Top
logo

మాన్సాస్‌ వారసత్వపోరు మరో మలుపు తిరిగింది.. సంచైత వారసురాలు కాదంటూ రంగంలోకి రెండో భార్య కూతురు..

మాన్సాస్‌ వారసత్వపోరు మరో మలుపు తిరిగింది.. సంచైత వారసురాలు కాదంటూ రంగంలోకి రెండో భార్య కూతురు..
X
Highlights

రాజ్యాల కోసం యుద్ధాలు చేశారని విన్నాం. రణంలో గెలుపొందేందుకు ఎత్తుకుపైఎత్తుల వ్యూహాలు వేశారని చదివాం. ఇప్పుడు...

రాజ్యాల కోసం యుద్ధాలు చేశారని విన్నాం. రణంలో గెలుపొందేందుకు ఎత్తుకుపైఎత్తుల వ్యూహాలు వేశారని చదివాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ విజయనగర కోట కోసం సమరం జరుగుతోంది. మొన్నటి వరకు మాన్సాస్‌‌ ట్రస్ట్‌కు తానే వారసురాలినని కత్తులు దూసిన యువరాణి, కోటను కైవసం చేసుకుంది. అయితే, అసలు వారసురాలిని తానేనంటూ ఇప్పుడు, రాజుగారి రెండో భార్య కూతురు, ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా రంగ ప్రవేశం చేసింది. మొన్నటి వరకు బాబాయి-అమ్మాయి యుద్ధంగా సాగిన సమరం, ఇప్పుడు అక్కాచెల్లెళ్ల రణంగా మారింది. ఇంతకీ సంచైత వారసురాలు కాదంటూ, తెరపైకి వచ్చిన ఊర్మిళా గజపతి వెనక ఎవరైనా వున్నారా? నిజంగా రాచరికం కోసమేనా? లేదంటే వీరి నడుమ సాగుతున్నది రాజకీయ రణమా? రాజకోట రహస్యం చెబుతున్నదేంటి?

విజయనగరం పూసపాటి వంశీయులకు చెందిన మాన్పాస్ ట్రస్టు, అలాగే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్టు ఛైర్మన్ నియామకంలో జరిగిన పరిణామాలు మరువకముందే, తాజాగా ఆనంద గజపతిరాజు రెండవ భార్య కుమార్తె ఊర్మిళ గజపతి, పూసపాటి వంశానికి తానే అసలైన వారసురాలునంటూ ప్రకటించడంతో మళ్ళీ రాజుగారి ఇంటిపోరు చర్చకొచ్చింది.

పూసపాటి సంచైత గజపతి రాజు. ఆనందగజపతి రాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు కుమార్తె. ఊర్మిళ ఆనంద గజపతిరాజు రెండో భార్య సుధ కూతురు. ఇద్దరూ ఆనంద గజపతి రాజు స్వంత కూతుళ్లే. వరుసకు అక్కా చెల్లెళ్లే. ఇప్పుడు ఈ సిస్టర్స్‌ మధ్య వారసత్వ యుద్దం మొదలైంది. ఇప్పటికే రాజకీయ సంచలనంగా మారి, కోర్టు మెట్లెక్కిన మాన్సాస్ వారసత్వ యుద్ధం, ఇప్పుడు అక్కా చెల్లెళ్ల మధ్య రాజుకుంది. విజయనగంలో రాజ్యాల కోసం యుద్దాలు చేసారని విన్నాం యుద్దంలో గెలుపొందేందుకు ఎన్నో ఎత్తుగడలు వెయ్యడం, ఎత్తుకు పైఎత్తులూ చదువుకున్నాం. కానీ నేడు రాజుగారి కుంటుంబ వారసత్వం కోసం అక్కా - చెల్లెళ్ల మధ్య యుద్దానికి దారితీసింది. రణరంగం వ్యూహాలకు మించిన వ్యూహాలతో వారసత్వ పోరు దుమ్మురేపుతోంది.

నిన్నటి వరకు తాను పూసపాటి వారసురాలినంటూ తెరపైకి వచ్చిన సంచైత, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పీఠంతో పాటు సింహాచలం దేవస్థాన ట్రస్టు చైర్మన్ బాధ్యతలను స్వీకరించింది. తానే పూసపాటి ఆనంద గజపతిరాజు నిజమైన వారసురాలురాలినని ప్రకటించుకున్నారు. అయితే తాజాగా పూసపాటి ఆనంద గజపతి రాజు రెండవ భార్య సుధా గజపతి కుమార్తె ఊర్మిళా గజపతి తానే సిసలైన వారసురాలునంటూ ప్రకటించడం సంచలనం సృష్టించింది. తన తండ్రి పూసపాటి ఆనందగజపతి రాజుగారి ఆనాడే వారసులేవరో ప్రకటించారని ఆయన ఆస్తులను పంచుకుని తనతో సంబంధం లేదని వెళ్లిపోయిన వాళ్ళు, మళ్ళీ నేడు వారసురాలునంటూ రావడం అన్యాయంగా ఉందంటున్నారు ఊర్మిళ. చివరి వరకు తమ తండ్రి ఆనంద గజపతికి తోడుండిన, తామే అసలైన వారసులమంటూ ఊర్మిళ శపథం చేస్తుండటంతో, రాచరిక రణం కొత్త మలుపు తిరిగింది.

వారసత్వ పోరులో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఊర్మిళ, చట్టబద్దమైన వారసులం తామేనన్న లా పాయింట్‌ను తెరపైకి తెస్తున్నారు. వారసురాలిగా చెప్పుకోవడానికి తగిన ఆధారాలు సంచైత దగ్గర, ఏమీ లేవంటున్నారు. తన తండ్రి వీలునామాలో అన్ని రాశారని, సంచైత పేరు ఎక్కడా లేదని ఊర్మిళ గజపతి చెబుతున్నారు. సంచైత ఎన్ని చెప్పినా న్యాయస్థానంలో నిలబడదంటున్నారు ఊర్మిళ. తాము కూడా సంచైతపై న్యాయపోరాటం చేస్తానని ఊర్మిళ సవాల్‌ చేస్తున్నారు. 1991లోనే ఆనందగజపతిరాజు నుంచి సంచైత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారు. ఆనంద గజపతిరాజు బతికి ఉండగా, కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది రెండో భార్య సుధ వాదన. ఆనంద గజపతిరాజును మానసికంగా వేధించారని, ఆనాటి విషయాలన్నీ నేడు వెల్లడిస్తున్నారామె. ఎక్కడికో వెళ్లిపోయిన కుటుంబం, ఇప్పుడొచ్చి వారసులం తామేనంటూ ప్రకటించుకోవడం అన్యాయమంటుండటంతో, రాజుల కోటలో యుద్దం తారాస్థాయికి వెళుతోంది.

అయితే ఆనంద్ గజపతిరాజు, ఉమా గజపతిలు చట్టపరంగా విడాకులు తీసుకున్నా వారిద్దరి సంతానమైన సంచైత గజపతిరాజుకు పూసపాటి వంశీయుల వారసత్వం ఉంటుందా లేదా అన్నది మాత్రం మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది. న్యాయ విద్య చదివిన సంచైత గజపతి వారసత్వం విషయంలో చట్టపరమైన అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి, అదను కోసం ఇప్పటి వరకు ఎదురు చూశారని కొందరంటున్నారు.

ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో వున్న వేలాది ఎకరాలను కాజేసేందుకు అధికార పార్టీ, సంచైతను ముందుపెట్టి రాజకీయం చేస్తోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనంద గజపతి రాజు తమ్ముడు, మాజీ కేంద్రమంత్రి అశోక గజపతి రాజు సైతం, కోర్టు మెట్లెక్కారు. సంచైత సైతం ఒక మహిళ వారసురాలు కావడాన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నారని రగిలిపోతున్నారు. ఇప్పటికే తారాస్థాయికి మాన్సాస్‌ ట్రస్ వారసత్వం సాగుతున్న టైంలో, ఇఫ్పుడు సడెన్‌గా సంచైత చెల్లెలు ఊర్మిళ తెరపైకి రావడంతో, పూసపాటియుల సమరం మరో మలుపు తిరిగినట్టయ్యింది. అయితే, ఇప్పుడే ఊర్మిళ ఎంట్రీ ఇవ్వడమేంటి తెరవెనక ఎవరున్నారన్నది కూడా ఆసక్తి కలిగిస్తోంది.

అయితే, ఊర్మిళ వెనక అశోక గజపతిరాజు వున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు అక్కాచెల్లెళ్ల, బాబాయి మధ్య వారసత్వ పోరు త్రిముఖంగా జరుగుతుందా, లేదంటే సిస్టర్స్ మధ్యే సాగుతుందా. రాజకీయలబ్ది కోసమే రచ్చనా, లేదంటే నిజంగా పోటాపోటీగా రాచరికం కోసమే సమరం మొదలుపెట్టారా. మాన్సాస్‌ వారసులెవరో వీళ్లే తేల్చుకుంటారా లేదంటే కోర్టే తేలుస్తుందా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. చూడాలి ఈ వారసత్వ యుద్దంలో గెలిచేదెవరో నిజమైన వారసులుగా నిరూపించుకుని రాజుగారి కోటను దక్కించుకునేదేవరో.


Web TitleUrmila Gajapathi Raju and Sanchaita Gajapathi Raju get Into fight for Vizianagaram MANSAS trust in Andhra Pradesh
Next Story