Top
logo

స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్న ఏడు కొండల అధిపతి

స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్న ఏడు కొండల అధిపతి
X
Highlights

ప్రపంచానికి పాడుకాలం దాపురించింది మహమ్మారి వైరస్ లు మానవాళిని మట్టు పెడుతున్నాయి. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా...

ప్రపంచానికి పాడుకాలం దాపురించింది మహమ్మారి వైరస్ లు మానవాళిని మట్టు పెడుతున్నాయి. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. వదల బొమ్మాళీ అంటూ పీడిస్తోంది. ఒక చోట తగ్గితే మరోచోట. పెచ్చరిల్లుతూ జనంతో దాగుడుమూతల ఆటాడేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏడు కొండల వెంకన్న మాత్రం చిరునవ్వులు చిందిస్తున్నాడు.. ఎందుకిలా?

కరోనా జనాన్ని వణికిస్తోంది ప్రపంచం హడలిపోతోంది జనతా కర్ఫ్యూ పాటించి ముంచుకొస్తున్న ముప్పును తరిమి కొట్టడానికి శక్తివంచన లేకుండా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఇలాంటి తరుణంలో సృష్టికి మూలమైన భగవంతుడు మాత్రం సేద తీరుతున్నాడు.

తిరుమల వెంకన్న మాత్రం ఇప్పుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాడు ఏడు కొండల అధిపతిగా విరాజిల్లుతున్నాడు. ఆనంద నిలయంలో సేద తీరుతున్నాడు ఇప్పుడాయనకు భక్తుల బాధలతో సంబంధం లేదు వారి మొక్కుల చిక్కులు లేవు ఊపిరి సలపకుండా ఇబ్బంది పెట్టే వాతావరణం అస్సలేలేదు..కానీ ఒకప్పుడు శ్రీవారికి ఊపిరి తీసుకునే పరిస్థితి లేదు.. నిత్యం 24 గంటలూ భక్తుల తాకిడికి స్వామి అల్లాడిపోయేవారు.

కలియుగ ప్రత్యక్ష దైవంపై భక్తులకు అపరిమితమైన ప్రేమ ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకోసం ప్రాధేయపడని భక్తులుండరు. దూర తీరాల నుంచి నడుచుకుంటూ మెట్ల మార్గంలోనూ స్వామివారి దర్శనానికి తరలి వస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కిట కిటలాడిపోవాల్సిందే ప్రతీ భక్తుడు ఏదో ఓ విన్నపంతోనో, అర్జీతోనూ స్వామిని ఇబ్బంది పెట్టేవాడే దయ చూపమని ప్రాథేయపడేవాడే.

ఏడు కొండల వెంకన్నకు జరిగే ప్రతీ పూజ, ప్రతీ సేవ కళ్లకి ఇంపుగా అనిపిస్తుంది ఆధ్యాత్మికతతో భక్తి భావం ఉప్పొంగుతుంది. అందుకే స్వామి వారి దర్శనానికి అంత డిమాండ్.

తిరుమల శ్రీవారికి చేసే సేవలన్నీ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి ముగింపులోచేసే పవళింపు సేవ వరకూ అన్నీ ఎంతో సనాతన వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సాగుతాయి ఒక్కో సేవకు ఒక్కో అర్ధం, పరమార్ధం ఉంటాయి.

ఎంతో వేడుకతో భక్తి భావంతో జరిపే తిరుమల శ్రీవారి సేవలను చూసేందుకే భక్తులు తపించిపోతారు. ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలకు తోడు తెల్లవారుజామున జరిపే సుప్రభాత సేవకు ఎంతో ఆదరణ ఉంది. స్వామి వారి నిత్య సేవలు చూసేందుకు వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎగబడుతుండటం ఆనవాయితీ దీంతో టీటీడీ నెమ్మదిగా ఈ సేవలకు వెల కట్టడం మొదలు పెట్టింది. వీటిని చూసేందుకు ముందుగా టిక్కెట్లు అమ్మడం ఖరీదైన రేట్లు పెట్టడం మొదలు పెట్టింది.

తిరుమలకు భక్తుల తాకిడి రాను రాను పెరిగింది దాంతో స్వామి వారి ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే స్వామి వారికి ఏకాంతం కరువైంది క్షణ క్షణానికి లక్షల్లో భక్తులు వరదలా వచ్చేస్తుంటే ఏడుకొండల వెంకన్నకు కనీసం సేద తీరే టైమే కరువైపోయింది. భక్తుల తాకిడి ఎక్కువవుతున్న కొద్దీ వెంకన్నకు సేవలలో కూడా ఆలస్యం అనివార్యమైంది దాంతో రాత్రి దాటినా మేల్కొనే ఉండటం తెల్లవారుజామున త్వరగా నిద్రలేపడం జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై తిరుమల ఆలయంప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఎన్నో సార్లు ఆవేదన వ్యక్తం చేశారు కూడా.

తిరుమల స్వామి వారి సేవల్లో ముఖ్యమైనది పవళింపు సేవ ఈ సేవకు భక్తులను అనుమతించరు రాత్రి దర్శనాలు ముగిశాక శ్రీవారిని నిద్రకు సాగనంపుతారు. ఇది అనునిత్యం జరుగుతుంది పవళింపు సేవ విశిష్టత ఏంటో ఒకసారి చూద్దాం.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునికి జరిగే సేవల్లో చివరి సేవ పవళింపు సేవ. ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ఆలయాన్ని మూసేముందు స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తారు. ఈ పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రి రెండు గంటల వేళ తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని మూస్తారు. ముఖ మంటపంలో వెండి గొలుసులతో ఏర్పాటు చేసిన బంగారు ఊయలలో భోగ శ్రీనివాస మూర్తిని శయనింప చేసి పాలు, పళ్ళు, బాదంపప్పులను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూలవిరాట్టు పాదపద్మాలకు ఉన్న కవచాన్ని తొలగించి, చందనం రాస్తారు.

తిరుమలలో ప్రతిరోజూ రాత్రివేళల్లో బ్రహ్మదేవుడు వచ్చి వేంకటేశ్వరుని అర్చిస్తాడని పూరాణ కథనాలు ఉన్నాయి. అందుకే, వేంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు విచ్చేసే బ్రహ్మదేవుని కోసం వెండి పాత్రల్లో నీటిని సిద్ధంగా ఉంచుతారు. ఆయన కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి అర్చన జరుపుతారని ప్రతీతి పవళింపు సేవలో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలతో వేంకటేశ్వరుని నిద్రపుచ్చుతారు.

తిరుమల ప్రాశస్త్యం పెరుగుతున్న కొద్దీ స్వామి వారికి ఏకాంత సమయం కూడా తగ్గిపోయింది. నిత్యం ఆయన దర్శనానికి తరలి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. అంతేకాదు వీఐపీలు, సెలబ్రిటీలు ఆయన ఏకాంత సమయాన్ని దోచేస్తున్నారు. బ్రేక్ దర్శనాలు, శ్రీఘ్ర దర్శనాలు, విఐపీ బ్రేక్ దర్శనాల పేరుతో దర్జాగా స్వామి వారి టైమ్ ని తస్కరించేస్తున్నారు.

పవళింపు సేవే కాదు స్వామి వారి నిత్య కృత్యాల నియమం కూడా దెబ్బ తింది. భక్తుల తాకిడికే ప్రాధాన్యమిచ్చిన టీటీడీ దర్శన వేళలను పొడిగించేయడంతో కొన్నిసార్లు సమయం లేక స్వామివారు పస్తులు కూడా పడుకున్నారని ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితులు గతంలోనే విచారం వ్యక్తం చేశారు. అంతేనా స్వామి నిద్రించాల్సిన సమయం కుదించేసి తెల్లవారుఝామన 2.30 గంటలకే ఆయన్ను నిద్ర లేపేస్తున్న సందర్భాలు ఉన్నాయి.

కానీ ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమాని స్వామి వారు ఏకాంతంలో ఉంటున్నారు. భక్తుల రొదకు దూరంగా చిద్విలాసం చిందిస్తున్నారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. రాత్రి8 గంటలకే పవళింపు సేవ జరుగుతండటం ఒక శుభ సూచకం కాగా స్వామి వారి సుప్రభాత సేవ కూడా సరైన సమయానికే మొదలవుతోంది. గడచిన నాలుగు దశాబ్దాల్లో స్వామి వారు త్వరగా శయనించినది ఇప్పుడేనని చెబుతున్నారు టీటీడీ పూజారులు.

గత 40 ఏళ్లలో జరగని అరుదైన ఘటన కరోనా వైరస్ పుణ్యమాని చోటు చేసుకుంది. ఒక పవళింపు సేవే కాదు వెంకన్నకు ధూప, దీప నైవేద్యాలు కూడా సమయానికే అందుతున్నాయి. సమయానికి కడుపు నిండా తింటున్నాడు కంటి నిండా నిద్రపోతున్నాడు. ప్రపంచాన్ని ఏలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏకాంతం కోరుకుంటున్నాడా? కరోనా ఈ రకంగా వెంకన్నకు మేలు చేసిందా..?

తిరుమలలో ఇప్పుడు స్వామి వారు, పూజారులు తప్ప భక్తులే కరువు స్వామి వారికి ఈ పరిస్థితి ప్రశాంతంగా కనిపిస్తోందేమో కానీ శ్రీవారి దర్శనం కోసం భక్త జనం తపించిపోతున్నారు. భగవంతుడి నుంచి భక్తుడిని దూరం చేసిన కరోనాని జనం తిట్టుకుంటున్నారు. పరిస్థితి త్వరగా కోలుకోవాలని వెంకన్న దర్శనం మళ్లీ యధా విధిగా కొనసాగాలనీ కోరుకుందాం.Web TitleTirumala devotees not allowed in the temple
Next Story