నో లీక్స్‌... ఓన్లీ షాక్స్‌.. జగన్‌ నయా స్ట్రాటజీ

What is Jagans Strategy in Cabinet Expansion
x

నో లీక్స్‌... ఓన్లీ షాక్స్‌.. జగన్‌ నయా స్ట్రాటజీ

Highlights

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. రాజకీయాల్లో రాటుదేలిన ఉద్దండ పిండం. అతిరథ మహారథులను తట్టుకొని నిలబడిన గుండె ధైర్యం.

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. రాజకీయాల్లో రాటుదేలిన ఉద్దండ పిండం. అతిరథ మహారథులను తట్టుకొని నిలబడిన గుండె ధైర్యం. ఎవరిని ఎలా చూడాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలిసిన రాజకీయ చాతుర్యం. అవును. మహామహా రాజకీయ విశ్లేషకులు అంచనాలకు దొరక్కుండా ఎవ్వరూ ఊహించని షాక్‌లు ఇవ్వడంలో తన నేర్పరితనాన్ని బయటపెడుతున్నారు జగన్‌. అందుకే షాక్‌లు తప్ప లీకుల్లేవని ఆయన గురించి సొంత పార్టీల్లోనే మాట్లాడుకుంటున్నారు. ఊహించని విధంగా నిర్ణయాలు తీసకుంటూ వాటిని అంతే పక్కాగా అమలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా మొన్నటి నామినేటెడ్‌ పదువులు, త్వరలోనే జరగబోయే కేబినెట్‌ ఎక్స్‌పాన్షన్‌‌లో కూడా లీకుల్లేకుండా షాక్‌లు ఇస్తారేమోనన్న భయం ఫ్యాన్‌పార్టీ నేతలను వెంటాడుతోందట.

ఎవరక్కడ... వైఎస్‌ జగన్‌ ఇక్కడ అంటున్నారట ఏపీ సీఎం. నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఊహించని విధంగా పట్టాలెక్కించడంలో ఆయనకు ఆయనే సాటిగా చెప్పుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కొన్ని డిసెషన్స్‌ తీసుకునే ముందు కొన్ని లీకులు ఇస్తారు. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అంచనాకు వస్తారు. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నమట. లీకులు ఇవ్వకుండానే షాక్‌లు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారట.

వాస్తవానికి నామినేటెడ్ పదవుల విషయంలో అత్యంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. కనీసం ఒకటి రెండు పేర్లు కూడా బయటకు రాకుండా చివరి నిమిషం దాకా గోప్యత పాటించారట. తాను చేయాలనుకున్నది చేయడమే తప్ప లీకులు ఇవ్వడం దానిపై చర్చ పెట్టడం సీఎం జగన్‌ డిక్షనరీలోనే లేదంటున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల విషయంలో రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజాలకు ఉన్న పదవులు ఊడగొట్టారు. ఇది చివరి నిమిషంలో బయటకు వచ్చే వరకూ ఆయన పక్కనున్న వారికే తెలియలేదట. ఇదే కాకుండా తనను నమ్ముకున్న వారికి కూడా పదవులు ఇస్తున్న విషయం లాస్ట్‌ మినట్‌ వరకూ వాళ్లకూ తెలియనివ్వలేదట. ఎవరి మాటను పరిగణనలోకి తీసుకోకుండా ఎంత మాత్రం లీక్‌ చేయకుండా అందరికీ షాక్‌ ఇచ్చారంటూ కథలు కథలు చెప్పుకుంటోంది వైసీపీ క్యాంప్‌.

త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేయబోతున్నారట జగన్‌. సామాజిక రాజకీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకొని మంత్రిమండలి మొత్తాన్ని మార్పు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీనియర్ మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆలోచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే, సీనియర్‌ లేదు జూనియర్‌ లేదు అందరికీ షాక్‌లు తప్పవన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఇక్కడే ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మంత్రిమండలిని మారుస్తే, కేబినెట్‌ బెర్త్‌ దక్కించుకునే కొత్త వారు ఎవరన్న చర్చా మొదలైంది. ఒకవేళ ఫలానా వాళ్లేనంటూ లీక్‌లు బయటకు వచ్చినా వాటిలో వాస్తవాలు ఉండడం లేదట. అందుకే తమకే బెర్త్‌ అన్న ఆశతో ఎదురుచూస్తున్న 50 మందిలో ఎవరెవరూ ఉంటారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయట. చాన్స్‌ ఇస్తే ఎగరేసుకోవడానికి రెడీ 50 మంది ఉన్నా అందులో సగానికి సగం తగ్గించి అంటే 25 మందికి మాత్రమే అవకాశం ఇస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం జగన్ క్యాబినెుట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరు ఔట్ అవుతారన్న దానిపైన్నే పార్టీలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. సీఎం చెప్పిన అందరికీ రెండున్నరేళ్లే అన్న మాటలని లెక్కలోకి తీసుకుంటే 10 మందిని ఉంచి, మిగిలిన 15 మంది స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారని పార్టీలో కీలక నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో సీనియర్లతో పాటు మొదటిసారి మంత్రి అయిన వారిలోనూ కొందరిని కొనసాగిస్తారని సమాచారం. వీరిలో ఫైర్‌బ్రాండ్స్‌గా ఉన్న మంత్రులను కొనసాగించే అవకాశం ఉందన్న టాక్‌ నడుస్తోంది. వచ్చేది ఎన్నికల ఇయర్ కాబట్టి వారికి తోడు మరికొందరు ఫైర్ బ్రాండ్స్‌కి క్యాబినెట్‌ బెర్త్‌ ఖాయమన్న సంకేతాలు పార్టీలో కనిపిస్తున్నాయి.

అయితే, తన కేబినెట్‌లోని మంత్రుల గురించి పూర్తి సమాచారంతో ఉన్న సీఎం పార్టీ కేడర్‌తో వారి సంబంధాలపై ఆరా తీస్తున్నారట. ఇది ఇప్పుడు మంత్రుల మధ్య హాట్‌టాపిక్‌గా మారుతోంది. తాను ఏరి కోరి తెచ్చుకున్న కొందరి మంత్రులపై సీఎం అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మధ్య కంటిన్యూ అవ్వాలని చూస్తున్న మంత్రులు కొందరు మంత్రివర్గ విస్తరణలో తమ పరిస్థితి ఏంటన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నారట. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న అమాత్యులు కొందరు తమ సొంత జిల్లాలో పార్టీ పరిస్థితులు కేడర్‌తో మమేకం అవటం క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాలు తెలుసుకోవటంలో సరైన చొరవ చూపకపోవటంపైనా సీఎం ఆగ్రహంగా ఉన్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖలో రాయలసీమ మంత్రులు బెంగళూరులో ఆంధ్ర మంత్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారంటూ వైసీపీలో ఓ చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ సీఎం చెప్పినా నలుగురైదుగురు మంత్రులు మాత్రమే, అంశాల మీద పూర్తి సమాచారంతో రావటం ప్రతిపక్షాల విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొట్టటంలో ముందున్నారని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో సమర్ధవంతంగా లేని మంత్రులపైన సీఎం ఎటువంటి చర్యలకు సిద్దమవుతారో అనే ఉత్కంఠ మంత్రుల్లోనూ పార్టీ ముఖ్యుల్లోనూ కనిపిస్తోంది. ముందు నుంచి సామాజిక ఈక్వేషన్స్‌ ఫాలో అయ్యే జగన్‌ ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతారని తెలుస్తుంది.

ఏమైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతమాత్రం లీక్‌లు ఇవ్వడం లేదు. తన క్యాంప్‌లో ఏం జరుగుతుందో రెండో వ్యక్తికి తెలియనివ్వడం లేదట. ఆశావహులు ఎందరున్నా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా సీఎం మనసులో ఎవరున్నారో అనే దానిపై అంచనా వెయ్యడం కష్టమే అంటున్నారు పార్టీ నేతలు. చూడాలి మరి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా తన మంత్రులపై జగన్‌ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో!!

Show Full Article
Print Article
Next Story
More Stories