TDP EX MLA Janardhan Thatraj : గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

TDP EX MLA Janardhan Thatraj : విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి...
TDP EX MLA Janardhan Thatraj : విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. జనార్ధన్‌కు గుండెపోటు రావడంతో వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2009లో కురుపాం ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరపున కురుపాం నుంచి నామినేషన్ వేసిన జనార్థన్ థాట్రాజ్.. కుల వివాదం కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.
సీనియర్ రాజకీయ నేత, మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు జనార్థన్ థాట్రాజ్ స్వయానా మేనల్లుడు. జనార్థన్ థాట్రాజ్ మరణంతో కురుపాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మాజీ ఎమ్మెల్యే జనార్థన్ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ మృతి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.