Top
logo

బీజేపీ-జనసేన కలయికకు కారణమేంటి.. పాచిపోయిన లడ్డూలని ఇప్పుడెందుకు జోడికట్టారు?

బీజేపీ-జనసేన కలయికకు కారణమేంటి.. పాచిపోయిన లడ్డూలని ఇప్పుడెందుకు జోడికట్టారు?బీజేపీ-జనసేన కలయికకు కారణమేంటి
Highlights

పవర్‌ స్టార్ ఇక ఫ్లవర్‌ స్టార్‌. జనసేన ఇక భారతీయ జనసేన పార్టీ. పవన్‌ కల్యాణ్, ఇక కమల జనసేనాని. హిందూ ధర్మం...

పవర్‌ స్టార్ ఇక ఫ్లవర్‌ స్టార్‌. జనసేన ఇక భారతీయ జనసేన పార్టీ. పవన్‌ కల్యాణ్, ఇక కమల జనసేనాని. హిందూ ధర్మం పరిరక్షిస్తానంటూ కాషాయ లాంగ్వేజ్‌లో ఫీలర్లు వదిలి, బీజేపీకి తానెప్పుడు దూరమయ్యానంటూ ట్రైలర్‌ వదిలిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు ఏకంగా భారతీయ జనసేన సినిమాకు తెరతీశారు. బీజేపీతో కలిసి ప్రయాణం చెయ్యాలని డిసైడయ్యారు. 2024లో అధికారమే లక్ష్యంగా కలిసి సాగుతామని ప్రకటించారు. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిగా ఎదుగుతామని శపథం చేశారు. మరి మొన్నటి వరకు బీజేపీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన పవన్‌, ఇప్పుడే ఎందుకు పొగడ్తలు కురిపిస్తున్నారు? పాచిపోయిన లడ్డూలంటూ విమర్శించిన పవన్‌, ఏపీకి బందరు లడ్డూలాంటిదేమైనా ఇస్తామని బీజేపీ హామి ఇచ్చినందుకు కలిసి నడవాలని తీర్మానించుకున్నారా? ఇప్పటికిప్పడు ఎన్నికలు లేకపోయినా, నాలుగున్నరేళ్ల ముందే ఫ్రెండ్‌షిప్‌కు ఎందుకు చేతులు చాస్తున్నారు? ఈ రిలేషన్‌ సహజీవనం వరకేనా లేదంటే విలీనమనే వివాహంతో శాశ్వతబంధమవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సరికొత్త సమీకరణానికి తెరలేచింది. భారతీయ జనతా పార్టీ-జనసేనల మధ్య పొత్తు పొడిచింది. విజయవాడలో సమావేశమైన రెండు పార్టీలు, ఇక నుంచి ఆందోళనలు, నిరసనలు సహా ఎన్నికలు ఏవైనా కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.

ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్‌పై, ఇప్పుడు అనేక ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. నాడు ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీలపై బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించిన పవన్‌, నేడు అదే పార్టీతో జట్టుకట్టడానికి కారణమేంటి? అప్పటికి ఇప్పటికి కమలంలో ఆయనకు కనిపించిన మార్పులేంటి? ఇక తోడు బీజేపీ దొరికింది కాబట్టి, రాజకీయాలకు అప్పుడప్పడు ప్యాకప్ చెప్పి, సినిమాలకు మేకప్ వేసుకుంటారా? మూడో ప్రత్నామ్నాయంగా ఎదుగుతామన్న బీజేపీ-సేన కూటమి, టీడీపీని రీప్లేస్ చెయ్యగలదా? పాతికేళ్ల ప్రస్థానమని ఐదారేళ్లలోనే అనేక ప్రస్థానాలు మారిన పవన్, అన్న చిరంజీవి తరహాలోనే, జనసేననూ బీజేపీలో విలీనం చెయ్యరని హామీ ఇవ్వగలరా? బీజేపీ-జనసేనలు కూటమి ఎందుకు కట్టాయి? వీరి ప్రణయం ఎలా ఉండబోతోంది?

జనసేన-బీజేపీ మధ్య సైద్దాంతిక సారూప్యమేది?

పవన్ కల్యాణ్‌ మొదటి నుంచి చేగువేరా వీరాభిమాని అని అందరికీ తెలుసు. జనసేన స్థాపన టైంలోనూ చేగువేరా గురించి ప్రస్తావించారు. శ్రీశ్రీ కవితలతో ప్రసంగాన్ని ఊపెక్కించారు. 2014 టైంలోనూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే బీజేపీకి మద్దతిచ్చానన్నారు తప్ప, రెండు పార్టీల భావజాలం ఒక్కటేనని చెప్పలేదు. 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు కంటే పెద్ద కమ్యూనిస్టునన్నట్టుగా పవన్ వ్యవహరించారు. అంటే బీజేపీతో సైద్దాంతికంగా తమకు చాలా తేడా వుందనన్నారు. మరి ఏమాత్రం సైద్దాంతికరపరమైన సారూప్యతలేకపోయినా నేడెందుకు బీజేపీతో కలుస్తున్నారన్న ప్రశ్నకు పవన్‌ సమాధానమివ్వాలంటున్నారు వామపక్ష నేతలు. పాతికేళ్ల ప్రస్థానమని చెప్పి, ఐదారేళ్లలోనే ఇన్ని పల్టీలేంటని కూడా ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ-సేన కలయికతో ఏపీకి కలిగే లాభమేంటి?

ప్రత్యేక హోదా కావాలని టీడీపీ, వైసీపీల కంటే బలంగా డిమాండ్ చేసిన నేత పవన్ కల్యాణ్. హోదా కాదు ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పడంతో, ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చారు. మరి ఇఫ్పుడు ఆ పాచిపోయిన లడ్డూ కూడా ఇవ్వని కాషాయ పార్టీతో ఎందుకు కలుస్తారన్న ప్రశ్నకు పవన్‌ ఆన్సరివ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వీరిద్దరి కలయిక వల్ల ఏపీకి కలిగిన, కలగబోయే మేలేంటో చెప్పాలన్న ప్రశ్న కూడా దూసుకొస్తోంది.
Web TitleWhat is the reason behind BJP and Jana Sena meeting in Vijayawada
Next Story

లైవ్ టీవి


Share it