చంద్రబాబుకు బీపీ పెంచుతున్న కావలి తమ్ముళ్ల తగువేంటి?

చంద్రబాబుకు బీపీ పెంచుతున్న కావలి తమ్ముళ్ల తగువేంటి?
x
Highlights

చంద్రబాబుకు ఇప్పటికే బీపీ మీద బీపీ రైజ్‌ అవుతోంది. ఒకదాని తర్వాత ఇంకో ఇష్యూ తలనొప్పి తెస్తోంది. ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోంది. ఇలాంటి సమయంలో,...

చంద్రబాబుకు ఇప్పటికే బీపీ మీద బీపీ రైజ్‌ అవుతోంది. ఒకదాని తర్వాత ఇంకో ఇష్యూ తలనొప్పి తెస్తోంది. ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోంది. ఇలాంటి సమయంలో, చంద్రబాబుకు కోపం నషాళానికి అంటేలా చేస్తోంది ఒక నియోకజవర్గంలో తమ్ముళ్ల తగువులాట. ప్రశాంతగా పార్టీని డెవలప్‌ చెయ్యండి అంటూ, జూమ్‌ మీటింగ్‌లో కర్తవ్యబోధ చేస్తుంటే, జామ్‌ అంటూ గొడవలకు దిగుతున్నారట లీడర్లు. బాబుకు బీపీ పెంచుతున్న బాబులెవరు?

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా వుంది నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం నేతల తీరు. ఒకవైపు రాష్ట్రంలో పార్టీ మనుగడపైనే అధినేత ఆందోళన చెందుతుంటే, ఇంకోవైపు అక్కడి నేతల తీరుల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఐక్యంగా కలిసి అధికార పార్టీని ఎదుర్కొందామంటూ అధినేత చెబుతున్న మాటలు, ఇక్కడి నేతలకు ఏమాత్రం చెవికెక్కడం లేదు. ఎవరికి వారు ఆధిపత్యాలను ప్రదర్శిస్తున్నారు. అనుచరగణాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం. టిడిపిలో ఉద్దండ నేతల పురిటిగడ్డ. నెల్లూరు జిల్లాకు ముఖద్వారం కూడా. 15 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా, ఇక్కడ మాత్రం వేద సోదరులదే హవా. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు, ముందు రాజకీయ సమీకరణలు మారాయి. అప్పటివరకూ వైసీపీలో ఉన్న కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి, ఆ పార్టీ పట్ల అసంతృప్తితో, అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. పార్టీ మారిందే తడువుగా, టిడిపి అధినేత చంద్రబాబు, కావలిలో విష్ణువర్ధన్ రెడ్డికి సముచిత స్థానం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో కావలి టికెట్టు ఇచ్చి విష్ణువర్ధన్ రెడ్డిని రంగంలోకి దింపారు. ఎన్నికల్లో విష్ణువర్థన్ రెడ్డి ఓడిపోయారు. ఇక అప్పటినుంచి కావలి టిడిపిలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

రాష్ట్రంలో వైసిపి ఊహించని ప్రభంజనంతో అధికారంలోకి వచ్చింది. ఇక్కడి నుంచే కావలి నియోజకవర్గ ఈక్వేషన్స్‌ శరవేగంగా మారాయి. దాదాపు ముప్పై ఏళ్లుగా టిడిపిలో నిబద్ధత కలిగిన నేతగా పేరున్న బిఎన్‌ఆర్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు టిడిపిని వీడారు. తమ పూర్వ వ్యాపార భాగస్వామి, నేటికీ బిఎమ్మార్ గ్రూపు సంస్థల ఆడిటర్, వైసీపీ ప్రధాన నాయకులు ఎంపీ విజయ సాయి రెడ్డి ద్వారా ఆ పార్టీలో చేరారు. దీంతో కావలి టిడిపిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు ముఖ్యనేతలు టిడిపిని వీడారు. ఇంకోవైపు టిడిపి జిల్లా అధ్యక్షులుగా ఉన్న బీదా రవిచంద్రకి, పార్టీలో పదోన్నతి కల్పిస్తూ, ఆయనను పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు చంద్రబాబు. ఒకవైపు ప్రధాన నేత బీఏమ్మార్ వైసీపీలోకి వెళ్ళడం, ఇంకోవైపు బీదా రవిచంద్ర పార్టీ జాతీయ విభాగంలోకి వెళ్ళడం. ఇదే సమయంలో విష్ణువర్థన్ రెడ్డికి నియోజకవర్గ పూర్తి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఈ పరిణామం బీదావర్గానికి మింగుడు పడలేదు.

అప్పటివరకు కావలి నియోజకవర్గం టిడిపి అంటే బీదా సోదరులు అన్న పరిస్థితులు మారుతుండటం, స్థానిక వర్గం జీర్ణించుకోలేకపోతోందట. దానికి తోడు ఇటీవల కావలి ప్రెస్ క్లబ్, ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు సందర్భంగా, నియోజవర్గం ఇంఛార్జిగా ఉన్నా తమ నేతను సంప్రదించకుండా, బీదా రవిచంద్ర హడావిడి చేశారంటూ విష్ణు వర్గం ఆగ్రహించింది. నేరుగా బీదావర్గంపై అక్కసు వెళ్లగక్కారు. ఇక్కడే అసలు రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి. ఆది నుంచీ అల్లూరులో ప్రత్యర్థి వర్గంగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి, చెక్ పెట్టే వ్యూహం స్టార్టయ్యింది. అదే మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల రెడ్డి రీఎంట్రీ.

సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్‌కే పరిమితమైన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డిని, తిరిగి నియోజకవర్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇటీవల వంటేరు వేణుగోపాల్ రెడ్డిని హైదరాబాదులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి పరిచయం చేశారట. ఆయనకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించే సన్నాహాలు చేస్తున్నట్లు, ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. వారంరోజులుగా వంటేరు కావలిలో రీఎంట్రీ అంటూ సోషల్‌ ‌మీడియాలో హడావుడి చేశారు. ఇది విష్ణువర్గానికి మింగుడుపడని పరిస్థితిగా మారింది. ఇటు విష్ణువర్ధన్‌ ‌రెడ్డి, అటు బీదా రవిచంద్ర, మూడో నేతగా వంటేరు నియోజకవర్గంలో రీఎంట్రీ ఇస్తున్నారన్న సంకేతాలు, ఇప్పుడు కావలి నియోజవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిణామాలు టీడీపీలో గందరగోళానికి దారితీస్తున్నాయి.

ఒకవైపు అధికారం కోల్పోయి, తిరిగి కోలుకునేందుకు అధినేత చంద్రబాబు నానాపాట్లు పడుతూవుంటే, ఇక్కడ చింతచచ్చినా పులుపు చావదు అన్నట్లుగా, టీడీపీ నేతలు ఇంకా అంతర్గత కుమ్ములాటనే కొనసాగిస్తున్నారంటూ, అక్కడి కేడర్‌ ఆం‌దోళన వ్యక్తం చేస్తోందట. కావలి నియోజవర్గంలో తాజాగా మారుతున్న పరిణామాలు ఎలాంటి సమీకరణాలకు దారితీస్తాయో వేచిచూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories