
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ: ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Vallabhaneni Vamsi: ఏ పార్టీలో ఉన్నా వల్లభనేని వంశీ చుట్టూ ఎప్పుడూ వివాదాలే. వివాదాలే ఆయన వెంట వస్తాయా? ఆయనే వివాదాలకు ఎదురు వెళ్తారో తెలియదు.
Vallabhaneni Vamsi: ఏ పార్టీలో ఉన్నా వల్లభనేని వంశీ చుట్టూ ఎప్పుడూ వివాదాలే. వివాదాలే ఆయన వెంట వస్తాయా? ఆయనే వివాదాలకు ఎదురు వెళ్తారో తెలియదు. కానీ, ఎప్పుడూ ఏదో విషయంలో ఆయన మీడియాలో హెడ్ లైన్స్ లో ఉంటారు. విజయవాడ పోలీసులు అరెస్టు చేయడంతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎలా తెరమీదికి వచ్చింది? . ఆయనపై ఉన్న పాత కేసులను కూడా పోలీసులు తిరగదోడుతున్నారా? వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఏం చెబుతున్నారు? తెలుగుదేశం నాయకులు వాదన ఏంటి?
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్
గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై వల్లభనేని వంశీ అనుచరులు 2023 ఫిబ్రవరి 20న దాడి చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ ఈ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఈ కేసులో వల్లభనేని వంశీ ఏ 71గా ఉన్నారు. ఈ కేసులో 40 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో అఫిడవిట్ సమర్పించారు.
సత్య వర్ధన్ ఈ అఫిడవిట్ దాఖలు చేయడంపై అధికారపార్టీకి దిమ్మ తిరిగింది. కానీ, సత్యవర్ధన్ అప్పటికి అందుబాటులో లేరు. దీంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్టణంలో ఉన్న సత్యవర్ధన్ ను పోలీసులు విజయవాడ తీసుకువచ్చారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీపై బీఎన్ఎస్140 (1), 308, 351 (3),రెడ్ విత్ 3 (5) సెక్షన్లతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.
పరిటాల రవి కుటుంబంతో సంబంధం
వల్లభనేని వంశీకి తెలుగుదేశం కీలక నాయకుడు పరిటాల రవితో మంచి సంబంధాలు ఉండేవని చెబుతారు. ఈ పరిచయమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిందని అంటారు. తన స్నేహితుడి ద్వారా పరిటాల రవితో వంశీకి ఏర్పడిన పరిచయం ఆయనతో జర్నీ చేసేందుకు కలిసి వచ్చిందని చెబుతారు. రియల్ ఏస్టేట్ వ్యాపారం ఆయనకు కలిసి వచ్చింది. దీంతో ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే అప్పట్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కూడా ఆయన మంచి స్నేహం ఏర్పడింది. నందమూరి హరికృష్ణను కొడాలి నాని తన రాజకీయ గురువుగా చెప్పుకుంటారు. నాని ద్వారా హరికృష్ణకు కూడా ఆయన దగ్గరయ్యారు. ఈ పరిచయం జూనియర్ ఎన్టీఆర్ తో అనుబంధానికి కారణమైంది. ఇదే సమయంలో ఆయన 2006లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన గన్నవరం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో గన్నవరం టికెట్టును దాసరి బాలవర్ధన్ రావుకు టీడీపీ కేటాయించింది. చివరి నిమిషంలో విజయవాడ ఎంపీ సీటు వంశీకి దక్కింది. కానీ, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
ఐపీఎస్ అధికారితో వివాదం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో పనిచేసిన ఐపీఎస్ అధికారితో వంశీ ఢీ అంటే ఢీ అన్నారు. ఆ ఐపీఎస్ అధికారి కొందరు మహిళలకు మేసేజ్ లు పంపారని 2011 జనవరిలో ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఆ ఐపీఎస్ అధికారి తోసిపుచ్చారు. తనపై వంశీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ అంశం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ ఐపీఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది. ఈ బదిలీకి వంశీ ఆరోపణలే కారణం. మరో వైపు 2014 జనవరిలో అదే ఐపీఎస్ అధికారిపై వంశీ అప్పటి డీజీపీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. తనను మాజీ నక్సల్స్ తో హత్య చేయించాలని ఆ అధికారి ప్లాన్ చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు. అయితే దీనిపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేయాలని వంశీకి డీజీపీ ప్రసాదరావు సూచించారు.
టీడీపీలో ఉంటూ జగన్ తో ఆత్మీయ ఆలింగనం
విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా వల్లభనేని వంశీ పనిచేశారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి ముందు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2012 మే లో వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ర్యాలీ విజయవాడలో జరిగింది. ఆ సమయంలో వల్లభనేని వంశీ జగన్ ను ఆలింగనం చేసుకున్నారు. ఇది అప్పట్లో తీవ్ర కలకలానికి కారణమైంది.
దీనిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్ కు ఆయన సమాధానం ఇచ్చారు. విజయవాడ రామవరప్పాడులో ట్రాఫిక్ జామ్ లో తాను చిక్కుకున్నానని అదే సమయంలో జగన్ యాత్ర అటుగా వచ్చింది. ఆ ర్యాలీలో ఉన్న తన ఫ్రెండ్ వంగవీటి రాధాను పలకరించేందుకు కారు దిగానని వంశీ అప్పట్లో మీడియాకు వివరించారు. అక్కడే ఉన్న జగన్ కు శుభాకాంక్షలు చెప్పా. కానీ, జగనే తనను ఆలింగనం చేసుకున్నారని వంశీ ఆ రోజు మీడియాకు చెప్పారు.
యార్లగడ్డ వెంకట్రావుతో గొడవ
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ యార్లగడ్డపై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. ఎన్నికల ఫలితాలు రాకముందే వంశీ తన అనుచరులతో తన ఇంటిపై దాడికి ప్రయత్నించారని యార్లగడ్డ వెంకట్రావు అప్పట్లో ఆరోపించారు.
అబ్బే.. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని వంశీ కొట్టిపారేశారు. ఆ తర్వాత ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల్లో వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. వంశీ వైఎస్ఆర్‌సీపీలో చేరడాన్ని యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరి మధ్య పొసగలేదు. రెండు వర్గాలు కొన్నిసార్లు బహిరంగంగానే బాహబాహీకి దిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వంశీపై నెగ్గారు.
చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీ కూడా ఒకరు. అయితే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వంశీ దొంగ ఇళ్ల పట్టాలు ఇప్పించారని అప్పట్లో ఆయనపై ప్రత్యర్ధులు ఆరోపణలు చేశారు. ఇది కూడా ఆయన టీడీపీని వీడడానికి కారణమని అప్పట్లో ప్రచారం సాగింది. అంతేకాదు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారంపై కూడా టీడీపీ నాయకత్వంపై వంశీ ఆరోపణలు చేశారు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేదని అప్పట్లో ఆయన మీడియాకు చెప్పారు. లోకేశ్ టార్గెట్ గా వంశీ ఆరోపణలు చేశారు. వంశీ చేసిన ఆరోపణలకు టీడీపీ కూడా కౌంటరిచ్చింది. వైఎస్ఆర్‌సీపీలో చేరిన తర్వాత చంద్రబాబు, లోకేశ్ పై అవకాశం దొరికితే నోరు పారేసుకున్నారని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కొడాలి నాని, వంశీ ఇద్దరూ అప్పట్లో తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడప్పుడూ ఈ విమర్శల డోస్ పెరిగి వ్యక్తిగత విమర్శలకు కూడా దారి తీసింది. అయితే తాజాగా వంశీ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కేసు విత్ డ్రా చేసుకున్న తర్వాత అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష కిందకే వస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రెడ్ బుక్ పాలనకు వంశీ అరెస్ట్ ను ఉదహరించారు.చట్ట ప్రకారంగానే వంశీని పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ చెబుతోంది.
సత్యవర్ధన్ కేసులో అరెస్టైన వంశీపై పాత కేసులను కూడా తిరగదోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వంశీకి పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. ఆయనపై నమోదైన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని ఫ్యాన్ పార్టీ చెబుతోంది. రానున్న రోజుల్లో వంశీ కేసులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




