పెద్దాపురం టీడీపీలో ఒక నేత జంప్‌ ఖాయమా?

పెద్దాపురం టీడీపీలో ఒక నేత జంప్‌ ఖాయమా?
x
Highlights

ఆయన సైకిల్‌ మీదా ఉన్నాడు. కానీ చేతిలో ఫ్యాన్‌ పట్టుకున్నాడు. అందుకే అతను సైకిల్ మనిషో ఫ్యాన్‌ మనిషో అర్థంకాక చుట్టూ ఉన్న జనం, తికమక పడుతున్నారు....

ఆయన సైకిల్‌ మీదా ఉన్నాడు. కానీ చేతిలో ఫ్యాన్‌ పట్టుకున్నాడు. అందుకే అతను సైకిల్ మనిషో ఫ్యాన్‌ మనిషో అర్థంకాక చుట్టూ ఉన్న జనం, తికమక పడుతున్నారు. అలాంటి గందరగోళానికి తెరదించేందుకు, ఆ నాయకుడు, అతిత్వరలో ఫుల్‌‌ క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడట.

బొడ్డు భాస్కర రామారావు. తూర్పు గోదావరి జిల్లాలో కాకలు తీరిన రాజకీయ నాయకుడు. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. గత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేయకపోయినా, సొంత నియోజకవర్గం పెద్దాపురంతో పాటు మరో నాలుగైదు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాటలేశారు బొడ్డు భాస్కర రామారావు.

బొడ్డు భాస్కర రామారావు, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం ఎమ్మెల్సీగా, మూడు పర్యాయాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా, ఓసారి తూర్పు జెడ్పీ చైర్మన్‌గా ఇలా ఎన్నో పదవులు నిర్వహించారు.

పైగా పార్టీపరంగా తెలుగుదేశంలో చురుగ్గా వ్యవహరించడంతో రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పదవులు చేశారు. కాలం కలిసి రాక గత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి టికెట్‌ రాలేదు. ఇంతకు బొడ్డు భాస్కర రామారావు టిడిపిలో ఉన్నారా అంటే, ఉండీ లేనట్టే లెక్క. అలాగే వైసీపీలో చేరారా అంటే చేరకపోయినా చేరినట్టే లెక్క. విచిత్రమైన లెక్కలు ఆయన కోణంలో ఉన్నాయి.రేపో మాపో వైసీపీలో చేరడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు పెద్దాపురం నియోజకవర్గం తన సొంత ఇలాకాలా భావిస్తుంటారు బొడ్డు. తెలుగుదేశంలో తనను కాదని ఎక్కడో కోనసీమలో ఉన్న నిమ్మకాయల చినరాజప్పను తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చారని ఇప్పటికీ రగిలిపోతుంటారు బొడ్డు భాస్కర రామారావు. ఓసారి ఐతే పార్టీ మోసగించిందని, ఇక మోసపోనని రాజప్ప ఓటమే తన ధ్యేయంగా ప్రకటించారు. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోట వాణి గెలుపుకోసం లోలోపల భారీ కసరత్తే చేశారు. తన క్యాడర్‌ను అంతా మళ్ళించి చక్రం తిప్పారు. అయినా బొడ్డు వ్యూహం ఫలించలేదు.

వైసిపి అధినేత తనకు టిక్కెట్ ఇచ్చి ఉంటే రాజప్ప పని అంతేనని ఆయన అనుచరులు పదేపదే వ్యాఖ్యానించారు. పెద్దాపురం ఎమ్మెల్యేగా రాజప్ప గెలిచారు. ఇక అక్కడ వైసిపి ఇన్చార్జిగా బొడ్డుని నియమిస్తే, పార్టీ మెట్ట ప్రాంతంలో మరింత బలపడవచ్చన్న వాదనలు మొదలయ్యాయి.

ఆర్థిక పరిపుష్టి, అంగబలం ఉన్న బొడ్డు, మధ్యలో కొంతకాలం వైసీపీతో అంటకాగారు. తనయుడు వెంకటరమణ చౌదరిని రాజమహేంద్రవరం ఎంపీగా గతంలో నిలబెట్టిన బొడ్డు, మొత్తం మీద వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

తనను ఓడించాలని బొడ్డు ప్రయత్నిస్తున్నట్లు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పార్టీ అధిష్టానవర్గానికి అప్పటి హోం మంత్రి చినరాజప్ప ఫిర్యాదు చేసి రచ్చ చేశారు. అయినా పైస్థాయిలో అధిష్టానం వారి తలపోటులో వారు ఉన్న నేపథ్యంలో ఇక కొత్త తలపోటును తెచ్చుకుని, ఇబ్బంది పడటం ఎందుకు అన్నట్లు మౌనంగా ఉండిపోయింది.

ఇప్పటికీ టీడీపీలోనే ఉండి రగిలిపోతున్న బొడ్డు భాస్కర రామారావు, ఇక అధికారికంగా వైసీపీలో చేరడం ఖాయమైందన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద తూర్పు గోదావరిలో ఇఫ్పటికే మెజారిటీ సీట్లు కోల్పోయిన తెలుగుదేశం, బొడ్డు భాస్కర రామారావు వంటి నేతలను కూడా కోల్పోతే, మరిన్ని కష్టాలు తప్పవని కార్యకర్తలంటున్నారు. తెలుగుదేశానికి మరో భారీ షాక్ తగలనుందన్న చర్చ జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories