పాపం పితాని అని ఆచంటలో ఎందుకంటున్నారు?

పాపం పితాని అని ఆచంటలో ఎందుకంటున్నారు?
x
పాపం పితాని అని ఆచంటలో ఎందుకంటున్నారు?
Highlights

ఆయన వరుసగా ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే బలమైన బీసీ నేతగా పేరుతెచ్చుకున్నారు. రాజకీయ...

ఆయన వరుసగా ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే బలమైన బీసీ నేతగా పేరుతెచ్చుకున్నారు. రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ ఏదైనా, ముఖ్యమంత్రి ఎవరైనా క్యాబినెట్‌లో మంత్రిగా చక్రం తిప్పారు. ఆయా ముఖ్యమంత్రులకు సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నారు. ఇలా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఆ మాజీ మంత్రిగారు, ఇప్పుడు వైసిపి దెబ్బకు చిక్కుల్లో పెడ్డారట. మద్దతివ్వాల్సిన సొంత పార్టీ నేతలు మౌనం దాల్చడంతో ఒంటరి పోరాటం చేస్తున్నారట.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. వైఎస్‌ హయాంలో చక్రంతిప్పిన నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ ఏదైనా ఆచంట నియోజకవర్గం మాత్రం ఆయనకు కంచుకోట. గత ఎన్నికలకు ముందు వరకూ ఆయన మాటకు ఎదురు నిలిచిన పార్టీ, నాయకుడు లేడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మొదలు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇలా ముఖ్యమంత్రులు, పార్టీలు అధికారం మారారే తప్ప పితాని సత్యనారాయణకు మంత్రి పదవి మాత్రం మారలేదు. ఇలా ఓ వెలుగు వెలిగిన పితానిపై తాజాగా ఈఎస్‌ఐ స్కామ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

వరుసగా మూడుసార్లు మంత్రిని చేసిన అదృష్టం కాస్తా ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్టుంది. వైసిపి ప్రభుత్వం రావడం, పితాని ఓటమిపాలవ్వడంతో మాజీ మంత్రిగారి పరిస్దితి తారుమారైయ్యింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని, అందులో పితాని పాత్ర కూడా ఉందన్న ఆరోపణలతో కంగుతిన్నారు మాజీ మంత్రి. తానేలాంటి తప్పు చేయలేదని, కావాలనే వైసిపి తనను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పితాని కాస్త తగ్గినప్పటికీ జిల్లా టిడిపిలో బలమైన నేతగానే పేరుతెచ్చుకున్నారు. అంతగా రోడ్డెక్కిన దాఖలాలు లేకపోయినా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ విమర్మలు దాడి కొనసాగించారు. ఇప్పుడు పితానికి చెక్ పెట్టకపోతే భవిష్యత్‌లో వైసిపికి ఇబ్బందులు తప్పవనే, తమ పార్టీ బిసి నేతలను టార్గెట్ చేస్తున్నారని టిడిపి విమర్మిస్తుంటే, తప్పు చేసారు తప్పించుకోలేరు అంటూ వైసిపి లెక్కలు తవ్వుతోంది.

గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ లక్ష్యంగా వైసిపి కక్షసాధింపుకు దిగుతోందంటూ టిడిపి మండిపడుతోంది. జిల్లాలో టిడిపికి దిక్చూచిలా వ్యవహరిస్తున్న పితాని వ్యవహార శైలి అధికార పార్టీకి రుచించడంలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తాజాగా ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో మందుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే టిడిపి హయాంలోనే ఇద్దరు డైరెక్టర్లపై విచారణకు ఆదేశించింది తామని చెప్పారు మాజీ మంత్రి పితాని. విజిలెన్స్ రిపోర్టులో తమ పేర్లు లేకపోయినా మంత్రి జయరామ్ తమపై బురద జల్లుతున్నారని విమర్శిస్తున్నారు.

వాస్తవానికి పితాని సత్యనారాయణ టిడిపిలో చేరక ముందు వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైసిపి ఏర్పడిన తర్వాత వైఎస్‌కు దగ్గరగా ఉన్నవారంతా ఆ పార్టీలోనే చేరుతారని భావించారు. కానీ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు పితాని, వట్టి అటు వైపు చూడలేదు. గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చినా, ఆయన మొగ్గలేదనేది టాక్. ఎన్నికలు ముగిశాయి. అధికారం తారుమారైయ్యింది. నేతలు ఎవరి రాజకీయం వారు చేస్తూనే ఉన్నారు. పార్టీల మధ్య విభేదాలు తారాస్దాయికి చేరడంతో, ఆయా పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అనే స్దాయికి చేరుకున్నారు.

విచారణలో నిజానిజాలు ఎలానూ తేలుతాయి. స్కాంలో పితాని భాగస్వామ్యం ఎంతవరకూ అనేది త్వరలో వెలుగుచూస్తుంది. అయితే ఈలోపు తమపార్టీ నేతకు అండగా నిలవాల్సిన జిల్లా టిడిపి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మనకెందులే అని లైట్ తీసుకున్నట్లగా కనిపిస్తోంది. అదే పితాని వర్గం ఆవేదన కూడా. ఏదైమైనా పితాని తనపై వచ్చిన అవినీతి ఆరోపణలో ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆయన అనుచరులంటున్నారు. అండగా నిలుస్తుందని ఆశించిన పార్టీ, అంతకంతకూ దూరం పెడుతోందని, పితాని వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, మంత్రిగా అనేక ఏళ్లు చక్రంతిప్పిన పితాని, ఆరోపణల చక్రబంధనంలోంచి ఎలా బయటపడతారో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories