ఏబీవీపై టీడీపీలో భిన్నస్వరాలేంటి.. నాని ట్వీట్ వెనక అసలు కథేంటి?

ఏబీవీపై టీడీపీలో భిన్నస్వరాలేంటి.. నాని ట్వీట్ వెనక అసలు కథేంటి?
x
Highlights

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌, చివరికి తెలుగుదేశంలోనే రచ్చకు దారి తీస్తోంది. ఏబీవీని వెనకేసుకురావడమేంటని, టీడీపీ నేతలను...

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌, చివరికి తెలుగుదేశంలోనే రచ్చకు దారి తీస్తోంది. ఏబీవీని వెనకేసుకురావడమేంటని, టీడీపీ నేతలను తప్పుబడుతూ, ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్, కలకలం రేపుతోంది. ఇంతకీ ఏబీవీ సస్పెన్షన్‌ పట్ల, టీడీపీలో భిన్న స్వరాలెందుకు? ముఖ్యంగా కేశినేని నాని, ఏబీని ఎందుకంతగా వ్యతిరేకిస్తున్నారు దీని వెనక స్మాల్‌ ఇంట్రెస్టింగ్ స్టోరి వుంది.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సప్పెన్షన్ వ్యవహారం, అటు తిరిగి ఇటు తిరిగి, తెలుగుదేశంలోనే రచ్చను రాజేస్తోంది. ఏపీలో నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని, దేశ రహస్యాలను ఇజ్రాయెల్ కు చెందిన ప్రైవేటు సంస్ధల చేతికి అందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును, సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఈ సస్పెన్షన్‌ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతుండగానే, టీడీపీ ఎంపీ కేశినేని నాని, చేసిన ట్వీట్‌ ఇప్పుడు తెలుగుదేశంలో కలకలం రేపుతోంది. టీడీపీ వెంకటేశ్వరరావును వెనకేసుకురావడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు నాని.

ఏబీ వెంకటేశ్వర రావుపై కేశినేని నానికి వ్యతిరేకత ఎందుకు? పార్టీ లైన్‌కు భిన్నంగా ఏబీని ఎందుకు తప్పుపడుతున్నారు?

దీని వెనక పెద్ద కథే వుందన్నది జరుగుతున్న చర్చ. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఇంటిలెజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏడీజీ స్ధాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌గా పగ్గాలు చేపట్టిన ఏబీవీ, ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ అనురాధ వైఫల్యం చెందారని, ఆమె స్ధానంలో నిఘా విభాగం అధిపతిగా ఏబీని నియమించుకున్నారు చంద్రబాబు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగడంలో, ఏబీనే కీలకంగా వ్యవహరించారని, నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి నయానో, భయానో బెదిరించి పార్టీలోకి లాగారని వైసీపీ నేతల ఆరోపణ. అయితే చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యం ప్రతిపక్ష వైసీపీకే కాదు టీడీపీలోని పలువురు సీనియర్లకూ నచ్చలేదు. వారిలో కేశినేని నాని ఒకరు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా రాష్ట్రంలో వాస్తవ పరిస్ధితులను చెప్పాల్సింది పోయి, టీడీపీ పరిస్ధితి అన్నిచోట్లా బావుందని తప్పుడు నివేదికలు ఇచ్చారని, ఇప్పటికీ రగిలిపోతుంటారు టీడీపీ సీనియర్లు. ఏబీవీ తప్పుడు నివేదికల వల్ల పార్టీకి జరగరాని నష్టం జరిగిపోయిందని ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీలోని పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏబీవీని టార్గెట్ చేసుకుని ఏకంగా దేశద్రోహం కేసులు నమోదు చేయడంతో కేశినేని వంటి వారు దీనిపై స్టన్నయ్యారట. తప్పుడు రిపోర్టులతో చంద్రబాబును నిండా ముంచిన ఏబీవీ, వైసీపీకి మేలు చేశారనేది కేశినేని వంటి వారి వాదన. కేశినేని నాని బయటపడ్డారు కానీ ఎంతో మంది టీడీపీ సీనియర్లు ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కేశినేని బాధ అదొక్కటే కాదు, విజయశాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తనను వెంటకేశ్వర రావు వ్యతిరేకించారన్నది మరో ఆరోపణ. తనకు టికెట్ ఇస్తే, గెలిచే అవకాశమేలేదని, పీవీపీ గెలుస్తారని, చంద్రబాబుకు ఏబీవీ నివేదికలిచ్చారని రగిలిపోతున్నారు కేశినేని నాని. అందుకే రిపోర్టులతో టీడీపీని తప్పుదారి పట్టించి, పరోక్షంగా వైసీపీకి మేలు చేశారని, ఆయనకు వైసీపీ వాళ్లు సన్మానం చేయడం మాని, సస్పెండ్ చేశారెందుకని అన్నారు నాని. ఇంత జరిగాక కూడా, ఏబీని టీడీపీ వెనకేసుకురావడం సరైందికాదన్నది నాని భావన.

మొత్తానికి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌, చివరికి టీడీపీలోనే చిచ్చురేపింది. కక్షపూరితంగా సస్పెండ్ చేశారని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్న టైంలో, దానికి విరుద్దంగా అదే పార్టీ ఎంపీ నాని మాట్లాడటం చర్చనీయాంశమైంది. దీంతో జగన్ ప్రభుత్వం మీద టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు విలువే లేకుండాపోతోందన్నది మిగతా తెలుగుదేశం నేతల ఆవేదన. మొత్తానికి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌, తెలుగుదేశంలోనే భిన్నమైన స్పందనలకు వేదికైంది. మరి పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన నాని పట్ల బాబు చర్య తీసుకుంటారా సైలెంట్‌‌గానే వుంటారా అన్నది రానున్న కాలమే తేల్చాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories