పిలిచి పదవి ఇస్తామంటుంటే విశాఖ వైసీపీ నేతల కలవరమెందుకు?

పిలిచి పదవి ఇస్తామంటుంటే విశాఖ వైసీపీ నేతల కలవరమెందుకు?
x
Highlights

ఆ పదవి అంటే, లీడర్లకు మహా ఇష్టం. కానీ ఎందుకనో కొంచెం కష్టం అంటున్నారట. పొరపాటున ఆ పవర్‌ఫుల్ పోస్ట్ చేపట్టినా, గ్రహపాటుతో వేటు తప్పదని...

ఆ పదవి అంటే, లీడర్లకు మహా ఇష్టం. కానీ ఎందుకనో కొంచెం కష్టం అంటున్నారట. పొరపాటున ఆ పవర్‌ఫుల్ పోస్ట్ చేపట్టినా, గ్రహపాటుతో వేటు తప్పదని కంగారుపడుతున్నారట. అంత హాటు హాటు సీటును ఆశిస్తూ, ఫేటు తిరగబడుతుందని ఎందుకు ఫీలవుతున్నారు?

రాజకీయాల్లో కొన్ని పదవులుంటాయి. వాటిని అధిరోహిస్తే, ఇక తిరుగుండదన్న అభిప్రాయం వుంటుంది. అలాగే కొన్ని పొస్టులు స్వీకరిస్తే, పొలిటికల్ తిరోగమనమేనన్న సెంటిమెంట్‌ కూడా అంతే బలంగా వుంటుంది. అలాంటి ఒక పదవే విశాఖలో వైసీపీ నేతలను కొంచెం ఇష్టం, కొంచెం కష్టమంటున్నట్టుగా కలవరపెడుతోందట. రాజకీయాల్లో నేతలకు సెంట్‌మెంట్‌లు ఎక్కువ. కొన్ని పదవులు నేతలకు అచ్చిరావన్న అభిప్రాయాలుంటాయి. అలాంటి పదవి, విశాఖలో కూడా ఒకటి ఉంది. అయితే ఆ పదవి చేబడితే తరువాత రాజకీయ భవిష్యత్ ఉండదని కొందరి సెంటిమెంట్. ఎందుకంటే, ఆ పోస్ట్ హిస్టరీ అలాంటిది మరి.

విశాఖ నగరాభివృద్ధి సంస్థ. ఇటీవల పేరు మార్చి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీగా ఏర్పాటు చేశారు. దీంతో అప్పట్లో వుడా చైర్మన్ పదవి అన్నా, ఇప్పుడు విఎంఆర్‌డిఏ చైర్మన్ పోస్టు అన్నా, చాలా వెయిట్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఈ చైర్మన్ చుట్టూ తిరగాల్సిందే. అంతటి కీలకమైన పోస్టు అది. ఎందుకంటే విశాఖ అర్బన్‌తో పాటు, రూరల్‌లోని కొన్ని మండలాలు, పొరుగున ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు కూడా, దీని పరిధిలోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్న నాటి నుంచీ, ఈ పదవికి వెయిట్ బాగా పెరిగిపోయింది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఈ పోస్ట్‌ కోసం రేస్ మొదలవుతుంది. అంతిమంగా అష్టకష్టాలుపడి పదవి దక్కించుకున్న నేతలు, చివరకు భవిష్యత్ లేకుండా పోవడం, ఇప్పుడున్న నేతలకు గగుర్పాటు కలిగిస్తోంది.

విశాఖ నగరాభివృద్ధి సంస్థ చైర్మన్‌లుగా, ద్రోణంరాజు సత్యనారాయణ, సుబ్బారావు, ఎంవీవీఎస్ మూర్తి, మరియదాసు, సూర్రెడ్డి, గంగిరెడ్డి, ఎస్. ఏ.రెహమాన్, రవి, గతంలో ఛైర్మన్లుగా పనిచేశారు. వుడాను విఎంఆర్‌డిఏగా మార్చిన తర్వాత, దాని చైర్మన్‌గా మొన్నటి వరకు ద్రోణంరాజు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాసు తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ, డీవీ సుబ్బారావు, మూర్తి మినహా, ఎవ్వరికీ ఈ పదవి కలిసి రాలేదు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వలస వచ్చిన నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విఎంఆర్‌డిఏ, చైర్మన్‌గా కీలక పదవిని సీఎం జగన్ కట్టబెట్టారు. అయితే ఏడాది కాలం మాత్రమే విఎంఆర్‌డిఏ చైర్మన్ పదవీ కాలం. పదవీ కాలం ముగిసిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా వున్న ద్రోణంరాజు, ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రి, దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ కూడా అప్పట్లో వుడా చైర్మన్ గా పని చేసారు. ఎంపీగానూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇటు కాంగ్రెస్‌లోనూ చక్రం తిప్పిన ద్రోణంరాజు సత్యనారాయణ, ఈ పదవి చేపట్టిన తర్వాత ఎమ్మెల్యేగా ఓసారి ఎన్నికై, రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా చేశారు. ఐతే ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌కు, ఈ పదవి అచ్చిరాలేదని అనుచర వర్గీయులు అంటున్నారు. తెలుగుదేశం హయాంలో కూడా ఇదే వుడా చైర్మన్‌గా దివంగత నాయకులు ఎంవీవీఎస్ మూర్తి పని చేసారు. తెలుగుదేశంలోనూ, ఆ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వాల్లోనూ, మూర్తి చెప్పిన మాటకు ఎదురులేదు. అలాంటిది, మూర్తి ఓసారి వుడా చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి చేపట్టాక ఎంపీగా ఎన్నికల్లో గెలిచారు. సీనియర్ నేత డీవీ సుబ్బారావు కూడా వుడా చైర్మన్‌గా చేసిన తర్వాత, విశాఖ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత వీరికి ఎటువంటి పదవులూ లేకుండా పోయాయి.

అయితే విశాఖలో ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే సూరెడ్డి, వుడా చైర్మన్‌గా చేసిన తర్వాత కనుమరుగు అయ్యారు. యాండ్రపు మరియదాసు వుడా చైర్మన్‌ తర్వాత రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. అలాగే టిడిపి హయాంలో వుడా చైర్మన్‌గా చక్రం తిప్పిన ఎస్.ఎ. రెహమాన్ పరిస్థితి కూడా ఇంతే. ఛైర్మన్ పదవి చేపట్టిన తరువాత, ఆయన పరిస్థితి తారుమారైంది. ఇక కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో, ప్రతిష్టాత్మకమైన వుడా చైర్మన్ పదవికి, సీనియర్ నాయకుడని రవిని, ఎంపిక చేసారు. రాజకీయాల్లో పెద్దగా ప్రాచుర్యంలో లేని రవి, ఈ కీలక పదవి రావడంతో, ఆయన పేరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మార్మోగిపోయింది. అదే సమయంలో వుడా విశాఖ నగర సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంతో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా, తమ సమస్యలను నివేదించడానికి రవి చుట్టూ తిరిగేవారు. ఇది చూసిన వారంతా రాజకీయాల్లో రవి కీలకంగా ఎదుగుతారని, విశాఖ వ్యవహారాల్లో చక్రం తిప్పుతారని అంతా భావించారు. కానీ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన చుట్టూ గతంలో తిరిగిన వారే కన్నెత్తి చూడటం మానేసారు. వైఎస్ మరణం తర్వాత, ఆయన కూడా వైసీపీలో చేరినా సరే, పార్టీ పదవి కూడా దక్కలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా సరే, ఏ పదవీ లేదు. ఏదో రోజు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్నారు. కానీ వుడా చైర్మన్ సీటులో కూర్చున్న వారికి, మరే సీటూ దక్కదన్న సెంటిమెంట్‌ను, ఆయన అనుచరులు గుర్తు చేసుకుని ఫీలవుతున్నారు.

ఇలా చాలామందికి ఈ సీట్ అంటే చాలు, చెమటలు పడుతున్నాయి. మాకొద్దీ పదవీ అంటూ పరుగులు తీస్తున్న పరిస్థితి విశాఖలో విచిత్రంగా మారింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం విఎంఆర్‌డిఏ చైర్మన్ పదవికి, వైసీపీలో నాయకులు పోటీ పడుతున్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అత్యంత ఆప్తుడు, సీఎం జగన్‌కు సన్నిహితుడుగా పేరొందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ జీవీ, ఈ పదవి రేసులో ముందున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి, సుధాకర్, రాజు తదితరులు పోటీ పడుతున్నారు. అయితే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే ఈ పదవి ఇవ్వాలని చూస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పేరుకు అత్యంత కీలకమైన పోస్టు అయినా, సెంటిమెంట్ మాత్రం బలంగా వర్కటవుతుండటం, నేతలను బెంబేలెత్తేలా చేస్తోంది. మరి భవిష్యత్తులో ఇంకెవరికి ఈ పదవి దక్కుతుందో, వారికి కూడా సెంటిమెంట్ వెంటాడుతుందా..? లేక దీనిని బీట్ చేసి కొత్త క్రేజ్ ను క్రియేట్ చేస్తారో చూడాలి.

విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవుతున్న నేపథ్యంలో ఈ విఎంఆర్డిఏ ఛైర్మన్ పదవి కీలకం కానుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ ఛైర్మన్ గిరితో, పొలిటికల్ ఫ్యూచర్ ఎలా వుంటుందోనన్న టెన్షన్‌ మాత్రం లీడర్లను వెంటాడుతోంది. చూడాలి, ఈ సీటు ఎవరికో వారి ఫేటు ఎలా వుంటుందో?



Show Full Article
Print Article
Next Story
More Stories