కావలి వైసీపీ చిచ్చుకు అభివృద్ది ఎలా కారణమైంది?

కావలి వైసీపీ చిచ్చుకు అభివృద్ది ఎలా కారణమైంది?
x
Highlights

అక్కడ అభివృద్ధి అంతరాలు రేపుతోంది ఆధిపత్య పొరుకి ఆజ్యంపోస్తోంది ఇద్దరు నేతల మధ్య అంతర్యుద్ద్యానికి దారితీస్తోంది

అక్కడ అభివృద్ధి అంతరాలు రేపుతోంది ఆధిపత్య పొరుకి ఆజ్యంపోస్తోంది ఇద్దరు నేతల మధ్య అంతర్యుద్ద్యానికి దారితీస్తోంది ఇదేంటి, అభివృద్ధి విషయంలో పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఉండాలంటూ పార్టీ అధినేత చెబుతుంటే, ఇక్కడేంటి అంతర్యుద్ధం అనుకుంటున్నారా అవును ఇది నిజం నెల్లూరు జిల్లా కావలిలో అధికార వైసిపిలో, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఓ భారీ అభివృద్ధి కార్యక్రమం, ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య రగడకు తెరలేపింది ఇంతకీ ఏంటా అభివృద్ధి, అంతర్యుద్ధం.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టునిర్మాణంపై, మొన్న పార్లమెంట్ జీరో అవర్లో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. అందుకు కేంద్రం సానుకూలత ప్రకటించింది. భారీ పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటికే రామాయపట్నం కోసం గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, తాజాగా పార్లమెంటులో ఎంపీ ఆదాల ప్రస్తావన, పోర్టు అంశంపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు కావలి ఆర్&బీ అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. ఇదే ఇప్పుడు కావలిలో అధికార వైసీపీలో రగడకు తెరలేపింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీసింది.

మాజీ ఎమ్మెల్యే వంటేరు మీడియా సమావేశం ఏర్పాట్లు విషయాన్ని తెల్సుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే లేకుండా కావలి అభివృద్ధి విషయాలపై ఎలా మీడియాతో మాట్లాడుతారంటూ ప్రశ్నించారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వంటేరు, అక్కడి డిఎస్పీకి కాల్ చేశారు. పోలీసులు ఆర్&బీ అతిధి గృహానికి చేరుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో అతిధి గృహానికి చేరుకోవడంతో, పరిస్థితిని గమనించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంటేరుకి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈ పరిణామం వంటేరు అనుచరులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. వెంటనే సమాచారం పార్టీ రాష్ట్రస్థాయి నాయకులకు అందించారు. దీంతో కావలి కుంపటి రాజధాని అమరావతికి చేరింది.

కావలి నియోజకవర్గంలో గత ఎన్నికల సమయం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు కావలి వైసిపి టికెట్టు తమదేనంటూ వంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రకటించుకున్నారు. అప్పట్లో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో జతకలిసి, ఇద్దరూ అల్లూరు నుంచి బాగోలు వరకు పాదయాత్ర కూడా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక, విష్ణు వర్ధన్ రెడ్డి టిడిపిలో చేరిపోగా, ఓకే మాట, ఓకే నిర్ణయం అన్న వంటేరు వైసీపీలోనే కొనసాగారు. వైసిపి నుంచి ఎమ్మెల్యే టికెట్టు మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికే దక్కింది. దాంతో వంటేరు వేణుగోపాల్ రెడ్డి మొదట అలక బూనినప్పటికీ, అధినేత ఆదేశాలతో ప్రతాప్ రెడ్డికి సపోర్ట్ చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావడంతో, వంటేరు వర్గం కాస్త స్తబ్దుగా ఉంది. ఈ తరుణంలో రామాయపట్నం పోర్టు నిర్మాణ విషయంలో, వంటేరు వర్గం ఎమ్మెల్యేని కాదని ఒక అడుగు ముందుకు వేయడంతో విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బహిర్గతమైన ఈ విభేదాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయన్నది ఇప్పుడు కావలి వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

జిల్లాలో పదికి పది అన్నట్లు వైసిపి పూర్తిగా స్వీప్ చేసినప్పటికీ, జిల్లా పార్టీలో సఖ్యత నామమాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కావలి వైసీపీ చిచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్నది ఇప్పుడు ఆ పార్టీలో వాడీ వేడిగా జరుగుతున్న చర్చ. మరి అధినేత, కావలి చిచ్చును ఎలా చల్లార్చుస్తారో చూడాలంటున్నారు కార్యకర్తలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories