ఆనం మాటల వెనక అసలు కథేంటి?

ఆనం మాటల వెనక అసలు కథేంటి?
x
ఆనం రామనారాయణ రెడ్డి
Highlights

ఇప్పుడు ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వేడి పుట్టిస్తున్నాయి. అసలు ఆ ఎమ్మెల్యే ఎందుకు ఇలాంటి హాట్ కామెంట్స్ చేశారని, ఇప్పుడు ఆ జిల్లా...

ఇప్పుడు ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వేడి పుట్టిస్తున్నాయి. అసలు ఆ ఎమ్మెల్యే ఎందుకు ఇలాంటి హాట్ కామెంట్స్ చేశారని, ఇప్పుడు ఆ జిల్లా రాజకీయవర్గాల్లో వాడివేడిగా చర్చ మొదలైంది. అసలు ఆ ఎమ్మెల్యేకి ఎందుకంత ఆగ్రహం వచ్చింది ? ఇదే ఇప్పుడు ఆ జిల్లా అంతా అనుకుంటున్న మాట. ఆ ఎమ్మెల్యే ఇంతలా రియాక్ట్ అయ్యాడంటే ఏదో జరిగింది అసలు ఇంతకీ ఏమి జరిగింది..? ఆ మాజీ మంత్రి మాటల వెనక అసలు కథేంటి?

సింహపురి రాజకీయాలు వేడెక్కాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగరాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డాగా ఉందని, ఇక్కడ ఎలాంటి మాఫియాలైనా సరే దొరుకుతారు అని, శాండ్, క్రికెట్ బెట్టింగ్, భూకబ్జా గ్యాంగ్ స్టార్స్, లిక్కర్ మాఫియా, ఈ మాఫియాలన్నీ ఇక్కడ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనం. ఆనం చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను, అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడారన్న చర్చ హీటెక్కిస్తోంది.

ఆనం వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి వ్యాఖ్యలను వినీ విననట్లు వదిలేస్తే అది అన్ని జిల్లాలకు వ్యాపిస్తుందని ఆ తర్వాత పార్టీ అదుపు తప్పుతుందన్న భావనతో వైసీపీ హైకమాండ్‌ సీనియస్‌ అయినట్టు తెలుస్తోంది. ఆనంకు ఇంకా పాత వాసనలు పోకపోవడం వల్లనే ఆయన వ్యవహరంలో సీఎం సీరియస్‌గా ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. పార్టీని బెదిరించి పని కానిద్దామనుకున్న ఆనంకు, జగన్ ఊహించని షాక్ ఇచ్చారని నెల్లూరు వైసీపీ నేతలు అంటున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురాకుండా ప్రెస్‌మీట్ పెట్టి మీడియాతో పంచుకోవడాన్ని జగన్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి విభేదాలు నడుస్తున్నాయి. మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వర్గంగానూ, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మరో వర్గంగానూ ఉంటూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను సాగిస్తున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవి రావడాన్ని ముందు నుంచి కూడా ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ కూడా మంత్రి పదవులు ఆశించిన వారే. అయితే ఇటీవల మంత్రి అనిల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి రాంనారాయణ రెడ్డిని టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

చాలాకాలంగా విఆర్ విద్యా సంస్థలపై ఆనం కుటుంబమే పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. ఆ విద్యాసంస్థల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. విద్యా సంస్థల ఆస్తులను ఆనం కుటుంబం నుంచి దూరం చేయడంలో మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఈ పరిణామాన్ని ఆనం జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది.

అలాగే నెల్లూరులో ఉన్న ప్రాచీన ఆలయం వేణుగోపాలస్వామి గుడికి సంబంధించిన ఆస్తులను కూడా ట్రస్ట్ బోర్డు అమ్మేందుకు సిద్ధమైంది. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఆనం కుటుంబ సభ్యులు ఒకరు. గతంలో ఆనం వివేకానంద రెడ్డి బతికున్నంతకాల౦ ఈ ఆలయానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు లేకపోతే గుడిలో కార్యక్రమాలు కావచ్చు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఇప్పుడు కేవలం కోటిన్నర రూపాయల ఆలయ నిర్వహణ సిబ్బంది జీతభత్యాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి. దీని కోసం ఈ ఆలయానికి సంబంధించిన నగరంలో ఉన్న వందల కోట్ల విలువ చేసే 80 ఎకరాల భూములను అమ్మేందుకు ట్రస్ట్ బోర్డు సిద్ధమై౦ది. ఈ క్రమంలో మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎండోమెంట్ కమిషనర్ ఆలయ అధికారులతో చర్చలు జరిపి అమ్మేందుకు వీలు లేదని హెచ్చరించారు. వేణుగోపాలస్వామి గుడి ఆలయ ఆస్తులను అమ్మటానికి కచ్చితంగా దేవాదాయ శాఖ అనుమతి కావాలని తేల్చి చెప్పడం, వివాదాన్ని రాజేసింది.

అలాగే టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు వెంకటగిరి, డక్కిలి మండలంలో 240 కోట్ల రూపాయలతో, శంకుస్థాపన జరుపుకున్న ఆల్తూరుపాడు రిజర్వాయర్ విషయం కూడా ఆనం రామనారాయణ రెడ్డికి కోపం తెప్పించినట్లుగా చర్చ జరుగుతోంది. త్వరలో ఆ రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా ప్రభుత్వం రివర్స్ టెండర్లు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో టెండర్ దక్కించుకున్న తన మనిషికి కాకుండా ఇప్పుడు రివర్స్ టెండరింగ్‌కు పోతుండటంతో మండిపడుతున్నారట ఆనం. అనిల్ ఇరిగేషన్ మంత్రి కావడంతో ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆనం అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో రిజర్వాయర్ కు సంబంధించి, తనకు సంబంధం లేకుండా చేస్తూ రివర్స్ టెండరింగ్ పోతుండటంతో ఆనం రామనారాయణ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట.

అలాగే సొంత సోదరుడైన ఆనం విజయ్ కుమార్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి రావడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారట ఆనం రామనారాయణ రెడ్డి. ఆ పదవిని తనకు అత్యంత సన్నిహితుడైన మెట్టుకూరు ధనంజయరెడ్డికి ఇప్పించాలని విశ్వప్రయత్నాలు చేశారట ఆనం. వాస్తవంగా నాలుగు నెలల క్రితమే ఆ పదవి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇచ్చారని ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆనం రాంనారాయణ రెడ్డి తన తమ్ముడు విజయ్ కుమార్ రెడ్డికి ఆ పదవి రాకుండా అడ్డుకున్నారన్న బలమైన ప్రచారం ఉంది. అయితే మంత్రి అనిల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలువురు జిల్లాల ఎమ్మెల్యేల మద్దతుతో డిసిసిబి చైర్మన్ పదవి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి దక్కింది. ఈ విషయంపై కూడా ఆనం రామనారాయణరెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కొన్ని రోజుల క్రితం జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బదిలీ విషయం కూడా తనకు తెలియక పోవడం ఆనంకు, మరింత కోపాన్ని తెప్పించిదట. కనీసం ఒకమాట కూడా చెప్పకుండా మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కలిసి జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్‌ ను జిల్లాకు తీసుకువచ్చారని మండిపోయారట. ఇలా అనేక సంఘటనలతో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి షాకులు తగలడంతో, ఆయన ఇక ఓపిక నశించి తన 38 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా పక్కనపెట్టి, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులైనా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,అనిల్‌లను పరోక్షంగా మాఫియా అన్న సంచలన వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

ఒకపక్క నాయకులందరూ కలిసికట్టుగా ఉండి, ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తున్నా, ఆయన ఆదేశాలను కూడా ఖాతరు చేసే పరిస్థితిలో వైసీపీ నేతలు లేరని, వైసీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ఆనం వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో ఏకంగా సీఎం జగన్‌‌‌ సీరియస్‌గా స్పందించారని తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఏకంగా సీఎం సీరియస్‌ కావడంతో, మాజీ మంత్రి ఆనం కూడా మెత్తబడినట్టు తెలుస్తోంది. ఇంకా టీడీపీ వాసనలతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆనం మీద విమర్శలు రావడంతో, అసెంబ్లీ తొలిరోజే తన విధేయత చాటుకునే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు మీద, టీడీపీ నేతల మీదా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు ఆనం. మొత్తానికి నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆనం వ్యాఖ్యలతో హీటెక్కాయి. మరి ఇప్పటికే చల్లారాయా లేదంటే మున్ముందు మరిన్ని ప్రకంపనలు తప్పవా అన్నది చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories