Top
logo

వివాదంలో విందు రాజకీయం.. రాజుగారి విందు రాజకీయం వెనక అసలు రాజకీయమేంటి?

వివాదంలో విందు రాజకీయం.. రాజుగారి విందు రాజకీయం వెనక అసలు రాజకీయమేంటి?
X
రఘురామ కృష్ణంరాజు
Highlights

ఆయనొక ఎంపీ. ప్రాంతీయపార్టీలో వుంటూ నేషనల్‌ లెవల్‌ లీడర్‌లా ఫీలవుతుంటారు. విందులు, వినోదాలంటూ అందరి ముందు కాస్త ...

ఆయనొక ఎంపీ. ప్రాంతీయపార్టీలో వుంటూ నేషనల్‌ లెవల్‌ లీడర్‌లా ఫీలవుతుంటారు. విందులు, వినోదాలంటూ అందరి ముందు కాస్త బిల్డప్‌ ఇస్తుంటారన్న పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా హస్తినలో అదిరిపోయే విందిచ్చి, వివాదాన్ని రాజేశారు. బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు చిన్నాచితకా పార్టీల అగ్ర నాయకులకు ఆతిథ్యమిచ్చి, లేనిపోని అనుమానాలకు మరింత ఆస్కారమిచ్చారు. అయితే హస్తిన విందు వెనక, ఆ రాజరాజ మార్తాండకు పక్కా వ్యూహముందా? విందు చుట్టూ రాజుకుంటున్న చిచ్చేంటి?

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ విందు రాజకీయం, వైసీపీలో ప్రకంపనలు రేపడంతో పాటు పొలిటికల్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. కొన్ని రోజులుగా రాజుగారి మాటలతో ఆగ్రహంతో వున్న వైసీపీ అధిష్టానానికి, ఈ డిన్నర్‌ మరింత మంట పుట్టిస్తోంది.

సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ అధ్యక్షుడి హోదాలో, ఢిల్లీలోని జనపథ్‌, లాన్స్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ కోర్టులో ఎంపీలకు విందిచ్చారు రఘురామ కృష్టంరాజు. ఈ విందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా పలువురు ఎంపీలు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన ఎంపీలను ఆయన ఆత్మీయంగా ఆహ్వానించారు. అదరిపోయే డిన్నరిచ్చారు. ఈ విందుకు 500 మంది ఎంపీలను ఆహ్వానించానన్న రఘురామ కృష్ణం రాజు, దానిలో సగం మందికి పైగా వచ్చారని చెప్పుకుంటున్నారట. నోరూరించే తెలుగు వంటకాలకు తోడు, వెయ్యి రూపాయల స్పెషల్ పాన్ అందరి నోళ్లను పండించిందట. కానీ వైసీపీ అధిష్టానాన్ని మాత్రం మండించిందట. అందుకు నిదర్శనం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విందుకు హాజరుకాకపోవడం.

ఢిల్లీలో విందు రాజకీయాలు కొత్తేం కాదు. శీతాకాల సమావేశాల్లో కొందరు నేతలు అట్టహాసంగా డిన్నర్‌ ఇస్తుంటారు. బడాబడా నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు చాలామంది విందులిస్తుంటారు. రకరకాల రుచుల వడ్డించి కాంట్రాక్టులు దక్కించుకోవడం, హస్తినలో చిన్నాచితక పనులు చేయించుకోవడం, తమ పలుకుబడి ఈ రేంజ్‌లో వుందని పదిమందికి చూపించుకోవడానికి విందు రాజకీయాలు చేస్తుంటారు. సుబ్బరామిరెడ్డి కూడా ఇలాంటి విందులెన్నో ఇస్తుంటారు. మొదటి నుంచి ఇలాంటి విందులు ఏర్పాటు చేయడంలో రఘురామకృష్టంరాజు కూడా దిట్టే. అయితే తాజా డిన్నర్ మాత్రం ప్రకంపనలు రేపడానికి చాలా కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నరసాపురం ఎంపీగా గెలిచిన తర్వాత, రఘురామ కృష్ణంరాజు తీరే మారిపోయిందంటారు వైసీపీ నేతలు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావడంతో, తిరిగి అదే పార్టీ ప్రసన్నత కోసం పాకులాడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పనసరిని ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రభుత్వం భావిస్తుంటే, లోక్‌సభలో మాత్రం ఆ వాదనకు విరుద్దంగా మాట్లాడారని వివాదం తెచ్చుకున్నారు రాజు. మాతృభాషలే మేధో వికాసానికి మేలని ప్రధాని మోడీ చెబుతుండటంతో, మోడీని మెప్పించేందుకు చివరికి సొంత పార్టీని సైతం నొప్పించడానికి సిద్దపడ్డారట. రాజుగారి మాటలపై వివాదం చెలరేగడంతో, అమరావతికి పిలిపించుకుని సీఎం జగన్‌ తలంటారట.

ఇక పార్లమెంట్‌ హాల్లో రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై కూడా వైసీపీ అధిష్టానం కాస్త ఆగ్రహంగా వుందట. అదే పనిగా కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలను రాజు కలుస్తుండటం, వంగివంగి నమస్కారాలు పెడుతుండటంపై కోపంగా వుందట. బీజేపీనే కాదు, కాంగ్రెస్‌ ఎంపీల దగ్గరా ఎప్పుడంటే అప్పుడు వాలిపోతుంటారట రాజు. వారు పలకరించకపోయినా, మాట్లాడేందుకు, విష్ చేసేందుకు ఆత్రపడతారట. సోనియా గాంధీ దగ్గరకు వెళ్లీ తాజాగా పలకరించారట రాజు. మొన్న ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఇలాగే పలకరించి, తనను మోడీనే స్వయంగా రాజుగారు హౌ ఆర్‌ యూ అంటూ విష్ చేశారంటూ చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. అమిత్ షా సైతం మిగతా వైఎస్సార్సీపీ నేతల కంటే ముందు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. రఘురామ కృష్ణం రాజు మళ్లీ సొంత పార్టీ అయిన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే అదేపనిగా బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని, ఢిల్లీలో చాలామంది చెప్పుకుంటున్నారట. దానిలో భాగంగానే ఢిల్లీలో తాజా రాజకీయ విందు ఏర్పాటు చేశారని మాట్లాడుకుంటున్నారు.

తన వ్యవహారశైలిపై వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా వున్నా, తన దారి తనదేనన్నట్టుగా రఘురామ కృష్ణంరాజు బిహేవ్ చేయడం వెనక కూడా కొంత స్ట్రాటజీ వుందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీతో సస్పెండ్ చేయించుకుని, బీజేపీలోకి వెళ్లాలన్నది ఆయన వ్యూహమట. కానీ వైసీపీ అలాంటి పని మాత్రం చేయడానికి సిద్దంగా లేదు. అటు లోక్‌సభలో భారీ మెజార్టీ వున్న బీజేపీకి, రఘురామ రావడం వల్ల కొత్తగా వచ్చే లాభమూ లేదు కనుక, ఫిరాయింపును ఇప్పటికిప్పుడు ప్రోత్సహించే అవకాశమే లేదు. అటు రఘురామకృష్ణంరాజుకు ఎలాంటి పనులు, కాంట్రాక్టులూ ఇవ్వొద్దని బీజేపీ పెద్దలకు సైతం వైసీపీ నేతలు చెప్పారట.

బీజేపీలోకి వెళ్లేందుకు రాజు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని భావిస్తున్న వైసీపీ అధిష్టానం, ఆ‍యనకు చెక్‌ పెట్టడం కూడా మొదలుపెట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామ కృష్ణంరాజు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు, సోదరులు పార్టీలోకి చేర్చుకోవడం అందులో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తనకు అలవాటై రీతిలో విందు రాజకీయాలు చేస్తూ, చక్రంతిప్పాలనుకుంటున్న రఘురామ కృష్ణంరాజుకు, సొంత పార్టీ ఆగ్రహం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.


Web TitlePolitics Controversy: What is the real politics behind feasting?
Next Story