రాజమహేంద్రవరం వేదికగా మహానాడు...నేటి నుంచి రెండు రోజులపాటు సభలు..

TDP Mahanadu Meetings for Two days From Today
x

రాజమహేంద్రవరం వేదికగా మహానాడు...నేటి నుంచి రెండు రోజులపాటు సభలు..

Highlights

Rajamahendravaram: కడియం మండలం వేమగిరిలో టీడీపీ మహానాడు

Rajamahendravaram: టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. రాజమహేంద్రవరం వేదికగా ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు మహానాడు సమావేశాలను ఆ పార్టీ నిర్వహించనుంది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో మహానాడు సమావేశాలు జరగన్నాయి. తొలి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ జరగనుంది. ప్రతినిధుల సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరితోపాటు 30 నుండి 40 వేల మంది పార్టీ కార్యకర్తలు కూడా తొలి రోజే హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వేమగిరి వద్ద సుమారు 55 ఎకరాల్లో బహిరంగ సభ జరుగనుంది. ప్రతినిధుల సభలో 15 వేల మంది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుగా సభా ప్రాంగణం సిద్ధం చేశారు. ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో మహానాడు ప్రాంగణమంతా కళకళలాడుతోంది. ఇది ఎన్నికల మహానాడు కావడంతో టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది.

గోదావరి జిల్లాలు ఆదినుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ ఎటు గాలివీస్తే అటే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయి. ఎదురుగాలిలో సైతం గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా 2006లో రాజహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా మహానాడు జరపడంతో 2007లో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పడు నవ్యాంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ రాజమహేంద్రవరం మహానాడుకి వేదికైంది.

గోదావరి ప్రాంతంలో జనసేనకు కూడా పట్టు ఉండడం, ఆ పార్టీతో చెలిమి ఉంటుందన్న సంకేతాలు వస్తున్న తరుణంలో ఇక్కడ జరిగే మహానాడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరించే విధంగా ఈ మహానాడులో తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర సాగిస్తూ జనంలోకి వెళ్లారు. దీంతో ఇప్పుడు మహానాడు పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెంచనుంది

తొలి మహానాడు ఆవిర్భావ సంవత్సరం 1982లో హైదరాబాద్ లో జరిగింది. 83లో విజయవాడ, 84-విశాఖలో, 86, 87-హైదరాబాద్ , 88-విజయవాడ, 90 నుంచి 94 మధ్య కాలంలో నాలుగు మహానాడు సమావేశాలు హైదరాబాద్ లోనే జరిగాయి. 1998, 99 సంవత్సరాల్లో మళ్లీ హైదరాబాద్ వేదికగానే మహానాడు జరిగింది. 2000లో విజయవాడ, 2001లో విశాఖ, 2002లో వరంగల్ , 2003లో తిరుపతిలో సమావేశాలు జరిగాయి. 2004, 2005ల్లో హైదరాబాద్ లో, 2006-రాజమండ్రి, 2007-తిరుపతి, 2009 నుంచి 2015 వరకూ హైదరాబాద్ , 2016-తిరుపతి, 2017-విశాఖ, 2018లో విజయవాడ వేదికలయ్యాయి. కరోనా కారణంగా 2020, 21లో ఆన్ లైన్ లో మహానాడు సమావేశాలు జరిపారు. గత సంవత్సరం ఒంగోలులో జరిగింది. మధ్యలో వివధ కారణాలతో తొమ్మిదేళ్లపాటు మహానాడు జరుపలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories