నాడు నేడు కార్యక్రమంతో మెరిసిపోతున్న పాఠశాల

నాడు నేడు కార్యక్రమంతో మెరిసిపోతున్న పాఠశాల
x
Highlights

సర్కార్ బడి అంటే.. కూలిన గోడలు, పెచ్చులూడిన శ్లాబులు ఊడిన తలుపులు శిథిలమైన భవనాలు కళ్లముందు కదలాడుతాయి. కానీ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం...

సర్కార్ బడి అంటే.. కూలిన గోడలు, పెచ్చులూడిన శ్లాబులు ఊడిన తలుపులు శిథిలమైన భవనాలు కళ్లముందు కదలాడుతాయి. కానీ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం పాఠశాల మాత్రం ఇంధ్రభవనంగా కనిపిస్తుంది. మెరుగైన వసతులతో ఖరీదైన హంగులతో పాఠశాల నిర్మాణం మెరిసిపోతోంది. కార్పొరేట్ స్కూళ్లను మించి పాఠశాలను తీర్చిదిద్దడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించేందుకు క్యూ కడుతున్నారు.

ఈ నిర్మాణం చూసి, ఏదో ఫై స్టార్ హోటల్ లేదంటే మంత్రిగారి గెస్ట్ హౌసో అనుకుంటున్నారా కానే కాదు. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమ పుణ్యమా అని శిథిలావస్థలో ఉన్న రామచంద్రాపురం ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు అద్దంలా మెరిసిపోతోంది. కడప జిల్లాలో నాడు నేడు కార్యక్రమం తొలి విడతలో భాగంగా 50 మండలాల్లోని 1059 పాఠశాలలను గుర్తించారు. 718 ప్రాథమిక పాఠశాలలు, 161 ప్రాథమికోన్నత పాఠశాలలు, 180 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో మౌలిక వసతుల కల్పన పర్యవేక్షణ బాధ్యతలను సర్వశిక్ష అభియాన్, సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది.

అయితే కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం పాఠశాలను ముందుగా మోడల్ స్కూల్ గా మార్చి చూపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ మేరకు అధికారులు రామచంద్రాపురం పాఠశాలను సరికొత్త హంగులతో ముస్తాబుచేశారు. ఎండలున్నా, కరోనా ఉన్నా పాఠశాల అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టారు. నాడు–నేడు కార్యక్రమంలో 9 అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌, ఇంజినీరింగ్ అధికారులు కలిసి 45 రోజులు తీవ్రంగా శ్రమించారు. చివరకు అద్భుత నిర్మాణాన్ని కళ్లముందు నిలిపారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లు అంటే ముక్కు మూసుకొని వెళ్లాలన్నా మనసొప్పేది కాదు. అంతలా అపరిశుభ్రంగా ఉండేవి. కానీ ఇప్పుడు రామచంద్రాపురం పాఠశాలలోని మరుగుదొడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయి. మరోవైపు చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేక కులాయిలు, తాగునీటి వసతి, ఇలా అన్ని ఫెసిలిటీలను ఈ స్కూల్ లో ఏర్పాటు చేశారు. హైక్లాస్ తరగతి గదులతోపాటు పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక గ్రౌండ్, అందులో ఆటవస్తువులను కూడా అందుబాటులో ఉంచారు. పిల్లలకు చదువుతోపాటు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు చక్కటి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు.

పాఠశాల హంగులను చూసిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని అడ్మిషన్లు తీసుకునేందుకు పోటీపడుతున్నారు. ఏపీలో విద్యావ్యవస్థ అభివృద్ధి సుసాధ్యమవుతుంది. అందుకు రామచంద్రాపురం పాఠశాలే సాక్ష్యంగా నిలుస్తోంది. వచ్చే ఏడాది కల్లా నాడు-నేడు కార్యక్రమానికి ఎంపికైన అన్ని ప్రభుత్వ పాఠశాలు ఇలా ఇంధ్రభవనాలుగా మారనున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories