విశాఖలో ప్రాణాలు తీస్తున్న ఫార్మా కంపెనీలు.. 9 మంది కార్మికులు మృతి...

Special Story on Visakhapatnam Hetero Drugs Pharma Companies | AP Live News
x

విశాఖలో ప్రాణాలు తీస్తున్న ఫార్మా కంపెనీలు.. 9 మంది కార్మికులు మృతి...

Highlights

Visakhapatnam: విశాఖ ప్రజల పాలిట ఫార్మా పరిశ్రమలు శాపంగా మారుతున్నాయి...

Visakhapatnam: విశాఖ ప్రజల పాలిట ఫార్మా పరిశ్రమలు శాపంగా మారుతున్నాయి. వరస ప్రమాదాలు జరగడం, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు... ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నా సరే ఖాతరు చేయడం లేదు. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ జిల్లాలో ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల భద్రత, రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోనైనా, హెటిరో ఫార్మా పరిశ్రమలోనైనా కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. నక్కపల్లి హెటిరో ఫార్మా కంపెనీలో మొన్న జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా, నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

హెటిరో డ్రగ్స్‌ కంపెనీ డీఎంఎస్‌వో ప్లాంట్‌లో ఇటీవల పేలుడు సంభవించింది. భారీగా శబ్ధం రావడంతో కార్మికులు భయంతో పరుగుతు తీశారు. రియాక్టర్‌ పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతున్నారు. రియాక్టర్లు పేలకుండా ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌, రప్చర్‌ డిస్క్‌ నియంత్రిస్తాయి. ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్‌ పేలినట్టు పరిశ్రమలో సిబ్బంది చెబుతున్నారు. రియాక్టర్‌ పేలుడుతో విడుదలైన వాయువులు.. కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశమున్న చోట కార్మికులకు రెస్పిరేటరీ మాస్క్‌లు ఇవ్వాలి. అయితే కార్మికులకు రెస్పిరేటరీ మాస్కులు హెటిరో యాజమాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

పదేళ్ల కాలంలో హెటిరో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందారు. 2013లో ఐదుగురు, 2015, 2016, 2020లో, 2022 ఫిబ్రవరి 23న ఒక్కొక్కరు చొప్పున ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పరిశ్రమలో అన్ని ప్రమాదాలు జరుగుతున్నా... కార్మికుల భద్రత, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫార్మా కంపెనీల ప్రమాదాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల నిర్వహణపై 2020 జులై 16న అప్పటి కలెక్టర్‌ వినరుచంద్‌ నాలుగు బృందాలను నియమించారు. ఆ మేరకు కార్మికులకు కార్మికుల భద్రత, ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అంశాలతో పాటు నింబంధనల అమలు తీరుపై నాలుగు నివేదికనును ఇచ్చింది. అయితే పరిశ్రమల్లో లోపాలను సరి చేసే దిశగా మాత్రం ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు.

హెటిరో ఫార్మాలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన అల్లాడ సాయిరాం కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం, వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలని పట్టుబడుతున్నాయి. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని పట్టుబడుతున్నాయి. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాతపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు... ఆ తరువాత పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని హెటిరోలో ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఫార్మా కంపెనీల్లో వరస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్ర విచారణ చేపడుతారా? లేక ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హాడావడి చేసి ఊరుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories