Top
logo

టీడీపీ మీటింగ్‌లో అసలేం చర్చించారు?

టీడీపీ మీటింగ్‌లో అసలేం చర్చించారు?
X
Highlights

ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధంతా వెళ్లగక్కారట. ఎన్నడూ తల ఎత్తని లీడర్లు కూడా, కళ్లెర్ర చేశారట. ఇదేనా...

ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధంతా వెళ్లగక్కారట. ఎన్నడూ తల ఎత్తని లీడర్లు కూడా, కళ్లెర్ర చేశారట. ఇదేనా పార్టీలో క్రమశిక్షణా, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారట. చివరికి చంద్రబాబు వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుంది అని షాకయ్యారట. ఇంతటి లావా ఎక్కడ బద్దలయ్యిందో తెలుసా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో అసలు టీడీపీ మీటింగ్‌లో ఏం జరిగింది? బయటకు పొక్కని, వేడెక్కించే ఇన్‌సైడ్‌ అంశాలేంటి?

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత, ఘోర పరాజయం తర్వాత తొలిసారి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది తెలుగుదేశం. చాలా రోజుల తర్వాత సమావేశం జరగడంతో జిల్లా వ్యాప్తంగా కీలక నాయకులంతా హాజరయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం, రొటీన్‌కు భిన్నంగా హాట్‌హాట్‌గా సాగిందని తెలుస్తోంది. మొదట పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలపై నేతలు వారివారి అభిప్రాయాలు చెప్పారు. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన వాయిస్‌ను బలంగా వినిపించారని తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెల్లయినా కాకముందే, విమర్శల దాడి చేయడంపై అయ్యన్నపాత్రుడు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొత్త సర్కారుకు కొంత సమయం ఇవ్వాల్సిందిపోయి, అప్పుడే విధానాలు, నిర్ణయాలు, అమలుపై ప్రశ్నించడం సరికాదని, ప్రజల్లోకి ఇవి తప్పుడు సంకేతాలు వెళతాయన్నట్టు సమాచారం. టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న ముద్ర రాకూడదని, చంద్రబాబు ముందే గట్టిగా వాదించినట్టు తెలుస్తోంది. ప్రతి విషయానికి ట్విట్టర్‌లోనో, లేదంటే కొందరు నేతలు ప్రెస్‌మీట్‌ పెట్టో తిట్ల దండకాలు అందుకోవడం ఏంటని, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమ వంటి నేతలను ఉద్దేశించి మాట్లాడినట్టు పార్టీ విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

ఒకవేళ నిజంగా ప్రభుత్వం తప్పులు చేస్తే, చేయనివ్వాలని, అప్పుడే ప్రతిపక్షంగా మనక్కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశం వస్తుందని మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆకలి అయినప్పుడే అన్నం పెడితే బాగుంటుంది కానీ, ముందే పెడితే, దాని విలువ అర్థంకాదని, టీడీపీ నేతల విమర్శలపై అయ్యన్నపాత్రుడు చెలరేగినట్టు సమాచారం. మూడు నెలలు కూడా పూర్తి చేసుకోని ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు, ట్వీట్లు, నిరసనలు, ఆందోళనలు చేయడం సరైంది కాదని, కొంతకాలం వరకు వాటికి దూరంగా ఉండాలని అన్నట్టు తెలిసింది. అయ్యన్నపాత్రుడు సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలి గానీ, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం సాగడంపై అయ్యన్నపాత్రుడు ఒకింత అసహనం వ్యక్తం చేసి, కూర్చున్నట్టు సమాచారం.

ఇక తెలుగుదేశంలో అత్యంత సీనియర్‌ నాయకుల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా, పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో గట్టిగానే మాట్లాడినట్టు తెలిసింది. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టుకాదని అన్నారట. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని చంద్రబాబు సమక్షంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. టీడీపీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని మరోసారి అధిష్టానానికి ఆయన చెప్పుకొచ్చారట. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధినేతను కోరారు. బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించి బుచ్చయ్య చౌదరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారని తెలిసింది. తాను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి బీసీ నేతకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానన్నారు.

మొత్తానికి ఎన్నికల తర్వాత తొలిసారి జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం, రొటీన్‌కు భిన్నంగా హాట్‌హాట్‌గా సాగినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై అప్పుడే ఎదురుదాడికి దిగకుండా, కొంత వేచి చూడాలని, అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని నేతలు మాట్లాడినట్టు తెలిసింది. పార్టీ నుంచి నేతలు జారిపోకుండా కాపాడుకోవాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ధైర్యంనింపే కార్యక్రమాలు మరిన్ని చేయాలని సీనియర్ నేతలు తమ వాయిస్‌ వినిపించారట. వీటన్నింటినీ సాదరంగా విన్న పార్టీ అధినేత చంద్రబాబు, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని చెప్పారట. చూడాలి, మున్ముందు టీడీపీ దూకుడు ఎలా ఉండబోతోందో.


Next Story