logo
ఆంధ్రప్రదేశ్

Tirumala Temple: వడ్డీకాసుల వాడికి కానుకల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

Tirumala Temple Sets Record with Rs 130 Crores Donation Receive in a Month
X

Tirumala Temple: వడ్డీకాసుల వాడికి కానుకల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

Highlights

Tirumala Temple: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. కలియుగ ప్రత్యక్షదైవం.. వెంకటేశ్వరుడు.

Tirumala Temple: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. కలియుగ ప్రత్యక్షదైవం.. వెంకటేశ్వరుడు. తిరుమల కొండలపై వెలసి భక్తకోటికి అభయమిస్తున్న ఆ శ్రీనివాసుడు లక్ష్మీ సంపన్నుడు. సిరిని శ్రీమతిగా చేసుకున్నా భక్తుల నుంచి కానుకలు అందుకోవడంలోనే ఆనందిస్తాడు. అందుకే ఆలయంలో ఉన్న హుండీలో కానుకలు వేయడం భక్తులకు సెంటిమెంట్ గా వస్తోంది. ఇక నిలువుదోపిడి ఇస్తే కష్టాలకు కొదువుండదని భక్తులు విశ్వసిస్తారు. కోరిన వారికి కొంగు బంగారంలా విరాజిల్లుతున్న వెంకటేశ్వరస్వామికి ఏటికేడు భక్తుల సంఖ్య పెరగడంతో హుండీ ఆదాయం అదేస్థాయిలో పెరుగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

ఏటా సరాసరి రెండున్నర కోట్ల మంది శ్రీనివాసుడి దర్శనానికి వస్తుంటే టీటీడీకి 3 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఇందులో కేవలం హుండీ ద్వారానే వెయ్యి కోట్లకు పైగా ఖజానాకు చేరుతోంది. ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే టన్నుకు పైనే అందుతుంది. కొవిడ్ కారణంగా ఆలయ చరిత్రలోనే కొన్ని రోజుల పాటు భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించారు. దీంతో ఏటా ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు తహతహలాడారు. దాదాపు రెండేళ్ల తర్వాత కొద్ది రోజుల క్రితమే దర్శనాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఏడుకొండలవాడి అకౌంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విరాళాలు పోగవుతున్నాయి.

కొవిడ్ సమయంలో హుండీ ఆదాయం తగ్గినా విరాళాలు మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగానే ఆదాయంగా సమకూరింది. ఆన్ లైన్ ద్వారా విరాళాలు వందల కోట్లలో అందాయి. 2019 లో 308 కోట్లు, 2020 లో 232 కోట్లు, 2021లో 564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు చేరాయి. అన్నప్రసాదం పథకానికి 390 కోట్లు, ప్రాణదాన పథకానికి 160 కోట్లు, గో సంరక్షణ పథకానికి 62 కోట్లు, ఎస్వీ బర్డ్ ట్రస్ట్ పథకానికి 41 కోట్లు సమకూరాయి. వెంకటేశ్వర సర్వ శ్రేయా ట్రస్టుకు 29 కోట్లు, విద్యా దానం ట్రస్టుకు 36 కోట్లు, వేద పరిరక్షణ ట్రస్టుకు 26 కోట్లు, శంకర నేత్రాలయ ట్రస్టుకు 5 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు 400 కోట్లను భక్తులు విరాళంగా సమర్పించారు.

టీటీడీ మ్యూజియం పనులు పూర్తిగా భక్తులు సమకూర్చిన 120 కోట్ల వ్యయంతోనే జరుగుతున్నాయి. దీనిద్వారా స్వామివారి ఆభరణాలు త్రిడీ విధానంలో ప్రదర్శన ఏర్పాటుచేయడంతో పాటు ఆలయం సందర్శించిన అనుభూతి కల్పించేలా మ్యూజియంను సిద్ధం చేస్తున్నారు. మొత్తం వ్యయాన్ని పూర్తిగా టాటా, టెక్ మహీంద్రా సంస్థలు భరిస్తున్నాయి. అలాగే 25 కోట్లతో అలిపిరి నడకమార్గంలో పైకప్పు నిర్మాణాన్ని రిలయన్స్‌ సంస్థ చేపట్టింది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పటివరకు 180 కోట్లు విరాళాలుగా సమకూరాయి. అలాగే ముంబైలో 70 కోట్లతో నిర్మించే శ్రీవారి ఆలయానికి సంబంధించి పూర్తి వ్యయాన్ని భరించేందుకు రేమండ్స్‌ సంస్థ ముందుకొచ్చింది. కోవిడ్ సమయంలో హుండీ ఆదాయం పడిపోయినా టీటీడీ ట్రస్టుల పథకాలకు ఏకంగా 11 వందల కోట్లకు పైగా భక్తులు టీటీడీకి విరాళంగా అందజేశారు.

టీటీడీ చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం గత మే నెలలో నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 130.29 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. వీటితో పాటే శ్రీవారిని అలంకరించేందుకు బంగారు ఆభరణాలను కూడా భక్తులు అందజేస్తున్నారు. ఇటీవల చెన్నైకి చెందిన భక్తులు స్వామివారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం అందజేశారు. వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం, కాసుల హారం బరువు 4.15 కిలోలు కాగా వీటి విలువ 2.45 కోట్లుగా లెక్కించారు. ఇలా వడ్డీకాసుల వాడిపై కాసుల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏడుకొండలవాడిని నమ్ముకుంటే నట్టింట సిరి సంపదలు నాట్యమాడుతాయని విశ్వసిస్తారు. ఆయన ఆశీర్వాదం ఉంటేలేమి అన్న మాటే వినబడదు. అందుకే ఆ శ్రీనివాసుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడతారు. ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇష్టపడతారు.

Web TitleTirumala Temple Sets Record with Rs 130 Crores Donation Receive in a Month
Next Story