logo
ఆంధ్రప్రదేశ్

నల్లారి కిశోర్‌ కుమార్‌ సైలెంట్ వెనక సీక్రెట్‌ ఏంటి?

నల్లారి కిశోర్‌ కుమార్‌ సైలెంట్ వెనక సీక్రెట్‌ ఏంటి?
X
Highlights

ఆయన, మాజీ సీఎం తమ్ముడు. అన్న ముఖ్యమంత్రిగా ఉండగా, మూడేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా వ్యవహరించిన నేత. ఇక...

ఆయన, మాజీ సీఎం తమ్ముడు. అన్న ముఖ్యమంత్రిగా ఉండగా, మూడేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా వ్యవహరించిన నేత. ఇక జిల్లాలో అయితే ఆయన హవాకు అడ్డులేకుండా సాగింది. అలాంటి వ్యక్తి టిడిపిలో చేరుతున్నాడని ఆ పార్టీ సంబరపడింది. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకన్నట్టు భుజం చరుచుకుంది. జిల్లాలో, ముఖ్యంగా పడమటి మండలాల్లో బలమైన సామాజికవర్గ ఓట్లకు ఢోకా ఉండదని భావించింది. పీలేరు టిక్కెట్టు పువ్వుల్లో పెట్టిచ్చింది. పార్టీ ఓటమి చెందాక ఆయనెక్కడా అంటూ పార్టీ దిక్కులు చూస్తోంది ఇప్పుడు. అప్పటికే పుట్టింటోళ్ళు వెళ్ళిపోయారు..తెచ్చుకున్నోడూ కనబడలేదు..పట్టుమనీ పదారు నెలలకే, నా సామి అన్నట్టుగా, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో పరిస్థితులు, కొత్త ట్యూన్‌ అందుకున్నాయి.

నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి సీఎం. అదృష్టం వరించి స్పీకర్‌ నుంచి సీఎం సీటుకు ఎగబాకిన లీడర్. నల్లారి కిశోర్ కుమార్‌ రెడ్డి. కిరణ్‌ కుమార్ రెడ్డి తమ్ముడు. అన్న సీఎంగా వున్నప్పుడు, తమ్ముడిదే హవా నడిచిందట. చిత్తూరు జిల్లాలో ఆయన చెప్పిందే వేదమట. షాడో సీఎంగా చక్రంతిప్పారన్న పేరూ ఆ‍యనకు వచ్చింది. కట్ చేస్తే, ఇప్పుడు అన్నా పత్తాలేరు. తమ్ముడూ అడ్రస్ లేరు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు మాత్రం, తమ్ముడి విషయంలో చాలా ఫీలవుతున్నారట.

చిత్తూరు జిల్లాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి, పడమటి మండలాల్లో మంచి పేరుంది. కిరణ్ తండ్రి నల్లారి అమర్‌నాథ రెడ్డి మంత్రిగా పని చేస్తే, కిరణ్ కుమార్ రెడ్డికి ఏకంగా ముఖ్యమంత్రిగా పని చేసే ఛాన్సే దొరికింది. అటూ ఇటూ మూడేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. అప్పటి వరకు అన్న చాటు తమ్ముడుగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి, రాజకీయ అరంగేట్రం పర్వం మొదలైంది. అన్న స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ తరపున, పీలేరు నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే సరికే నల్లారి స్థాపించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఏదో ఒకదారి కోసం అన్నా తమ్ములు ఎదురు చూస్తున్న వేళ, అన్న నాన్చుడు ధోరణి భరించలేక తమ్ముడు టిడిపిలోకి దూకేసారు.

తమ్ముడు చేరాక, అన్న కూడా రాకపోతాడా అన్న ఆశతో నల్లారి కిషోర్‌ను పార్టీలో చేర్చుకుంది టీడీపీ. చేరీ చేరగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. కిషోర్ కుమార్ రెడ్డి, రాజకీయ భవిష్యత్తుపై ఎన్ని ఆశలు, ఊహలతో టిడిపిలో చేరాడో అంతకన్నా రెట్టింపుగా టిడిపి కూడా ఊహించుకుంది. ఈ పరిణామం పీలేరులోని టిడిపి నేతలకు రుచించలేదు. దీంతో పార్టీలోని కీలక నేతలు ఎన్నికల ముందే కొందరు పార్టీ వీడగా, ఎన్నికల తరువాత మరికొందరు సర్దుకున్నారు. ఒకరిద్దరు కీలక నేతలు తప్ప, పీలేరులో మండల స్థాయిలో నిలబడే పాత టిడిపి నేతలు కనబడలేదు.

2019 ఎన్నికల్లో జిల్లాలో చంద్రబాబు తప్ప గంపగుత్తగా టిడిపి నేతలంతా ఓటమి పాలయ్యారు. తానోడి నన్నోడెనా...నన్నోడి తానోడెనా అన్న చందంగా, కారణాలేమైనా పార్టీ వల్ల వ్యక్తులా?...వ్యక్తుల వల్ల పార్టీనా అనే లెక్కలు పక్కనపెడితే, ఇప్పుడు ఆ పార్టీని పూర్వ స్థితిలోకి తీసుకురావడం కోసం జవసత్వాలు నింపే పనిలో పడ్డారు చంద్రబాబు. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో, ఏడు నెలలుగా నెలకొన్న స్తబ్దతను బ్రేక్ చెయ్యాలని తలంచారు. నియోజకవర్గాల్లో దూకుడుగా వెళ్ళాలని లీడర్‌కు, క్యాడర్‌కు సూచించారు. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా పడమటి మండలాలపై ఫోకస్ పెట్టారు.

కిషోర్ కుమార్ రెడ్డి నుంచి బలమైన సపోర్ట్ వస్తుందని ఊహించారు, భావించారు చంద్రబాబు. అయితే పీలేరులో ఆ పరిస్థితులు కనిపించలేదు. పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో, ఒకటి రెండు మండలాల్లో తప్ప, చంద్రబాబు ఆశించిన స్థాయిలో లేదు. అదే సమయంలో పార్టీ ఇస్తున్న పిలుపుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా, పీలేరు నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తొమ్మిదేళ్ళు అధికారంలో లేని రోజుల్లోనూ, పీలేరులో టిడిపికి ఈ పరిస్థితి రాలేదంటున్నారు ముందు నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు. ఇక పార్టీ వీడిన వారేమో, పార్టీలోనే కొనసాగుతున్న ఒకరిద్దరు కీలక నేతలకు వల వేస్తున్నారు. దీంతో చంద్రబాబు డామిడ్ కథ అడ్డం తిరిగిందని ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. నల్లారి కిశోర్‌ కుమార్‌ను నమ్ముకుంటే, నట్టేట ముంచారని చంద్రబాబు తెగ ఫీలవుతున్నారట. అన్నేమో ఒకలా, తమ్ముడేమో మరోలా తయారయ్యారని పీలేరు టీడీపీ నేతలతో అన్నారట బాబు. అదీ నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తమ్ముడు, నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డిపై బాబు గారి ఆగ్రహం.


Web TitleWhat is the secret behind Nallari Kishore Kumar Silent?
Next Story