ఇంతకీ ఆ ఊరిలో ఏం జరిగింది..?

ఇంతకీ ఆ ఊరిలో ఏం జరిగింది..?
x
Highlights

తెల్లవారుతుండగానే మృత్యుపొగలు ఆ ఊరిని కమ్మేశాయి. అందమైన సాగరతీరం రసాయనాల వలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆయువు తీస్తున్న వాయువుతో వెంకటాపురం పోరాడుతోంది.

తెల్లవారుతుండగానే మృత్యుపొగలు ఆ ఊరిని కమ్మేశాయి. అందమైన సాగరతీరం రసాయనాల వలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆయువు తీస్తున్న వాయువుతో వెంకటాపురం పోరాడుతోంది. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ పొల్యూషన్‌తో పదుల సంఖ్యలో ప్రాణాలు తీయడంతో పాటు వందలాది మందిని ఆస్పత్రిపాలు చేసింది. ఇంతకీ ఆ ఊరిలో ఏం జరిగింది..?

విశాఖ గోపాలపట్నం పరిధిలోని వెంకటాపురం గ్రామంలో1997లో ఎల్జీ పాలీమర్స్ కంపెనీని నెలకొల్పారు. దాదాపు 213 ఎకరాల వీస్తీర్ణంలో ఈ కంపెనీ వుంది. 417 టన్నుల పాలీస్టర్ ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తిలో స్ట్రైరైన్ అనే లిక్విడ్ గ్యాస్‌ను ముడిసరుకుగా ఈ కంపెనీలో వినియోగిస్తారు. సింథటిక్, రబ్బర్, ప్లాస్టిక్‌ను తయారు చేసేందుకు ఈ స్టైరైన్ గ్యాస్‌ను వినియోగిస్తారు. స్ట్రైరైన్ గ్యాస్‌కు రంగు ఉండదు. గాఢమైన వాసన కలిగి అత్యంత బరువైన అణుపరిమాణం కలిగి వుంటుంది.

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ లాక్‌డౌన్‌ కారణంగా 45 రోజుల నుంచి ఎలాంటి పనులు జరగడంలేదు. దీంతో స్టైరీన్‌ మోనోమర్‌ అనే విషవాయువు నిల్వ ఉన్న ట్యాంకర్లలో ఒత్తిడి పెరిగిపోయింది. మొత్తం 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థలో లాక్‌డౌన్‌ సందర్భంగా తక్కువ మందితోనే ప్రస్తుతం నడిచింది. ట్యాంకుల్లో ఉన్న సొల్యూషన్‌ని స్టోర్‌ చేసేందుకు అవసరమైన ఉష్ణోగ్రతల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రిఫ్రిజరేషన్‌ వ్యవస్థను నియంత్రించేందుకు 60 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. నైట్‌షిఫ్ట్‌లో 15 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 24 గంటలూ పనిచేస్తుండటంతో 45 రోజుల స్టోరేజీని సంస్థ అంచనా వెయ్యకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దీన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలు అంటే.. 20 నుంచి 25 డిగ్రీల మధ్య ద్రవ రూపంలో నిల్వ ఉంచాలి. ఏమాత్రం ఉష్ణోగ్రత పెరిగినా గ్యాస్‌ రూపంలోకి మారి ట్యాంకర్ల నుంచి లీకైపోతుంటుంది. గురువారం తెల్లవారుజామున ఇదే జరిగింది. రిఫ్రిజిరేషన్‌ చేస్తున్నప్పటికీ.. అధిక మొత్తంలో నిల్వ ఉన్న స్టెరీన్‌ని ఎంత ఉష్ణోగ్రతలో నిల్వ చెయ్యాలన్నది అంచనా వెయ్యలేకపోయారు. ఫలితంగా ట్యాంకర్‌ కింది భాగం మాత్రమే చల్లబడింది పై భాగం చల్లబడలేదు. టాప్‌ లేయర్‌లో ఉష్ణోగ్రత పెరగడం గ్యాస్‌ బయటికి లీకవ్వడం ప్రారంభమైంది. ఈ తరహా స్టెరీన్‌ని నిల్వచేసేందుకు 2వేల500 మెట్రిక్‌ టన్నుల ట్యాంకర్‌ ఉండగా ఏడాది క్రితమే 3వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న మరో ట్యాంకర్‌ తయారుచేశారు. పాత ట్యాంకర్‌ నుంచే ఈ లీకేజీ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ విషవాయువు లీకై కంపెనీ చుట్టూ వున్న గ్రామల ప్రజలపై విషవలయం విసిరింది.

విశాఖ ఆర్ ఆర్ వెంకటపురంలో జరిగిన విష వాయువు ఘటన అందరినీ కలిచి వేసింది. గ్యాస్ లీకేజీ ఘటన పలు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. 12 మంది ప్రాణాలు కోల్పోగా 500 మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతం అంతా ఉలిక్కి పడేలా చేసింది.

విశాఖ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ముందు స్థానికులు ఆందోళ నిర్వహించారు. కంపెనీని తక్షణమే తరలించాలని డిమాండ్‌ చేశారు. కంపెనీతో కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు మండిపడ్డారు.

గ్యాస్ లీకేజ్‌తో దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో రసాయన తీవ్రత వ్యాప్తి చెందింది. గాలి కలుషితం అయిపోయింది. దీంతో 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. తమ ప్రాణాలు తీసేస్తున్న ఇలాంటి కంపెనీలు తమకు వద్దంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిహారాలు, పైకాలు వద్దని స్వచ్చమైన గాలి పీల్చుకుని బ్రతికేందుకు అవకాశం ఇవ్వాలంటున్నారు.

వెంకటాపురంలో ఇంకా ఆ హృదయవిదారక దృశ్యాలు కళ్లల్లో మెదుల్లాడుతూనే ఉన్నాయి. నిర్జీవమైన చెట్లు, తాళాలు వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తున్నాయి. జనాలు నివసించలేని పరిస్థతి ఏర్పడింది. నిన్న, మొన్నటి వరకు పచ్చని పైరులా ఉన్న గ్రామాలు ఈ ఘటనతో నిర్మానుష్యంగా మారాయి. ఘటన జరిగినప్పుడు గాలిలో 17 పీపీఎమ్‌ల రసాయన తీవ్రత వుంది. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నప్పటికి సాధారణ పరిస్థతి రావాడానికి మాత్రం సమయం పడుతుందని నిపుణులు చెబుతున్న మాట.

ఇంత తీవ్రత కలిగిన రసాయన పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ప్రభుత్వాలు పరిశీలన చేయాలి. ఎప్పటికప్పుడు కంపెనీల సామర్ధ్యం పై నివేదికలు తీసుకోవాలి. కాని చేతులు కాలాక ఆకులుపట్టుకునే చందంగానే ప్రభుత్వాలు వున్నాయంటూ విమర్శిస్తున్నారు. మార్పు కావాలి. ప్రజలు అదే కోరుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories