Vidadala Rajini: ఈ పీఏలను ఏం చేద్దాం.. పీఏల వ్యవహారమే పీకకు చుట్టుకోబోతోందా?

Story of MLA Vidadala Rajini and her four PAs
x

Vidadala Rajini: ఈ పీఏలను ఏం చేద్దాం.. పీఏల వ్యవహారమే పీకకు చుట్టుకోబోతోందా?

Highlights

Vidadala Rajini: దేవుడి దర్శనం కావాలంటే పూజారిని దాటొచ్చేమో కానీ ఆ ఎమ్మెల్యేని కలవాలంటే మాత్రం నలుగురు పీఏలను ప్రసన్నం చేసుకోవాలట.

Vidadala Rajini: దేవుడి దర్శనం కావాలంటే పూజారిని దాటొచ్చేమో కానీ ఆ ఎమ్మెల్యేని కలవాలంటే మాత్రం నలుగురు పీఏలను ప్రసన్నం చేసుకోవాలట. ప్రజలే కాదు కార్యకర్తలు కలవాలన్నా సమస్యల చెప్పుకోవాలన్నా పీఏల అనుమతి లేకుంటే అంతే సంగతులట. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా పనులు ముందుకు సాగాలన్నా ఆ ఎమ్మెల్యే పీఏల అనుమతి కంపల్సరట. అందుకే విపక్షాలు కూడా రూటు మార్చి ఎమ్మెల్యే కంటే కూడా పీఏలనే టార్గెట్‌ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారట. ఇంతకీ పీఏలతో పీకల మీదికి తెచ్చుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇదంతా ఎక్కడ జరుగుతోంది?

విడదల రజని. ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యేగా గెలవడమే ఓ సంచలనం. రాజకీయ చైతన్యానికి మారు పేరున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై మెజారిటీ విజయం సాధించారు రజని. ఎన్నికల ముందు పుల్లారావు అనుచరురాలిగా ఉంటూ ఆ తర్వాత అనూహ్యంగా ఫ్యాన్‌ పార్టీలోకి జంపయ్యారు. అప్పటివరకూ ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు తర్వాతి కాలంలో రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. పుల్లారావును ఓడించడమే తన ధ్యేయమని, టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యమని చెప్పిన రజని చివరకు అనుకున్నది సాధించారు. పేటలో ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు.

అయితే, రజని ఎమ్మెల్యే అయిన తర్వాత చిలకలూరిపేటలో రాజకీయం పూర్తిగా మారిపోయిందట. పాలిటిక్స్‌కు పూర్తిగా కొత్తయిన రజని చిలకలూరిపేట నీళ్లను బాగా వంటపట్టించుకొని తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. సీనియర్ నేతలను తలదెన్నేలా నియోజకవర్గానికి సూపర్‌బాస్‌గా ఎదిగారు. ఇంతవరకు ఓకే కానీ, పీఏల వ్యవహరమే ఇప్పుడు ఆమె పీకకు చుట్టుకుంటుందట. ఒక ఎమ్మెల్మేకు ఇద్దరు పీఏలు ఉండటం కామన్‌. కానీ రజనికి నలుగురు పీఏలు ఉన్నారట. అందులో ఒకరు ప్రభుత్వం నియమించిన వారైతే. మరో ముగ్గురు వ్యక్తిగత పీఏలు. ఈ నలుగురి దెబ్బకు ఇటు కార్యకర్తలు, అటు అధికారులు తలలు పట్టుకుంటున్నారట. పేటలో ఏది జరగాలన్న ఎమ్మెల్యే కంటే ముందు వీరి అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి వస్తుందని వారు ఆవేదనగా చెబుతున్నారు. ఎంతో కష్టపడి టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి రజనిని గెలిపిస్తే ఈ పీఏలతో తిప్పలు తప్పడం లేదంటూ వారు వాపోతున్నారు.

చివరికి, ఈ వ్యవహరం ఏ స్థాయికి వెళ్లిందంటే ప్రతిపక్ష నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఎమ్మెల్యే రజనిపై విమర్శలు చేయడం మానేసి ప్రెస్‌మీట్ పెట్టి మరి ఎమ్మెల్యే పీఏలను తిట్టిపోస్తున్నారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నిలకల ప్రచారంలో పుల్లరావు కాన్సంట్రేషన్‌ అంతా పీఏల మీదనే పెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ పీఏల్లో ఒకరు ప్రభుత్వం నిషేధించిన వాగు ఇసుక భూములను కొనుగోలు చేసి, అక్రమంగా ఇసుక, గ్రావెల్, అక్రమ మద్యం అమ్ముకొని ఖజానాకు గండి కొడుతున్నారన్న చర్చ జరుగుతోంది. రెండో నెంబర్ వ్యక్తిగత సహాయకార్యదర్శి అయితే, పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ కాసులు గడిస్తున్నారట. ఇక మూడో నెంబర్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి నియోజకవర్గంలో పనిచేసే వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులకు కావాల్సిన చోట పోస్టింగులు ఇప్పిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ క్యాటగిరీలోనే ప్రతీ ఆరునెలలకు ఒకసారి చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నలుగురు సీఐలు బదిలీ కావడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తమ గోడును చెప్పుకునేందుకు వస్తే, ఏ అధికారి కూడా ఆరునెలలు కంటే ఎక్కువ ఉండటం లేదని సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పోస్టింగ్‌ కావాలనుకుంటే ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయ కార్యదర్శులకు లక్షల్లో డబ్బులు ముట్ట చెప్పాల్సిందేనట. పార్టీ కార్యకర్తలు, నాయకులు పడిగాపులు కాసి ఎమ్మెల్యేను కలిసేందుకు వస్తే ఈ నలుగురు వ్యక్తిగత సహాయ కార్యదర్శులను ఒక్కొక్కరి పర్మిషన్ తీసుకొని వారిని దాటుకుంటూ ఎల్‌-1 గదిలో ఎమ్మెల్యే రజని దర్శనం చేసుకోవాల్సి వస్తోందని కొందరు ఓపెన్‌గానే కామెంట్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఈ పీఏల వ్యవహరాలన్నీ ఎమ్మెల్యే రజినికి తెలిసే జరుగుతున్నాయా లేదా అన్నది తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం రజిని త్వరగా మేల్కొని అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. మరి విడదల రజని ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories