసభ సభ్యత్వం వుండటంతో ఉపేక్షిస్తున్న బీజేపీ, కోల్డ్‌వార్‌ శ్రుతిమించితే, కాషాయ తీర్థం పుచ్చుకున్న తెలుగు తమ్ముళ్లందర్నీ కట్టకట్టి, బయటకు పంపేందుకూ ఆలోచిస్తోందట. సుజనా వర్గానికి చెక్‌ పెడితే, ఇక మరింత స్వేచ్చగా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టడానికి వీలవుతుందని భావిస్తున్నారట సోము వీర్రాజు. చూడాలి, రానున్న రోజుల్లో, ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories