ప్రశ్నార్థకంగా పాపికొండల పర్యాటకం

ప్రశ్నార్థకంగా పాపికొండల పర్యాటకం
x
Highlights

పాపికొండల పర్యాటకానికి మళ్లీ మంచిరోజులు వస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కచ్చులూరు బోటు మునకతో ఏడాదిగా ఇక్కడ పర్యాటక రంగం నిలిచిపోయింది. ఎన్నో...

పాపికొండల పర్యాటకానికి మళ్లీ మంచిరోజులు వస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కచ్చులూరు బోటు మునకతో ఏడాదిగా ఇక్కడ పర్యాటక రంగం నిలిచిపోయింది. ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. అయితే త్వరలోనే గోదావరిలో బోటు టూరిజం మొదలవుతుందని అధికారులు చేస్తున్న ప్రకటన కాస్త ఊరటనిస్తున్నా బోట్లకు అనుమతులు మంజూరు కాకపోవటంతో ఇప్పట్లో బోటింగ్ మొదలవుతుందా అనే సందేహం నెలకొంది.

గోదావరిలో కేవలం పాపికొండల పర్యాటకం నిలిచిపోవడంతో ఏడాదిగా అనేక కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారు. రెండు దశాబ్దాల పాపికొండల టూరిజంలో ఎప్పుడూ కచ్చులూరు వంటి పెద్ద ప్రమాదం జరగలేదు. 51 మంది పర్యాటకులు జలసమాధి కావడంతో పర్యాటకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదంపై విచారణ కమిటీ వేసిన ప్రభుత్వం భద్రతా చర్యలపై నివేదిక కోరింది. దీంతో టూరిజం సంబంధించి ప్రత్యేక కంట్రోలు కేంద్రాలను నిర్మించారు.‌ అయితే టూరిజం ప్రారంభించే సమయానికి కొవిడ్ విజృంభన జరగడంతో మళ్లీ టూరిజానికి బ్రేకులు పడ్డాయి.

అయితే ప్రస్తుతం టూరిజం కేంద్రాలు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యాటక కేంద్రాలలో పర్యటనకు అనుమతివ్వాలని నిర్ణయించింది. దీంతో పాపికొండల టూరిజాన్ని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరుకు వరద తీవ్రత కూడా తగ్గి సాధారణ స్థితి గోదావరిలో ఏర్పడుతుందని, ఆ సమయానికి అనుమతులన్నీ తెచ్చుకుని బోట్లను నడపాలనే కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు గోదావరిలో పాపికొండల టూరిజం మొదలైతే పూర్వవైభవం వస్తుందా అనేది ప్రశ్నార్థకమే. తీవ్ర విషాదాన్ని నింపిన కచ్చులూరు ఘటన కారణంగా గతంలో మాదిరిగా పర్యాటకులు ఆసక్తి చూపుతారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో యాభై శాతం మందికే అనుమతి ఉండటంతో బోట్లు నడిపితే కలిసొస్తుందా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు యజమానులు. గతంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో బోటు సూపరింటెండెంట్ అనుమతులు బోట్లకు ఇచ్చే వారు. ఇపుడు పోర్టు అధికారి బోట్లకు అనుమతులు ఇవ్వాలి. సరంగులకు, డైవర్లకు లైసెన్సులు మంజూరు చేయాలి. ఇప్పటివరకూ వీటి విషయంలో అడుగు ముందుకు పడలేదు. దీంతో ఈ వ్యవహారమంతా పూర్తవ్వడానికి మరో నెల సమయం పట్టేలా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories