ఆమంచికి అధిష్టానం బంపర్ ఆఫరేంటి?

ఆమంచికి అధిష్టానం బంపర్ ఆఫరేంటి?
x
Highlights

ఒంగోలు గిత్తల్లా తలపడ్డారు. బాహుబలి, భళ్లాలదేవ రేంజ్‌లో కత్తి తిప్పారు. దమ్ము చూపిస్తానంటూ ఒకనేత, దుమ్ము దులిపేస్తానంటూ మరో నేత తొడగొట్టారు. ఎన్నికలు...

ఒంగోలు గిత్తల్లా తలపడ్డారు. బాహుబలి, భళ్లాలదేవ రేంజ్‌లో కత్తి తిప్పారు. దమ్ము చూపిస్తానంటూ ఒకనేత, దుమ్ము దులిపేస్తానంటూ మరో నేత తొడగొట్టారు. ఎన్నికలు అయిపోయాయి. ఇద్దరిలో ఒకరు గెలిచారు. అయినా, ఇప్పటికీ పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. సీన్‌ కట్ట్ చేస్తే, ఇప్పుడు ఇద్దరూ దాదాపుగా ఒకే పార్టీ. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడవు కాబట్టి, ఇప్పుడు ఒకే పార్టీలోనే ప్రత్యర్థుల్లా పగతో ఉడికిపోతున్నారు. అందుకే, అధిష్టానం ఒక వ్యూహం వేసిందట. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆలోచన చేసిందట. ఇంతకీ ఎంటా వ్యూహం ఎవరా లీడర్లు? లెట్స్ వాచ్ దిస్ స్టోరి.

కరణం బలరాం ప్రకాశం జిల్లా చీరాల టీడీపీలో తిరుగులేని నాయకుడు. ఆమంచి కృష్ణమోహన్ చీరాలలో మరో సీరియస్‌ పొలిటికల్ ఫైటర్. ఇద్దరూ రాజకీయాల్లో బద్ద శత్రువులు మొన్న జరిగిన ఎన్నికల్లో ఒంగోలు గిత్తల్లా హోరాహోరీగా తలపడిన నాయకులు. బాహుబలి, భళ్లాలదేవలా తలపడిన ఉద్దండులు. ఇద్దరూ ఒక రేంజ్‌లో ఫైట్ చేశారు చివరి వరకూ నువ్వానేనా అన్నట్టుగా కత్తులు దూశారు. చివరికి విజయం కరణం బలరాంను వరిస్తే, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ ఇద్దరూ నేతలు ఎదురుపడితే, సమరసింహారెడ్డి సినిమాలో ప్రత్యర్థుల్లా ఉరిమి ఉరిమి చూసుకుంటారు. కానీ సీన్ కట్‌ చేస్తే, ఇప్పుడు ఇద్దరూ దాదాపుగా ఒకే పార్టీ. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? అదే చీరాల సమరాన్ని మరింత రసవత్తరంగా మార్చుతోంది.

నిన్నటి వరకు టిడిపిలో ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసిపికి జై కొట్టారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా, తన కొడుకు కరణం వెంకటేష్‌తో పాటు మాజీ మంత్రి పాలేటి రామారావులతో సహా మరికొంతమంది టిడిపి నేతలను దగ్గరుండి మరీ, సీఎం వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్ధం ఇప్పించారు. జగన్‌ పాలనను పొగడటమే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల తూటాలూ పేల్చారు కరణం. వల్లభనేని వంశీలా తటస్థ సభ్యుడిగా వుండేందుకు ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యేగా వున్న కరణం వైసీపీతో దోస్తీకి ఎలాంటి ఇబ్బందీ లేదు కానీ, అదే చీరాలలో వైసీపీ ఇన్‌చార్జీ, మొన్నటి అదే కరణం చేతిలో ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్‌కు మాత్రం ఈ పరిణామాలు నచ్చడం లేదట. చీరాల వైసీపీలో ఇప్పుడీ కోల్డ్‌వార్‌ పీక్స్‌కు చేరుతోంది.

కరణం కుటుంబం వైసిపిలో చేరడంతో వైసిపి ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయులకు ఇది జీర్ణించుకోలేని వ్యవహారంగా మారింది. కరణం వెంకటేష్‌, పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలు ఒక జట్టుగా, ఆమంచి వర్గీయులు మరో జట్టుగా ఏర్పడి పార్టీ కార్యక్రమాలను విడివిడిగా, పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. దీంతో వైసిపి క్యాడర్‌ అయోమయంలో పడిపోయింది. ఒకేవరలో రెండు కత్తులు ఇమడవని తెలిసినా అధిష్టానం ఇద్దరికీ చోటివ్వడం, పార్టీకి మేలుకన్నా నష్టం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

ఏపీలో చీరాల నియోజకవర్గం రాజకీయాల రూటే వేరు. హాట్‌‌హాట్‌ రాజకీయాల హాట్‌ స్పాటు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య కన్నా స్వపక్షంలోని నేతల మధ్యే విబేధాలు ఎక్కువగా ఉంటాయి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్‌ బలమైన నేతగా ఎదిగారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆమంచి, తర్వాత టిడిపిలో చేరారు. అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరి పోటీ చేశారు. అయితే అనుకోని విధంగా చీరాల నుంచి టిడిపి అభ్యర్ధిగా బరిలోకి దిగిన కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంతో ఓడిపోయినా, నియోజకవర్గంలో తన హవా చాటుకున్నారు ఆమంచి. ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆమంచిని ఎదుర్కోవడం కన్నా, అదే పార్టీలో చేరి అయనకు చెక్‌ పెట్టేందుకు కరణం వ్యూహాత్మకంగా వ్యవహరించి తన కొడుకు కరణం వెంకటేష్‌ను వైసిపిలో చేర్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మళ్ళీ వైసిపి పార్టీ వేదికగా ఆధిపత్య పోరు ప్రారంభమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసిపి కార్యకర్తలు తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో పడిపోయారు. వైసిపిలోనే ఇద్దరు బలమైన నేతల మధ్య నలిగిపోతున్నారు. దీంతో వైసిపి అధిష్టానం పరిస్థితిని చక్కబెట్టేందుకు కొత్త వ్యూహం అమల్లోకి తెచ్చిందట.

చీరాల పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గంలో వైసీపీకి పరిస్థితులు అంతగా బాగాలేవట. గట్టి నాయకత్వం లేకపోవడాన్ని గుర్తించి, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆమంచిని పర్చూరుకు పంపిస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టి పెట్టిందట వైసీపీ హైకమాండ్. వెంటనే ఆమంచికి కబురు పెట్టారట. వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆమంచితో వారంరోజులుగా మంతనాలు చేస్తున్నారట. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని, తనను పర్చూరులో నాయకత్వ లోపాన్ని భర్తీ చేసేందుకు అక్కడ వ్యవహారాలు చూసుకోవాలని సూచించారట. అంతేకాకుండా పర్చూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వర్గం బలంగా ఉండటంతో, అదే వర్గానికి చెందిన ఆమంచి అక్కడైతే బాగుటుందని సూచించారట. అయితే ఆమంచి మాత్రం తాను చీరాలను విడిచిపెట్టేదిలేదని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు ఆమంచికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వైసిపి నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో, ఆమంచికి పర్చూరు ఇన్‌చార్జి పదవి ఆఫర్‌ చేసినట్టు వినికిడి.

ఆమంచికి ఎమ్మెల్సీనే కాదు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కూడా ఆఫర్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. చీరాలను వదిలి పర్చూరులో పార్టీని బలోపేతం చేస్తే కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కూడా ఆమంచిని వరించే అవకాశం ఉందంటున్నారు. వైసిపి అధిష్టానం వ్యూహాత్మకంగా చేసిన ఈ ప్రతిపాదనతో చీరాలలో వైసిపి నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టడంతో పాటు పర్చూరులో పార్టీ పరిస్థితిని చక్కదిద్దవచ్చన్నది వ్యూహమట. ఇది వర్కౌటయితే వైసిపి అధిష్టానంతో పాటు ఇటు చీరాల, పర్చూరు వైసిపి పార్టీ కేడర్‌ కూడా ఊపిరిపీల్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వైసిపి అధిష్టానం తాజా ప్రతిపాదనకు ఆమంచి ఓకే చెబుతారా లేదా అన్నదే, ఇప్పుడు ఇటు చీరాల, అటు పర్చూరు నియోజకవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.Show Full Article
Print Article
Next Story
More Stories