TTD Key Decision: కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి.. ఉద్యోగులకు శుభవార్త

TTD Governing Body Takes Several Key Decisions
x

TTD Key Decision: కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి.. ఉద్యోగులకు శుభవార్త

Highlights

TTD Key Decision: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా భక్తులకు హోమం టిక్కెట్లు

TTD Key Decision: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. జీవో నెంబర్‌ 114 ప్రకారం విధివిధానాలకు లోబడి.. టీటీడీలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. పాలకమండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. పాదిరేడులో టీటీడీ ఎంప్లాయిస్ ఇంటి స్థలంలో.. గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి 25 కోట్ల 67 లక్షలు వెచ్చించినట్టు చెప్పారు. అలాగే.. 130 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అదనపు స్థలంలో.. గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి 17 కోట్ల రూపాయలతో టెండర్‌కు ఆహ్వానం పలికారు.

టీటీడీలోని ప్రతి ఉద్యోగితో పాటు రిటైర్డ్ ఉద్యోగితో సహా ఇంటిస్థలం బ్రహ్మోత్సవ బహుమానంగా 14 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 6 వేల 850 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. పుదిపట్ల జంక్షన్ నుంచి వకూళమాత ఆలయం వరకు 21 కోట్ల 10 లక్షలతో రోడ్డు నిర్మాణానికి టెండర్ ఆమోదం తెలిపారు.

అలాగే.. స్విమ్స్ ఆస్పత్రి పునర్నిర్మాణానికి 197 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. స్విమ్స్ లో న్యూరో, కార్డియో విభాగాల కోసం నూతన భవనాల నిర్మాణానికి 77 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. కరీంనగర్‌లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి 15 కోట్ల 54 లక్షలు మంజూరు చేశారు. టీటీడీ శిల్ప కళాశాలలో సంప్రదాయ కలంకారీ, శిల్పకళలను నేర్పే సాయంకాలం కళాశాల ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాలినడక భక్తులకు వన్యమృగాల దాడి భయం కలుగుతున్న నేపథ్యంలో.. నడకదారుల్లో వన్యమృగాల నుంచి భక్తులకు భద్రత కల్పించేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. భద్రతా పరికరాలు కొనుగోలుకు మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే.. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్టు చెప్పారు. హోమం రుసుము వెయ్యి రూపాయిలుగా నిర్ణయించారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా భక్తులకు హోమం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories