ఏపీ మంత్రుల దూకుడుకు ఎస్ఈసీ బ్రేకులు

ఏపీ మంత్రుల దూకుడుకు ఎస్ఈసీ బ్రేకులు
x

ఏపీ మంత్రుల దూకుడుకు ఎస్ఈసీ బ్రేకులు

Highlights

*మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్యలు *మంత్రి పెద్దిరెడ్డిని ఈనెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలి : ఎస్‌ఈసీ *మీడియాతో మాట్లాడనివ్వొద్దని ఎస్‌ఈసీ డీజీపీకి ఆదేశం

ఏపీ మంత్రుల దూకుడుకు ఎస్ఈసీ బ్రేకులేశారు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డికి ఎస్ఈసీ నిమ్మగడ్డ గట్టి షాక్‌ ఇచ్చారు. పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని డీజీపీని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించారు. పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తప్పవని వెల్లడించింది.

గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాల గందరగోళం చినికిచినికి గాలివానగా మారింది. ఏకగ్రీవాలను హోల్డ్‌లో ఉంచామని ఎస్‌ఈసీ ఆదేశించిన విష‍యం తెలిసిందే. అయితే ఎస్‌ఈసీ నిర్ణయాలను అమలు చేస్తే బ్లాక్‌లీస్ట్‌లో పెడతామని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రయత్నం చేశారు. పైగా మార్చి 31 తర్వాత గుణపాఠం చెబుతామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డిని ఎన్నికలు ముగిసేవరకు బయటకు రానివ్వద్దని తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని డీజీపీకి రాసిన లేఖలో ఎస్‌ఈసీ పేర్కొన్నారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను జతచేశారు. అయితే ఎస్‌ఈసీ తీసుకున్న చర్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఎస్‌ఈసీ చర్యలు తీసుకున్నా మంత్రి పెద్దిరెడ్డి వెనక్కితగ్గడం లేదు. ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల అధికారులపై చర్యలు తప్పవని మళ్లీ హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి.

ఒక మంత్రిని నిలువరించే అధికారం, హక్కు మీకెక్కడదని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డను నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తారని, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారని జోగిరమేష్‌ ఖరాకండిగా చెప్పారు.

విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్నట్లయ్యింది అధికారుల పరిస్థితి. ఇప్పుడు ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలా.. వద్దా అనే డైలామాలో ఉన్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories