మామ వర్సెస్ కోడలి వార్‌లో నయా ట్విస్టేంటి?

మామ వర్సెస్ కోడలి వార్‌లో నయా ట్విస్టేంటి?
x
Highlights

అత్త వర్సెస్ కోడలు. సినిమాల నుంచి సీరియళ్ల వరకు కామన్‌ ఫైట్. ప్రతి ఇంట్లోనూ కంపల్సరీ కయ్యం. బట్ జస్ట్ ఫర్ చేంజ్. ఇప్పుడు కోడలు వర్సెస్ మామ. అది కూడా...

అత్త వర్సెస్ కోడలు. సినిమాల నుంచి సీరియళ్ల వరకు కామన్‌ ఫైట్. ప్రతి ఇంట్లోనూ కంపల్సరీ కయ్యం. బట్ జస్ట్ ఫర్ చేంజ్. ఇప్పుడు కోడలు వర్సెస్ మామ. అది కూడా మంత్రిగారైన కోడలు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మామ. మినిస్టర్‌గా తన కోడలు రాష్ట్రంలో కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, మామ సంతోషిస్తారనుకుంటే, ఏకంగా ఘాటు విమర్శలు చేశారాయన. ఇప్పుడు ఈ మామా కోడళ్ల కయ్యం, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ వారి గొడవేంటి? కుటుంబ పోరు, రాజకీయ పోరుగా మారిందా? లేదంటే అంతకుమించిన కారణాలు ఏమైనా వున్నాయా?

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకుని, డిప్యూటీ సిఎంగానూ కొనసాగుతున్నారు పాముల పుష్పశ్రీవాణి. అయితే స్వంత నియోజకవర్గంలో ఆమె పనితీరు బాగోలేదంటూ, స్వయాన ఆమె మావయ్య చంద్రశేఖరరాజు ఆరోపించడం, జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

మంత్రి పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, ఇద్దరూ వైసీపీ పార్టీనే. తన కొడుకు పరిక్షిత్ రాజుకు, పుష్పశ్రీవాణితో పెళ్లి చేయించి, కోడలిగా ఇంటికి తెచ్చుకున్నారు చంద్రశేఖర్ రాజు. గత ఎన్నికల్లో కోడలి గెలుపుకు కృషిచేశారు. అయితే, ఏమైందో ఏమో కానీ, కోడలి పనితీరు, పార్టీ పనితీరుపై సంచలన కామెంట్స్ చెయ్యడంతో, కుటుంబ రాజకీయ తగాదా బహిర్గతమైనట్టయ్యింది. పుష్పశ్రీవాణి తన నియోజకవర్గంలో, తనకు అనుకూలంగా ఉంటేనే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, లేదంటే కనీసం వారివంక చూడడంలేదన్నారు చంద్రశేఖర్‌ రాజు. నియోజకవర్గంలో వర్గవిభేదాలు సృష్టించి పాలిస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.

మామ కోడళ్ల యుద్ధంతో కురుపాం కోటలో రెండు వర్గాలు ఏర్పడ్డాయన్న చర్చ మొదలైంది. మామ కామెంట్లు మంత్రి శ్రీవాణికి ఇబ్బందిగా మారాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం పనితీరు బాగోలేదంటూ, మామ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు డిప్యూటీ సిఎం. స్వయాన మామే ఇలాంటి కామెంట్లు చేయడం, ఆమెను మనస్తాపానికి గురి చేసిందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అయితే కోడలిపై మామ కామెంట్ల వెనక అసలు కారణాలు వేరే వున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది.

శత్రుచర్ల చంద్రశేఖరరాజు, రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో, కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి, 2017 సంవత్సరంలో తెలుగుదేశంలో చేరి క్రియాశీలకంగా పనిచేసారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి తన కుమార్తెకు టిక్కెట్టు ఆశించారు. కానీ నిరాశ తప్పలేదు. దీంతో 2019 ఎన్నికల ముందు వైసిపి తీర్దం పుచ్చుకుని కోడలు పుష్పశ్రీవాణి గెలుపుకు సహకరించారు. అయితే కోడలి పాలన ఏడాది దాటినా నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందారంటూ విమర్శించి, కుటుంబంలోనే కాదు, పార్టీలోనూ రగడ రాజేశారు. మామ కోడళ్ల వార్‌ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందని అధిష్టాన నేతలు సైతం రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్పశ్రీవాణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మామ విమర్శలపై వివరణో, కౌంటరో ఇస్తారని, అంతా అనుకున్నారు. కానీ మీడియా మీట్‌లో ఆమె భర్త పరిక్షిత్ రాజు ప్రత్యక్షమై, నాన్న మాటలను పట్టించుకోనవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్‌ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న పుష్పశ్రీవాణిని, స్వయంగా మామ చంద్రశేఖర్‌ రాజు చేసిన విమర్శలపై అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశానికి దగ్గరయ్యేందుకే చంద్రశేఖర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? కూతురికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామివచ్చిందా? కోడలు వున్న పార్టీలోనే వుంటే కూతురికి రాజకీయ భవిష్యత్ వుండదని భావిస్తున్నారా? ఇవన్నీ కాక, కుటుంబ గొడవలే మామతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించాయా అన్న కారణాలపై ఎవరికి తోచినవిధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అసలు కారణాలేంటో కాలమే సమాధానం చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories