Anantapur: తీరని ఒంటరితనం.. కష్టాల కడలిలో అనాథ యువతి బలి: వెటర్నరీ డిప్లొమా చదివినా దక్కని ఓదార్పు!

Anantapur: విధి ఆడిన వింత క్రీడలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, ఆపై నీడను ఇచ్చిన చిన్నమ్మ కూడా దూరమవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Arun Chilukuri
Published on: 10 Feb 2026 2:17 PM IST
Anantapur: తీరని ఒంటరితనం.. కష్టాల కడలిలో అనాథ యువతి బలి: వెటర్నరీ డిప్లొమా చదివినా దక్కని ఓదార్పు!
X

Anantapur: విధి ఆడిన వింత క్రీడలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, ఆపై నీడను ఇచ్చిన చిన్నమ్మ కూడా దూరమవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది.

చిన్ననాటి నుంచే కష్టాల ప్రయాణం

పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన రెడ్డిప్రసన్న (21) పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అనాథగా మిగిలిన ఆ చిన్నారిని చిన్నమ్మ ఈశ్వరమ్మ అక్కున చేర్చుకుంది. ఎన్నో కష్టాల మధ్య ప్రసన్నను చదివించింది. ప్రసన్న కూడా పట్టుదలతో వెటర్నరీ డిప్లొమా పూర్తి చేసింది. అయితే, మూడు నెలల క్రితం తనకున్న ఏకైక దిక్కు చిన్నమ్మ ఈశ్వరమ్మ కూడా మృతి చెందడంతో ప్రసన్న మళ్లీ అనాథగా మారింది.

శూన్యమైన భవిష్యత్తు.. భరించలేని ఒంటరితనం

చిన్నమ్మ మరణం తర్వాత ప్రసన్న తీవ్ర మానసిక వేదనకు గురైంది. బతుకుదెరువు కోసం ఇటీవలే హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగ వేట సాగించింది. అక్కడ పక్షం రోజుల పాటు ఉండి, తిరిగి తనకల్లుకు చేరుకుంది. వెటర్నరీ డిప్లొమా చదివినప్పటికీ, భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం, తోడుగా ఎవరూ లేరన్న భావన ఆమెను కుంగదీశాయి.

ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసన్న పెదనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తు ఉండాల్సిన యువతి ఇలా తనువు చాలించడం స్థానికులను కలచివేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story