నిమ్మగడ్డను కలిసింది వాస్తవమే..: సుజనా చౌదరి

నిమ్మగడ్డను  కలిసింది వాస్తవమే..: సుజనా చౌదరి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతల రహస్య సమావేశం కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది....

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతల రహస్య సమావేశం కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిమ్మగడ్డను కలవడంపై వివరణ ఇచ్చిన ఎంపీ సుజనా చౌదరి. సుజనా చౌదరి వ్యాఖ్యలు యధాతథంగా.. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నేను, కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసింది వాస్తవమే. వాళ్లిద్దరూ వేర్వేరు టైం లో కలిశారు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. లాక్ డౌన్ తరువాత నా అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నాను. అక్కడే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నన్ను కలుస్తున్నారు. ఈ నెల 13న కామినేని శ్రీనివాస్ గారు నన్ను కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అదే రోజు రమేష్ కుమార్ గారు కూడా నన్ను కలవాలని అడిగారు. వారిద్దరు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు విషయాలపై నాతో సమావేశమయ్యారు. అవి ఎంతమాత్రం రహస్య సమావేశాలు కాదు.

కామినేని గారితో ఎపి పార్టీ వ్యవహారాలు మాట్లాడ్డం జరిగింది. ఆయన వెళ్లాక రమేష్ కుమార్ గారు కలిశారు. ఆయన మా కుటుంబానికి ఎంతో కాలంగా మిత్రులు. ఆయనతో ప్రత్యేకించి ఇటీవల పరిణామాలు గానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన విషయాలు కానీ చర్చించలేదు. అయితే కొన్ని మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సిసి ఫుటేజ్ చూపించి మేము ముగ్గురం సమావేశమయ్యామని, ఏదో గూడుపుఠాని వ్యవహారం నడిపామని, చట్టవిరుద్ధ చర్యలు చేపట్టామన్నంతగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు చేశాయి. చాలా తెలివిగా గడుసుగా ప్రజలకు భ్రమ కల్పించే ప్రయత్నం చేసాయి. వారిద్దరితో నా సమావేశాలు సాధారణమైనవే. అవి చట్ట వ్యతిరేకంగానో, లేదా కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఎవరినో ఏదో చేయడానికో కాదు.

దీనికి, రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు, వారి నేలబారు మనస్తత్వాలను బయటపెట్టుకున్నట్టే. నలుగురు కలిసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది. ఈ రకమైన బురద రాజకీయాలు చేసేవారితో గుంటలోకి దిగి వారితో కలబడి కుస్తీ పట్టడం నాకు అలవాటు లేదు, అది నా స్థాయి కాదు. నేనెప్పుడూ ఓపెన్ గానే వుంటాను. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. రహస్య కార్యకలాపాలు నేను చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories