గంటా-అవంతి మధ్య మంటలేంటి.. రానున్న రోజుల్లో విశాఖ వైసీపీలో ఏం జరగబోతోంది?

గంటా-అవంతి మధ్య మంటలేంటి.. రానున్న రోజుల్లో విశాఖ వైసీపీలో ఏం జరగబోతోంది?
x
Highlights

What's the clash between Ganta and Avanthi: గంటా పార్టీలోకి వస్తే, ఆ‍యకేంటి తంటా....? గంటా వైసీపీ పంచన చేరితే, ఆ నేతకేంటి అంత మంట...?...

What's the clash between Ganta and Avanthi: గంటా పార్టీలోకి వస్తే, ఆ‍యకేంటి తంటా....? గంటా వైసీపీ పంచన చేరితే, ఆ నేతకేంటి అంత మంట...? ఒకప్పుడు తనవెంట నడిచిన నేతనే ఇప్పుడెందుకు వద్దంటున్నారంట...? స్నేహితుడిలాంటి గురువునే, పార్టీలోకి రావడానికి వీల్లేదని ఎందుకంటున్నారంట...? ఒకప్పుడు ఒకగూటి పక్షులే....జంటగా వలసెల్లిన గువ్వలే....అయినా, గంటాతో ఆయనకేంటి తంటా అండ్ మంట. ఇంతకీ గంటాను వ్యతిరేకిస్తున్నదెవరంటా?

ఇద్దరూ ఒకప్పుడు గురుశిష్యులే, ఒక గూటి పక్షులే. గూడు చెదిరి చెరో దిక్కయ్యారు. ఇప్పుడు ఒకే గూటికి వచ్చేందుకు ఒకరి విశ్వ ప్రయత్నాలు. కానీ ఒకరి చేరికను మరొకరు అడ్డుకునే ఎత్తుగడలు. గంటా-అవంతి మధ్య మంటలేంటి? వైసీపీలో గంటా చేరికను అవంతి వ్యతిరేకించడం వెనక కథేంటి? ఆగస్టు 9 లేదంటే ఆగస్టు 15. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతున్న తేదీలు. పరిపాలనా రాజధానిగా విశాఖలో ప్రభుత్వం జెండా ఎగరేసే సమయమే వేదికగా, గంటా వైసీపీలో సీటు రిజర్వేషన్ చేసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంతలోనే అదే విశాఖకు చెందిన, మంత్రి అవంతి శ్రీనివాస్ ఎంత మాట అన్నారో చూడండి. కేసుల మాఫీ కోసమే ఆయన పార్టీ మారతారట. అధికారం ఎటు వుంటే, గంటా అటే మొగ్గుచూపుతారట. ఈ మాటలు ఎవరో అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గంటాకు శిష్యుడులాంటి స్నేహితుడు, ఒకే పార్టీలో గంటాతో జర్నీ చేసిన నేతే, ఇంతటి మాట అన్నారు. అవంతి మాటల వెనక అసలు కథేంటి?

విశాఖపట్నం రాజకీయం కొంతకాలంగా హాట్ హాట్ గా మారుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో, అప్పటి టీడిపి నేతలుగా వున్న అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ మధ్య మరోసారి రసవత్తరమైన రాజకీయం మొదలైంది. గంటా అనుచరుడుగా వచ్చిన అవంతి శ్రీనివాస్ రాజకీయ అరంగేట్రం, గంటా శ్రీనివాస్ ప్రోద్బలంతోనే స్టార్టయ్యింది. కాపు సామాజిక సమీకరణలతో, గంటా పీఆర్పీలో కీలకంగా వ్యవహిరిస్తూ అవంతి శ్రీనివాస్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అవంతి. తరువాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగారు. రాష్ట్ర విభజన సమయంలో అవంతి, గంటా శ్రీనివాస్‌లు టీడిపి జంట పక్షుల్లా చేరారు. భీమిలి మీద పట్టు పెంచుకున్న అవంతి శ్రీనివాస్, తన రాజకీయ గురువు స్నేహితుడు గంటాకు ఆ నియోజకవర్గం త్యాగం చేసి ఎంపీగా పోటీ చేశారు. గంటా ఎమ్మెల్యేగా గెలుపొంది గత ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో అవంతి తనకు భీమిలి నియోజకవర్గం కావాలని పట్టుబట్టారు. గంటా భీమిలి నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టడంతో, ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. అక్కడి నుంచి ఈ గురుశిష్యుల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది. ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. అవంతి పార్టీ మారీ వైసీపీ తీర్ధం పుచ్చుకుని, అదే భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి పదవి పొందారు. గంటా తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ నియోజకవర్గం మార్చి ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ సర్కారు రావడంతో, మూడు రాజధానుల ప్రతిపాదనతో భీమిలికి మరోసారి ప్రాధాన్యత పెరిగింది. ఈనేపథ్యంలో గంటా చూపు భీమిలి వైపు మళ్లింది. అదే మరోసారి అవంతి-గంటాల మధ్య మంటను మరింత మండిస్తోంది.

టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, అధికారంలేక అల్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది గంటా గురించి. కొంతకాలంగా టీడిపికి దూరంగా వుంటున్నారాయన. తాజాగా గంటా శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గంటా వైసీపీకి వస్తే తనకు చెక్ పెడతారన్న, అభద్రతాభావం అవంతి వర్గంలో అలజడి రేపుతోంది. దీంతో గంటా రాకను ఎలాగైనా అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారట అవంతి శ్రీనివాస్. అయితే, నేరుగా వైసీపీ అధిష్టానంతో టచ్‌లో వున్న గంటా శ్రీనివాసరావు, మంత్రి అవంతి శ్రీనివాస్ హవా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట. తన డిమాండ్స్ ను ఇప్పటికే వైసీపీ అధిష్టానం ముందు పెట్టారట. దీంతో అవంతి శ్రీనివాస్‌కు విశాఖ వైసీపీలో చుక్కెదురు తప్పదన్న చర్చ మొదలైంది. గంటా వైసీపీ తీర్థం పుచ్చుకుంటే, విశాఖ తీరంలో గంటా వర్సెస్ అవంతి యుద్ధం మొదలైనట్టేననన్న మాటలూ ధ్వనిస్తున్నాయి. తాజాగా గంటాపై అవంతి ఆరోపణలు, విమర్శలకు అదే కారణమన్న వాదనా వినిపిస్తోంది. గతంలో గంటాపై విజయసాయిరెడ్డి చేసిన సైకిళ్ల కుంభకోణాన్నీ గుర్తు చేశారు అవంతి. మొత్తానికి గంటా వైసీపీలో చేరకముందే, కోల్డ్‌వార్‌ మొదలైతే, ఇక చేరిన తర్వాత ఇంకెంత రసవత్తరంగా వుంటుందోనన్న చర్చ జరుగుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories