జనసేనలో అసలేం జరుగుతోంది..నేతల వరుస రాజీనామాలు చెబుతున్నదేంటి?

జనసేనలో అసలేం జరుగుతోంది..నేతల వరుస రాజీనామాలు చెబుతున్నదేంటి?
x
Highlights

జనసేనలో ఇద్దరు అగ్రనేతలపై తొలిసారి, ఓ ఇద్దరు గొంతు విప్పారు. ఒకరు పార్టీలోనే వుంటూ, పార్టీ అధినేత వ్యాఖ్యలను సుతిమెత్తగా ఖండిస్తూనే, మరో కీలక నేతపైనా...

జనసేనలో ఇద్దరు అగ్రనేతలపై తొలిసారి, ఓ ఇద్దరు గొంతు విప్పారు. ఒకరు పార్టీలోనే వుంటూ, పార్టీ అధినేత వ్యాఖ్యలను సుతిమెత్తగా ఖండిస్తూనే, మరో కీలక నేతపైనా స్వరం పెంచారు. మరొకరు పార్టీకి రాజీనామా చేసి, అధినాయకుడిపై ఫైరయ్యారు. ఇద్దరు ఇద్దర్నీ ఎందుకు టార్గెట్ చేశారు జనసేనలో అసలేం జరుగుతోంది?

జనసేనలో కొన్నిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, జన సైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడటం క్యాడర్‌ను‌ కన్‌ఫ్యూజ్ చేస్తుంటే, పార్టీ సిద్దాంతకర్తలు, కీలక నాయకులు, వరుసగా రాజీనామాలు సమర్పిస్తూ బయటకు వెళ్లిపోతుండటం మరింత కలకలం రేపుతోంది.

రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అద్దేపల్లి శ్రీధర్, పార్టీ కోశాధికారి, మెగా ఫ్యామిలీకి బంధువు రాఘవయ్య, శివశంకర్‌లు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. జేడీ లక్ష్మీనారాయణ అంటీముట్టనట్టుగా వున్నారు. తాజాగా పార్టీ సిద్దాంతకర్త, వ్యూహకర్త, పవన్‌ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజు రవితేజ, తాజాగా జనసేనకు రాజీనామా సమర్పించి, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

జనసేన వ్యవస్థాపనలో కీలకంగా వ్యవహరించారు రాజు రవితేజ. మొదటి జనరల్‌ సెక్రటరీ ఈయనే. పార్టీ రాజ్యాంగం రచన చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు. పవన్‌ సిద్దాంతాల సమాహారం ఇజం పుస్తకం రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ అంతరంగాన్ని ఎరిగిన వ్యక్తి. అలాంటి రాజు రవితేజ జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జనసేన స్థాపన టైంలో కులాలను ఏకం చేద్దాం, మతాలకు అతీతంగా నడుద్దామంటూ ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, ఇప్పుడు దానికి విరుద్దంగా వెళుతోందని ఆరోపించారు రవితేజ. బీజేపీకి దగ్గరయ్యేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దాడులు, విద్వేష ప్రసంగాలు చేసిన పవన్, నెలన్నర, రెండు నెలల నుంచి పూర్తిగా మారిపోయారని, పార్టీ మూల సిద్దాంతాలకు విరుద్దంగా, కులమతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పుకున్నారు రవితేజ.

రాజు రవితేజ రాజీనామా వ్యవహారం అటుంచితే, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సైతం, పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దని పవన్ కల్యాణ్‌ అంటే, కావాలని ఏకంగా అసెంబ్లీలోనే అన్నారు రాపాక. అనవసరమైన కారణాలతో పవన్ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని అన్నారు. పవన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ రైతు సౌభాగ్య దీక్షకు సైతం వెళ్లలేదు రాపాక. అంతేకాదు, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాపాక. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి మనోహరే కారణమని చెబుతున్నారని అన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై తమ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంప్రదించుకుంటారని, మరెవరితోనూ మాట్లాడరని, హెచ్‌ఎంటీవీ ఇంటర్వ్యూలో అన్నారు.

రాజీనామాల నుంచి రాపాక వరప్రసాద్ వ్యాఖ్యల దాకా, జనసేనలో జరుగుతున్న పరిణామాలు, జనసైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీలో ఏం జరుగుతుందో ఏమో, ఎవరెప్పుడు పార్టీ మారతారోనన్న కన్‌ఫ్యూజన్‌లో వున్నారు. పవన్ కల్యాణ్‌ కుల, మతాల గురించి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాజు రవితేజ ఆరోపిస్తే, ఇటు పవన్‌పై పెద్దగా విమర్శలు చేయకపోయినా, పార్టీలో నాదెండ్ల పెత్తనం పెరగడమే అశాంతికి దారి తీస్తోందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యాఖ్యానించడం, రెండు అంశాలను స్పష్టం చేస్తోంది. అది పవన్‌ కల్యాణ్‌లో మార్పు, పార్టీలో నాదెండ్ల మనోహర్‌ వ్యవహారం.

నెలన్నర క్రితం ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత, పవన్‌‌ కల్యాణ్‌ ప్రసంగాల్లో మార్పు స్పష్టంగా కనపడుతోంది. అంతవరకు కులాలు, మతాల ప్రస్తావన తీసుకురాని పవన్, ఆ తర్వాత జగన్‌ సర్కారుపై దాడికి అవే ప్రధానాంశాలుగా ప్రసంగాల వాడి పెంచారు. సీఎం జగన్‌ మతాన్ని ప్రస్తావించారు. మత మార్పిడులకు వెన్నుదన్నుగా వుంటున్నారని ఆరోపించారు. ఎన్నడూ లేనిది తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినని చెప్పుకున్నారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలిస్తానన్నారు. అంతేకాదు, కులాల గురించి నేరుగా ప్రస్తావించడం మొదలుపెట్టారు.

బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగాలేనని స్పష్టం చేశారు. చేగువేరా, భగత్‌ సింగ్‌లాంటి యోధులే తనకు ఆదర్శమన్న పవన్‌, ఇప్పుడు మాత్రం కాషాయమే తన బాటన్నట్టుగా మాట్లాడ్డం, క్యాడర్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. ముఖ్యంగా నెలన్నర, రెండు నెలల కాలంలో, అంటే ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత పవన్‌లో ఇలాంటి మార్పు కొట్టొచ్చిన్టటు కనపడుతోంది. అదే పార్టీలో గందరగోళానికి దారి తీస్తోంది. అటు నాదెండ్ల మనోహర్‌ పెత్తనంపైనా నేతలు గుర్రుగా వున్నారు. వెరసి, జనసేనలో రాజీనామాల పరంపర కొనసాగుతోందని రాజకీయ పండితులంటున్నారు. మరి నిజంగానే పవన్‌లో మార్పొచ్చిందా వస్తే మార్పు మంచికేనని పవన్‌ పార్టీకి చెబుతారా లేదంటే ఇలాంటి కన్‌ఫ్యూజ్‌నే కంటిన్యూ చేస్తారా, అదే జరిగితే, జనసేనలో ఇంకెలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయో కాలమే సమాధానం చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories