Brahmamgari Matam: అసలు బ్రహ్మంగారి మఠంలో ఏం జరుగుతుంది ?

Whats Happening at Brahmamgari Matham
x

Brahmamgari Matham: అసలు బ్రహ్మంగారి మఠంలో ఏం జరుగుతుంది ?

Highlights

Brahmamgari Matam: కాలజ్ఞానం సృష్టించిన చరిత్ర కలిగిన మఠం.. ఆధిపత్య పోరుతో వివాదంలో చిక్కుకుంది.

Brahmamgari Matam: కాలజ్ఞానం సృష్టించిన చరిత్ర కలిగిన మఠం.. ఆధిపత్య పోరుతో వివాదంలో చిక్కుకుంది. ఏడు తరాలుగా సాఫీగా సాగిన పీఠాధిపతి పట్టాభిషేకానికి వారసత్వ పోరు అవాంతరాలు సృష్టిస్తోంది. ఈ వివాదానికి కారణమేంటి..? ఓ వైపు వీలునామాలు.. మరోవైపు వారసత్వం మధ్య సాగుతోన్న ఈ వివాదంలో మఠ పీఠాధిపతిగా ఎంపికయ్యేదెవరు..? అసలు బ్రహ్మంగారి మఠంలో ఏం జరుగుతుంది. ?

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారింది. దేశంలోనే పేరుగాంచిన ఆ మఠంలో పీఠాధిపతి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడటం లేదు. ఒకే కుటుంబంలో ఏర్పడిన వర్గాలతో పీఠాధిపతి ఎంపిక జఠిలంగా మారింది. పీఠం ప్రతిష్టను కాపాడటమే లక్ష్యంగా ఏకంగా 12 మంది పీఠాధిపతులు రంగంలొకి దిగడంతో సమస్య కొలిక్కి వచ్చిందా అన్న సందేహం వీడటం లేదు.

పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి బహుశా ఈ పేరు వినని వారుండరు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఆనాడే బ్రహ్మం గారు చెప్పారంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా కాలజ్ఞాన సృష్టికర్తగా చరిత్ర సృష్టించిన బ్రహ్మంగారి ఆలయంలో కొత్త పీఠాధిపతి విషయంలో వివాదం రేపుతోంది. తరాలుగా సాఫీగా జరిగిన పీఠాధిపతి నియామకానికి ఇప్పుడు నిరీక్షణ తప్పడం లేదు.

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఎర్పాటైంది. కాలజ్ఞాన సృష్టికర్త వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయిన కందిమల్లయ్యపల్లె ప్రాంతమే నేటి బ్రహ్మంగారిమఠం. ఏటా లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తారు. అంతటి ఖ్యాతిగాంచిన ఆలయంలో బ్రహ్మంగారి వారసులు పీఠాధిపతులుగా వ్యవహరించేవారు. ఏడు తరాలుగా ఈ పీఠాధిపతి ఎంపిక సజావుగానే సాగింది. కానీ 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పరమపదించాక పీఠాధిపతి అంశం విభేదాల కారణంగా వివాదాస్పదమైంది. దీంతో పీఠాధిపతి ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.

వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా రెండో భార్యకు మైనర్లు అయిన ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇద్దరు భార్యల కుమారులూ వారసత్వం, పీఠాధిపత్యం కోసం పట్టుబడుతున్నారు. గత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కొడుకుకూ, రెండో భార్య కొడుకుకూ పీఠాధిపతి చేస్తానని వీలునామా రాసిచ్చినట్లు రెండు కుటుంబాల వారు చెబుతున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ సమక్షంలో రెండు కుటుంబాలకు చెందిన వారు గొడవ పడ్డారు. తమకు వీలునామా ఉందని ఎవరికి వారు వాదించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వామివారి గది అందులో ఉన్న రికార్డులన్నింటినీ అధికారులు సీజ్ చేశారు. అయితే తమకు రాసిన వీలునామా ప్రకారం తమనే మఠాధిపతిగా నియమించాలని అటు మొదటి భార్య రెండో కుమారుడు, రెండో భార్య పట్టుబడుతున్నారు. వీలునామా ప్రకారం తామే అర్హులమంటూ వాదిస్తున్నారు.

ఏళ్ల చరిత్ర ప్రఖ్యాతి కలిగిన బ్రహ్మంగారి మఠంలో ఇలా ఒక్కసారిగా విభేదాలు రావడంతో మఠ ప్రతిష్టకే భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్‌ను అంచనా వేసిన బ్రహ్మంగారు తన మఠంలో ఇలాంటి రోజొకటి వస్తుందని అంచనా వేయలేకపోయారా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. దీంతో మఠ ప్రతిష్ట నిలబెట్టి వివాదం తేల్చేందుకు తెలుగురాష్ట్రాల్లోని పీఠాధిపతులు రంగంలోకి దిగారు. రెండు రాష్ట్రాల్లోని పీఠం మర్యాదకు భంగం వాటిల్లకుండా జోక్యం చేసుకుని సమస్యను చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు.

ఇక మఠం గౌరవం దెబ్బతినకుండా పీఠాధిపతులు రంగంలోకి దిగారు. అన్ని విధాలా ప్రయత్నించారు. వివాదం కోర్టుకెక్కకుండా పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకీ మఠంలో జరిగిన విచారణపై పీఠాధిపతులు ఏం చెబుతున్నారు..? చట్ట ప్రకారం, నియమాల ప్రకారం మఠం 13వ పీఠాధిపతి అయ్యేదెవరు..? పీఠాధిపతులిచ్చిన గడువు ముగిసే లోగా వివాదానికి తెర పడుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

దేవస్థాన ప్రతిష్టకు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారసత్వ పోరు మారడంతో వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది పీఠాధిపతులు ఇరుకుటుంబాలతో చర్చలు జరుపారు. ఈ చర్చల్లో వెంకటేశ్వరస్వామి మొదటి భార్య ప్రథమ కుమారుడు తనకు వారసత్వంగా పదవి ఇవ్వాలని పీఠాధిపతుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక మొదటి భార్య రెండవ కుమారుడు కూడా తన తల్లి అనారోగ్యం బారిన పడినపుడు కిడ్నీ ఇచ్చానని, ఆ సందర్బంలో తనకు పీఠాధిపత్యం ఇస్తామని తన తండ్రి వీలునామా రాసిచ్చారని చెప్పారు. అటు రెండవ భార్య సైతం తనకు వీలునామా రాసి ఇచ్చారని చెప్పుకొచ్చినట్లు తెలుస్తొంది. వారి వాదనలు విన్న అనంతరం వంశపారం పర్యంగా మఠంలో వస్తున్న పద్ధతులను, సంప్రదాయాలను తెలుసుకున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలం నుంచి పీఠాధిపత్యం ఎలా సంక్రమిస్తోందనే అంశంపై చర్చించారు.

ఇరు వర్గాల మాటలను విన్న పీఠాధిపతులు పవిత్రమైన బ్రహ్మంగారిమఠంలో వారసత్వ పీఠం కోసం గొడవలు పెంచుకోవడం మంచిది కాదని వెంకటేశ్వరస్వామి కుటుంబీకులకు చెప్పినట్లు తెలిపారు. రెండు కుటుంబాల దగ్గర ఉన్న వీలునామాలు, అగ్రిమెంటును పరిశీలించి సాంప్రదాయం ప్రకారం పీఠాధిపత్యం పొందడానికి ఎలాంటి వీలునామాలు చెల్లవని శివస్వామి తేల్చి చెప్పారు. ఆస్తి పంపకాల కోసమే అవి పనికి వస్తాయన్నారు. బ్రహ్మంగారి మఠానికున్న విశిష్టత దృష్ట్యా అన్ని విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

అయితే బ్రహ్మంగారి మఠంలో గృహస్థ ధర్మం ఉండటంతో మైనారిటీలకు పెళ్లి కాని వారు ఇందుకు అనర్హం. స్వామివారి కళ్యాణం సందర్భంగా తప్పనిసరిగా పీఠాధిపతి దంపతులు ఆసీనులు కావాలని చెప్పారు. ఆ లెక్కన చూస్తే రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారులు మైనర్లు. వారు పీఠాధిపత్యం ఎలా చేస్తారనే సందేహాన్ని స్వామీజీలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు గ్రామస్తుల్లో కూడా మొదటి భార్య కుమారుడు వెంకటాద్రినే పీఠాధిపతి చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పీఠాధిపతి నియామకంలో కుటుంబసభ్యుల మధ్య నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చిందని కుటుంబసభ్యులను ఒక తాటిపైకి తెచ్చేందుకు సాగించిన ప్రయత్నాలు సఫలమైనట్లు తెలుస్తోంది. పూర్వపు మఠాధిపతి వేంకటేశ్వరస్వామి మొదటి భార్య ప్రథమ కుమారుడు వేంకటాద్రిస్వామి మఠాధిపతిగా, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ ప్రథమ కుమారుడు గోవిందస్వామిని ఉత్తరాధికారిగా నియమించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి ఇరు కుటుంబాలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories