విజయనగర రాచకుటుంబంలో మరో రచ్చ.. సిరిమానోత్సవం వేదికగా అక్కాచెల్లెళ్ల సమరం

విజయనగర రాచకుటుంబంలో మరో రచ్చ.. సిరిమానోత్సవం వేదికగా అక్కాచెల్లెళ్ల సమరం
x
Highlights

కోట కోసం కత్తుల్లాంటి మాటలూ దూశారు. రాచరిక వారసత్వానికి సమరమే అన్నారు. ట్రస్ట్‌‌ సారథ్యంపై టగ్‌ ఆఫ్ వార్ ఫైట్ చేశారు. ఇప్పుడు యువరాణీల యుద్ధం, పీక్...

కోట కోసం కత్తుల్లాంటి మాటలూ దూశారు. రాచరిక వారసత్వానికి సమరమే అన్నారు. ట్రస్ట్‌‌ సారథ్యంపై టగ్‌ ఆఫ్ వార్ ఫైట్ చేశారు. ఇప్పుడు యువరాణీల యుద్ధం, పీక్ లెవల్‌కు చేరింది. ఏకంగా పైడితల్లి అమ్మవారి సాక్షిగా అక్కాచెల్లెళ్లు ఉరిమి ఉరిమి చూసుకున్నారు. సిరిమానోత్సవం సంబరం, కొంతసేపు సోదరీమణుల సమరానికి వేదికైంది. సిబ్బంది, జనం విస్తుపోయేలా చేసింది. సిరిమానోత్సవంలో సంచైత-ఊర్మిళ మధ్య, అసలేం జరిగింది? ఆచారంలో అపశ్రుతికి కారణమెవరు? దశాబ్దాల సాంప్రదాయంలోనూ హక్కులు, అధికారాల ఆర్గ్యూమెంట్‌ సరైందేనా? విజయనగర రాచరిక కుటుంబంలో రాజుకున్న తాజా గొడవపై, హెచ్‌ఎంటీవి స్పెషల్ స్టోరి.

విజయనగర రాచరిక వారసత్వ పోరు, పతాకస్థాయికి చేరుతోంది. మాన్సాస్‌ ట్రస్ట్‌కు అసలైన వారసులం తామంటే తామంటూ, అక్కా చెల్లెళ్ల మధ్య సాగుతున్న సమరం, సిరిమానోత్సవంలో ప్రత్యక్ష యుద్దంగా మారింది. పూసపాటి సంచైత గజపతి రాజు. ఆనందగజపతి రాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు కుమార్తె. ఊర్మిళ ఆనంద గజపతిరాజు రెండో భార్య సుధ కూతురు. ఇద్దరూ ఆనంద గజపతి రాజు స్వంత కూతుళ్లే. వరుసకు అక్కా చెల్లెళ్లే. కొన్నాళ్ల నుంచి వీరి నడుమ సాగుతున్న వారసత్వ యుద్ధం, ఇప్పుడు పైడితల్లి అమ్మవారి సాక్షిగా మరోసారి రచ్చరచ్చ అయ్యింది.

మాన్సాస్ ట్రస్టు చైర్మన్ మార్పు నుంచి అను నిత్యం వార్తల్లోకి వస్తున్న విజయనగరం రాజవంశం, తమ ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సాక్షిగా మరోసారి కయ్యానికి కాలు దువ్వారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌ ఆనంద గజపతిరాజు కుటుంబ సభ్యులుగా, ఆయన రెండో భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఉర్మిళ గజపతి కోటపై నుంచి సిరిమానోత్సవాన్ని తిలకించడం పట్ల, మాన్సాస్‌ ట్రస్టు చైర్‌ పర్సన్ సంచైత గజపతి అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో, రాజకుటుంబంలో, మళ్లీ యుద్ద వాతావరణం నెలకొంది.

సుధాగజపతి, ఊర్మిళను కోటపైకి ఎవరు తీసుకువచ్చారని మాన్సాస్‌ సిబ్బందిని, పోలీసులను నిలదీశారు సంచైత. దీంతో వెంటనే వారిని అక్కడి నుంచి పంపించాలని, డిఎస్‌పికి చెప్పారు. దీంతో డిఎస్పి స్పందించి వారిని పంపించడం తమ చేతుల్లో లేదని, మీరంతా ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి, ఇలాంటి వివాదాల్లో తమను లాగొద్దని అన్నారట. డిఎస్పి, మాన్సాస్ సిబ్బందిపై సంచైత మండిపడటాన్ని గమనించిన సుధాగజపతి, ఆమె కుమార్తె ఊర్మిళ, తీవ్రంగా స్పందించారు. తమను ఇక్కడి నుంచి పంపించి వెయ్యాలన్న సంచైత ఆలోచనను, అవమానంగా భావించారట. సిరిమాను మొదటిసారి తిరిగిన తర్వాత, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా మాటల యుద్ధం మొదలైంది.

ఇరవై ఏళ్లుగా తన తండ్రి ఆనంద గజపతి రాజు, మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచీ, కోట పైనుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్నామని, ఇప్పుడు హాజరు కావడానికి సంశయించాం కానీ, సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇష్టపడలేక వచ్చామని ట్విట్టర్ ద్వారా తెలిపారు ఊర్మిళ. ఇక్కడికి వచ్చాక తమ కుటుంబ సభ్యులెవరూ లేరని గ్రహించామని, సంచైత ఒత్తిడితో, తమను కోట విడిచిపెట్టమని సిబ్బంది కోరారని తెలిపారు. ఇతరులను అగౌరవపరిచడంలో మీ వ్యక్తిత్వ పాత్ర ఏంటో, నేడు స్పష్టంగా మరోసారి అర్థమైందంటూ సంచైతను విమర్శించారు ఊర్మిళ.

మాన్సాస్ వ్యవహరంతో ఇప్పటి వరకు సాగుతున్న యుద్ధం, నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తిలకించడంపై, ఇలా రచ్చకెక్కడం తొలిసారి. ఇంతవరకు ఆస్తుల కోసం పోరాటం జరుగుతోందని విజయనగరం ప్రజలంతా భావించారు. తాజా ఘటనతో ఆస్తులే కాదు, ఆధిపత్యమే అసలు పోరాటమని అనుకుంటున్నారు. రాజకుటుంబ వారసురాలిగా, మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా తానే కోట పైనుంచి సిరిమానోత్సవాన్ని తిలకించాలన్నది సంచైత పట్టుదల. కానీ ఊర్మిళ సైతం కోటపైనుంచి ఉత్సవాన్ని వీక్షించడాన్ని, సంచైత ఏమాత్రం సహించలేకపొయ్యారని అర్థమవుతోంది. వైభవంగా ఉత్సవం జరుగుతున్న టైంలో, పిన్నిని, చెల్లిని అలా మధ్యలోనే, ప్రోద్బలంతో పంపించి వెయ్యడం పట్ల, సంచైతపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అధికార బలంతో, తాను తప్ప ఇంకెవ్వరూ కోట గేటుదాటి రావడానికి వీల్లేదని, హుకుం జారిచెయ్యడం, తన ఆహంకారానికి నిదర్శమని కొందరు మాట్లాడుతున్నారు. అయితే, కుటుంబ వివాదాలు, ప్రతిష్టాత్మకమైన సిరిమానోత్సవం సందర్భంగా బయటపడటం పట్ల, కొందరు భక్తులు సైతం నొచ్చుకుంటున్నారు. అక్కా చెల్లెళ్ల వారసత్వ యుద్ధాన్ని, వారి ఫ్యామిలీవరకే పరిమితం చెయ్యాలని, ఇలా పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో కాదని అంటున్నారు.

ఇప్పటికే ట్రస్ట్‌‌, కోర్టులు, ట్విట్టర్, మీడియా వేదికగా సాగుతున్న అక్కా చెల్లెళ్ల వారసత్వ సమరం, ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఏకంగా దశాబ్దాలుగా సాగుతున్న సిరిమానోత్సవం వేడుక వేదికగానూ, అక్కా చెల్లెళ్లు ఉరిమి ఉరిమి చూసుకున్నారు. చూడాలి, సిస్టర్స్‌ కోట యుద్ధం, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories