Top
logo

కన్నబాబుపై పవన్‌ కోపానికి ఎక్కడ బీజం పడింది?

కన్నబాబుపై పవన్‌ కోపానికి ఎక్కడ బీజం పడింది?
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు ఒక పేరంటే మహాకోపం. ఆ వ్యక్తి పేరెత్తితే, కోపం నషాళానికి అంటుతుంది. పరుషమైన...

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు ఒక పేరంటే మహాకోపం. ఆ వ్యక్తి పేరెత్తితే, కోపం నషాళానికి అంటుతుంది. పరుషమైన పదజాలంతో రెచ్చిపోతారు. నరనరాన ఆ వ్యక్తి గురించి, ఇంతకోపం నింపుకున్నారా అనిపిస్తుంది పవర్‌ ఫైరవుతుంటే. మొన్న విశాఖ లాంగ్‌ మార్చ్‌లోనూ, ఆయనపై తెగ సీరియస్‌ అయిపోయారు పవన్. ఇంతకీ జనసేనానికి అంతగా కోపం తెప్పిస్తున్నది ఎవరు ఎందుకంత ఆగ్రహం? వీరిద్దరికీ ఎక్కడ చెడింది...?

కన్నబాబుపై అదేపనిగా పవన్‌ కోపమెందుకు?

వరుసగా ఆ‍యనపై ఎందుకు ఫైరవుతున్నారు?

ప్రజారాజ్యంలో కలిసి నడిచిన ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది?

కన్నబాబుపై పవన్‌ కోపానికి ఎక్కడ బీజం పడింది?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, ఏపీ మంత్రి కురసాల కన్నబాబుపై అదేపనిగా ఫైరవుతుండటం, రాజకీయవర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ, కన్నబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ పవన్, తాజాగా మరోసారి కన్నబాబు రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, లాంగ్‌ మార్చ్‌లో తీవ్ర విమర్శలు చేయడంపై పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. కన్నబాబుపై ఇంతగా పవన్‌ ఎందుకు రగిలిపోతున్నాడు కన్నబాబుపై జనసేనాని మనసులో కోపం ఎందుకు గూడుకట్టుకుంది ఈ ఆగ్రహ నేపథ్యమేంటన్నదానిపై, ఎవరికితోచిన రీతిలో వారు భాష్యం చెప్పుకుంటున్నారు. ఇంతకీ వైజాగ్‌ లాంగ్‌ మార్చ్‌లో కన్నబాబుపై పవన్ కామెంట్లు ఏంటి?

వైసీపీ నాయకుడిగా మాట్లాడే కన్నబాబును, తాము రాజకీయాల్లోకి తీసుకొచ్చామని ఇక్కడున్న నాగబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు 'వైజాగ్ నుంచి మంత్రి అయి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారా మీ బతుకులు తెలియవా మీరెక్కడ నుంచి వచ్చారో' అని పవన్ మంత్రి అవంతి శ్రీనివాస్‌ను, మరో మంత్రి కన్నబాబును ఉద్దేశించి ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కన్నబాబు. ఆ టైంలో జనసేన అభ్యర్థి ప్రచారానికి వెళ్లిన పవన్‌, తన కోపాన్ని అణచుకోలేకపోయారు.

కన్నబాబు కాపు సామాజికవర్గం. జర్నలిస్ట్‌గా పని చేశారాయన. చిరంజీవికి వీరాభిమాని కన్నబాబు. జర్నలిస్టుగా పని చేస్తున్న టైంలోనే, మెగాస్టార్‌ చిరంజీవితో కన్నబాబుకు మంచి పరిచయాలుండేవి. వ్యక్తిగతంగా కన్నబాబును సైతం చాలా అభిమానించేవారట చిరంజీవి. ఇద్దరూ కాపు సామాజికవర్గం కావడం కూడా ఆ బంధాన్ని బలోపేతం చేసిందంటారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. చిరంజీవితో ఉన్న సత్సంబంధాల మూలంగా 2009లో కాకినాడ రూరల్ నుంచి పీఆర్పీ టికెట్ దక్కించుకుని గెలుపొందారు కన్నబాబు. 2015లో వైసీపీలో చేరిన కన్నబాబు, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన సందర్భంలో కూడా చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు కన్నబాబు. చిరంజీవితో మంత్రి కన్నబాబుకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల కన్నబాబు సోదరుడు గుండెపోటుతో మృతి చెందిన సమయంలో కూడా చిరంజీవి కాకినాడకు వెళ్లి కన్నబాబును పరామర్శించడమే అందుకు నిదర్శనం. సైరా అదనపు షోల విషయంలోనూ కన్నబాబు హెల్ప్ వుందన్న ప్రచారం వుంది. అయితే, చిరంజీవి, కన్నబాబుల మధ్య ఇంతగా ఫ్రెండ్‌షిప్‌ వున్నా, పవన్‌ కల్యాణ్‌కు మాత్రం, కన్నబాబు అంటే కోపం నషాళానికి అంటోంది. వ్యక్తిగత విమర్శలు సైతం చేస్తున్నారు పవన్. జనసేన అధినేతలో కన్నబాబు పట్ల ఇంత కోపం గూడుకట్టుకోవడానికి కారణాలపై కొన్ని అంశాలు ప్రచారంలో వున్నాయి.

ప్రజారాజ్యం విలీనంలో కన్నబాబు, చిరంజీవిని తప్పుదారి పట్టించారన్న కోపం పవన్‌లో ఇంకా వుంది. రాజకీయాలు పెద్దగా తెలియని తన అన్నయ్యను, అనవసరంగా ఏవో మాటలు చెప్పి, రూట్ చేంజ్ చేశారని, ఇంకా పవన్ మనసులో పెట్టుకున్నారని కొందరు ప్రజారాజ్యం మాజీ నేతలు అంటుంటారు. అంతేకాదు, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పవన్‌పై కన్నబాబు కొన్ని కామెంట్లు చేశారని, అవి కూడా జనసేనాని కోపానికి కారణం అయ్యుండొచ్చన్న వాదన నడుస్తోంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్‌ లేరని, వ్యాఖ్యానించారట కన్నబాబు. ఈ మాటలు పవన్‌ను మరింతగా రగిలిపోయేలా చేశాయన్న చర్చ జరుగుతోంది. అందుకే కన్నబాబు పేరెత్తితే చాలు కోపంతో ఊగిపోతున్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఇసుక సమస్యపై పవన్ లాంగ్‌ మార్చ్‌ తీయడానికి ఒకరోజు ముందు కూడా, పవన్‌పై కొన్ని రాజకీయ విమర్శలు చేశారు కన్నబాబు. దీంతో కన్నబాబుపై మరోసారి ఫైరయ్యారు పవన్. జనసేన అధినేత తనపై చేసిన వ్యక్తిగత కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు కన్నబాబు.

మొత్తానికి ప్రజారాజ్యం విలీనానికి, చిరంజీవిని ఒప్పించడంలో కన్నాబాబు కీలక పాత్ర పోషించారని, ఎప్పటి నుంచో కోపంగా వున్నారు పవన్ కల్యాణ్. కాకినాడతో పాటు అప్పుడప్పుడు ఇలా కన్నబాబుపై కోపాన్ని బయటపెడ్తున్నారు. అయితే, ఇందులోనూ పవన్ కల్యాణ్‌ కోపంతో పాటు వ్యూహం కూడా వుందని కొందరంటారు. విలీనం పాపం మొత్తం తన అన్నయ్యపై పడకుండా, కొందరు తప్పుదారి పట్టించారని చెబుతున్నారని అంటారు. అలా ప్రజారాజ్యం నీడ, జనసేనపై పడకుండా మాట్లాడుతున్నారని విశ్లేషించేవారూ వున్నారు. మొత్తానికి కన్నబాబుపైపవన్ కల్యాణ్, పరుష వ్యాఖ్యలతో మరోసారి, వీరిద్దరి మధ్య పాత గొడవలపై మళ్లీ చర్చ మొదలైంది.

Next Story