Top
logo

జనసేన లాంగ్‌ మార్చ్‌లో గంటా ఎందుకు మోగలేదు.. డుమ్మాకు కారణమేంటి?

జనసేన లాంగ్‌ మార్చ్‌లో గంటా ఎందుకు మోగలేదు.. డుమ్మాకు కారణమేంటి?
Highlights

గంటా మళ్లీ మోగింది. కానీ అది ధిక్కార గంటా అని కొందరంటుంటే, కాదు విభేదాల సైరన్‌ అని మరికొందరంటున్నారు. రెండూ...

గంటా మళ్లీ మోగింది. కానీ అది ధిక్కార గంటా అని కొందరంటుంటే, కాదు విభేదాల సైరన్‌ అని మరికొందరంటున్నారు. రెండూ కాదు, పార్టీ మారాలన్న నిశ్శబ్దం చేధించే శబ్దమంటున్నారు. ఇవేవీ కావు, అసలైన కారణం మరోటి వుందంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, పవన్ కల్యాణ్ లాంగ్‌ మార్చ్‌లో పాల్గొనకపోవడంతో, ఆ‍యన డుమ్మాపై రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. ఇంతకీ లాంగ్‌ మార్చ్‌లో గంటా ఎందుకు మోగలేదు అసలు సిసలు కారణమేంటి?

రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. గెలిచినా, ఓడినా నిశ్శబ్దాన్ని చేధించే శబ్దం ఆయన. పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంటా మోగాల్సిందేనన్నది ఆయన ఫిలాసఫీ. ఇప్పుడు కూడా విన్నింగ్ బెల్ మోగింది. కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది. అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయనకు, ఇప్పుడేం చెయ్యాలో అర్థంకావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక అధికార పార్టీలో గంట మోగించాలా అని మేథో మథనం సాగిస్తున్నారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలోనే, లాంగ్‌ మార్చ్‌లో గంట మోగించకపోవడంతో, లాంగ్‌ బెల్‌కు ఆయన సిద్దమయ్యారన్న చర్చ మళ్లీ ఊపందుకుంది.

అందరూ ఊహించినట్టే జరిగింది. టీడీపీ అధినేత ఆదేశాలను సైతం మాజీ మంత్రి గంటా పక్కన పెట్టేశారు. ఇసుక కొరతపై విశాఖలో జనసేన నిర్వహించే లాంగ్‌ మార్చ్‌లో పాల్గొనాలని, స్వయంగా చంద్రబాబు ఆదేశించినా, ఏమాత్రం ఆలోచించకుండా, లాంగ్‌ మార్చ్‌కు డుమ్మా కొట్టారు గంటా. దీంతో గంటా పార్టీ మారబోతున్నారన్న సంకేతాలకు, ఈ పరిణామం మరింత బలమిస్తోందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కానీ డుమ్మా కొట్టడానికి కారణం వేరే ఉందని గంటా వర్గీయులంటున్నారు.

పవన్ నిర్వహించే మార్చ్‌లో పాల్గొనేందుకు ముగ్గురు మాజీ మంత్రులను ఎంపిక చేశారు చంద్రబాబు. అందులో గంటా శ్రీనివాస రావు ఒకరు. అయితే, ఇప్పుడు అదే గంటా, అధినేత ఆదేశాలకు భిన్నంగా పవన్ మార్చ్ కు గైర్హాజరయ్యారు. మిగిలిన ఇద్దరు నేతలు అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు మాత్రం హాజరయ్యారు. గంటా మాత్రం, లాంగ్‌ మార్చ్‌లో మోగలేదు. అదే ఇప్పడు విశాఖలో హాట్‌ టాపికయ్యింది.

పవన్‌తో వైరమా?

టీడీపీతోనే కయ్యమా?

పార్టీ సీనియర్లతో వేదిక పంచుకోలేక?

లాంగ్‌ మార్చ్‌ డుమ్మాకు కారణమేంటి?

అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్టుల గంటాకు కామన్. ఎందుకంటే, గంటా శ్రీనివాసరావు పొలిటికల్ హిస్టరీ మొత్తం ట్విస్టులమయం. గంటాను రాజకీయాలకు పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. విశాఖలో షిప్పింగ్ బిజినెస్ ఉండే గంటాకు అప్పట్లో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉండటంతో, టీడీపీ అధినేతకు పరిచయం చేశారు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా సీటు ఇప్పించి, గెలిపించారు కూడా. కానీ తర్వాతి కాలంలో తన రాజకీయ గురువు అయ్యన్నతో శత్రుత్వం తెచ్చుకున్నారు గంటా. ఇప్పుడాయనతో మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. లాంగ్‌ మార్చ్‌ వేదికపై అచ్చెన్నాయుడితో పాటు, అయ్యన్నపాత్రుడూ వున్నారు. అయ్యన్నతో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వున్నందునే, ఆయనతో స్టేజి షేర్‌ చేసుకోవడం ఇష్టంలేక గంటా లాంగ్‌ మార్చ్‌‌కు డుమ్మా కొట్టారని ఒక ప్రచారం జరుగుతోంది. కానీ అసలు కారణం ఇది కూడా కాదని ఆయన అనుచరులంటున్నారు.

2009లో గంటా తనదైన రాజకీయాలకు మరింత పదును పెట్టారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశంకు గుడ్ బై చెప్పి, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి జంపయ్యారు. అప్పుడు కూడా పోటీ చేసే స్థానాన్ని మార్చేశారు. ప్రజారాజ్యం తరఫున అనకాపల్లిలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైంది. గంటాకు మంత్రి పదవి దక్కింది. 2014 ఎన్నికల్లో మళ్లీ గంటా పార్టీ మార్చేసారు. టీడీపీలోకి జంపయ్యారు. మళ్లీ మంత్రయ్యారు. ఇప్పుడు కూడా నియోజకవర్గాన్ని మార్చేసి, మరో చోట గెలిచారు. కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. మంత్రిగా రెండు పర్యాయాలు చక్రంతిప్పిన గంటాకు, ఆ పదవి లేక చేతులు కాళ్లూ ఆగడం లేదంట. అందుకే మరో పార్టీలో గంట మోగించేందుకు సిద్దమయ్యారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ రాజీనామా చేసిన తర్వాతే వైసీపీలోకి రావాలన్న నిబంధన వుంది గనుక ఆగిపోతున్నారట. అటు బీజేపీలోకి రావాలని సుజనా, సీఎం రమేష్ వంటి సన్నిహితులు పిలుస్తున్నా, ఇప్పుడే వెళ్లి లాభంలేదని లెక్కలేస్తున్నారట గంటా. అందుకే అటు వైసీపీకి, ఇటు బీజేపీకి చెడ్డ కాకుండా, పవన్‌ లాంగ్ ‌మార్చ్‌కు గంటా వెళ్లలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇది కూడా రియల్ రీజన్‌ కాదంటున్నారు టీడీపీలో మరో వర్గం. మరి అసలు రీజన్ ఏంటి?

జనసేన అధినేతతో విభేదాలే డుమ్మాకు కారణమా?

ఇప్పుడు దీని చుట్టే గంటా డుమ్మా చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే, చిరంజీవితో ఉన్నంత రిలేషన్, పవన్ కల్యాణ్‌తో లేదు గంటాకు. దీనికి చాలా కారణాలు కూడా వున్నాయంటున్నారు సన్నిహితులు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడంలో గంటా కూడా కీలక పాత్ర పోషించారని పవన్‌కు కోపం. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గంటాకు వ్యతిరేకంగా చాలా గట్టి విమర్శలు చేశారు పవన్. గంటాను ఓడించాలని పిలుపునిచ్చారు. కొన్ని వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. పవన్ వ్యాఖ్యలతో నొచ్చుకున్నారట గంటా. అలా విమర్శించిన వ్యక్తే, ఇప్పుడు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించడం, అందులోనూ తన నియోజకవర్గంలోనూ మార్చ్ వుండటంతో, లాంగ్‌ మార్చ్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. అన్ని విమర్శలు చేసిన పవన్‌తో మళ్లీ చేతులు కలపడం తనకిష్టంలేదని సన్నిహితులతో అన్నారట. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం గంటా శ్రీనివాస రావు చెప్పారట. ఇలాంటి కారణాలతో తాను లాంగ్‌ మార్చ్‌కు వెళ్లలేకపోతున్నానని, ముందే తెలియజేశారట. దీనికి పార్టీ అధినేత, అలా చేయడం కరెక్టు కాదని చెప్పినా, ఆ తర్వాత సరే మీ ఇష్టం, పార్టీ కార్యక్రమాలకు మాత్రం డుమ్మాకొట్టొద్దని అన్నారట. ఇదీ అసలు రీజన్. లాంగ్‌ మార్చ్‌లో గంటా పాల్గొనకపోవడానికి అసలు కారణమని, గంటాకు అత్యంత సన్నిహితంగా వుండే నేతలు చెప్పారు.

మొత్తానికి అధికారంలేకపోతే గంటా వుండలేరన్న వ్యాఖ్యానాలు, పార్టీ మారతారన్న ఊహాగానాలు, వీటికి తోడు పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకాకపోవడం వంటి కారణాల నేపథ్యంలో, లాంగ్‌ మార్చ్‌కు గంటా వెళ్లకపోవడంతో, సహజంగానే అనేక సందేహాలు రేకెత్తాయి. ఆయన పార్టీ మారాలనుకుంటున్నారు కాబట్టే, అధినేత చెప్పినా లాంగ్‌ మార్చ్‌కు వెళ్లలేదన్న పుకార్లు వినిపించాయి. అయితే, పవన్‌తో వ్యక్తిగత విభేదాల వల్లే, గంటా మార్చ్‌కు వెళ్లలేదని ఆ‍యన సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి, ముందు ముందు గంటా, ఎలా మోగుతారో.


Next Story

లైవ్ టీవి


Share it