గంటాకు టైమొచ్చిందా.. వైసీపీనే గంటా తలుపు తట్టేందుకు సిద్దమంటోందా?

గంటాకు టైమొచ్చిందా.. వైసీపీనే గంటా తలుపు తట్టేందుకు సిద్దమంటోందా?
x
గంటా శ్రీనివాసరావు ( ఫైల్ ఫోటో )
Highlights

మొన్నటి వరకు ఆయనే గంట మోగించారు. కానీ అధికార పార్టీకి వినపడలేదు. ఇప్పుడు అధికార పార్టీనే, ఆయన దగ్గరికెళ్లి గంట మోగించేందుకు సిద్దమవుతోందట. పవర్‌ బెల్‌...

మొన్నటి వరకు ఆయనే గంట మోగించారు. కానీ అధికార పార్టీకి వినపడలేదు. ఇప్పుడు అధికార పార్టీనే, ఆయన దగ్గరికెళ్లి గంట మోగించేందుకు సిద్దమవుతోందట. పవర్‌ బెల్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన గంట, ఇక జంప్‌ చేసేందుకు సిద్దమైనట్టేనా? లేక కమలానికి గంట మోగించాలని ఉబలాట పడుతున్నారా?

రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. గెలిచినా, ఓడినా నిశ్శబ్దాన్ని చేధించే శబ్దం ఆయన. పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంట మోగాల్సిందేనన్నది ఆయన ఫిలాసఫీ. 2019లోనూ విన్నింగ్ బెల్ మోగింది. కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది. అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయనకు, అసలేం చెయ్యాలో అర్థంకావడం లేదట ఏదో ఒక అధికార పార్టీలో గంట మోగించాలా అని మేథో మథనం సాగించారు. వైసీపీలోకి వెళ్దామంటే, రాజీనామా చేయాలన్న కండీషన్‌ వుండటంతో, వెయిట్‌ చేసిచేసి విసిగిపోయారు. దీంతో ఢిల్లీకెళ్లి కమలంలో గంట మోగించి ఉత్తరాంధ్ర కాషాయ సేనానిగా చక్రంతిప్పాలనుకున్నారు. కానీ అక్కడా వర్కౌట్‌ కాలేదు. రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయినా, వైసీపీలో చేరీ, చేరనట్టే అనిపించుకోవచ్చని నిరూపించిన వల్లభనేని వంశీ బాటలోనే నడవొచ్చని అనుకున్నారు. కానీ అదీ కుదరడం లేదు. ఇలా గంట మోగించి మోగించి అలసిపోయిన గంటా శ్రీనివాస దగ్గరికే వెళ్లి, వెల్‌కమ్‌ గంట మోగించాలనుకుంటోందట అధికార పార్టీ.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, సిటీలో మరింత పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, సిటీలో నాలుగు దిక్కులూ అంటే, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో తెలుగుదేశమే గెలిచింది. దీంతో సిటీలో ప్రాతినిథ్యం లేకుండాపోయింది వైసీపీకి. విశాఖను రాజధానిగా తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది. స్థానిక టీడీపీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారు. భూములు కబ్జా చేస్తారని, ఫ్యాక్షనిజం తెస్తారని ప్రచారం చేస్తున్నారు. కొత్త రాజధానిలో అధికార పార్టీ పట్ల ఇలాంటి ప్రచారం మంచిదికాదని అధిష్టానం భావిస్తోందట. ఈ నేపథ్యంలో విశాఖను రాజధానిగా సమర్థించిన ఏకైక విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైసీపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారట.

మొన్నటి వరకు గంటా శ్రీనివాసరావు అధికార పార్టీలోకి పోవాలని ప్రయత్నిస్తే, ఇప్పుడేమో ఏకంగా అధికార పార్టీనే ఆయన తలుపుతట్టాలని ఆలోచిస్తోందట. సిటీలో అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బందీలేకుండా, జనంలోనూ రాజధాని పట్ల సానుకూలత ఏర్పడాలంటే, గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకుడు, మద్దతు అవసరమని భావిస్తోందట వైసీపీ. నేరుగా పార్టీలోకి తీసుకోకపోయినా, వల్లభనేని తరహాలో తటస్థ సభ్యుడిగా గంటాను వుంచాలని ఆలోచిస్తోందట. టీడీపీ ఎమ్మెల్యేగానే వుండి, అదే టీడీపీ వాదనను తిప్పికొట్టిస్తే, మేలని ఆలోచిస్తోందట. అందుకే త్వరలో సీఎం జగన్‌‌ అపాయింట్‌మెంట్‌, గంటాకు ఇప్పించాలని కొందరు వైసీపీ సీనియర్లు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారట.

తెలుగుదేశం ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయి, అధికారం చేజార్చుకుందో, అప్పటి నుంచే గంటాకు, మనసులో మనసు లేదు. టీడీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ ఆదేశించినా, పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌లో పాల్గొనడకుండా షాకిచ్చారు గంటా. మిగతా టీడీపీ నేతలు హాజరైనా గంటా మాత్రం, పవన్‌ ర్యాలీలో పాల్గొనలేదు. అలాగే, మొన్న తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన చంద్రబాబు విశాఖ పర్యటనలోనూ గంటా లేరు. టీడీపీ నేతలు, కార్యకర్తలందరూ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అడ్డుకుంటున్నవారిని అడ్డుకుంటుంటే, గంటా మాత్రం అడ్రస్‌లేరు. రోజంతా ఎయిర్‌పోర్ట్‌ దగ్గర హైడ్రామా నడిచినా, గంటా మాత్రం అటువైపు పొరపాటున కూడా చూడలేదు. పార్టీ కార్యక్రమాలకూ పెద్దగా పోవడం లేదు. అంటే సైకిల్‌‌పై నుంచి ఎప్పుడెప్పుడు దిగుదామా అని తపిస్తున్నారు గంటా. ఇప్పడు ఆయన చెంతనే వాలిపోతోందట వైసీపీ.

కరెక్టుగా టైమ్‌ చూసి, టీడీపీ నుంచి వలసలకు గేట్లెత్తుతోంది వైసీపీ. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తోంది. ఈ నేపథ్యంలోనే గంటాకు సైతం వెల్‌క‌మ్‌ చెబుతోందట ఫ్యాన్‌ పార్టీ. మొన్నటి వరకు అలాంటి పిలుపు కోసమే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న గంటా శ్రీనివాసరావుకు, ఈ స్వీట్‌ బెల్‌తో పంట పండినట్టేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories