పందెం కోళ్ళు.. సంక్రాంతి ప్రత్యేకం!

roosters getting ready for sankranthi in Visakhapatnam
x

పందెం కోళ్లు (ఫైల్ ఇమేజ్)

Highlights

విశాఖలో పందెం కోళ్లు.. నువ్వా, నేనా అంటూ కాళ్లు దువ్వుతున్నాయ్‌. పందెం రాయుళ్ల రాక కోసం వేచిచూస్తున్నాయ్‌. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి ప్రత్యర్థులను...

విశాఖలో పందెం కోళ్లు.. నువ్వా, నేనా అంటూ కాళ్లు దువ్వుతున్నాయ్‌. పందెం రాయుళ్ల రాక కోసం వేచిచూస్తున్నాయ్‌. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి ప్రత్యర్థులను దెబ్బకొడదామా అంటూ ఆత్రుతతో తహతహలాడుతున్నాయి. తన యజమాని ఆనందం కోసం బలైపోయేందుకు పందెం కోళ్లు సిద్ధమయ్యాయి.

తెలుగు లోగిళ్లు సంక్రాంతి పండుగకు సిద్ధమయ్యాయి. పిండి వంటలు, హరిదాసులు, రంగవల్లులకు తోడు కోళ్లు కూడా సంక్రాంతి బరికి సై అంటున్నాయి. ఏపీలోని కృష్ణా, గుంటూరు, విశాఖతోపాటు ఉభయగోదావరి జిల్లాలు పందేలకు సై అంటున్నాయి. ఒక్క పండుగ కోసం పందెం రాయుళ్లు 9నెలల నుంచి కోళ్లకు కఠోర శిక్షణ ఇవ్వడమే కాదు పందెంలో పరువు నిలబెట్టాలని వాటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో పటిష్ట భద్రత మధ్య కోళ్లను పెంచారు.

పందాలకు ట్రైనింగ్‌ ఇచ్చే కోళ్ల జాతులు దాదాపుగా 30వరకు ఉన్నాయి. వీటిలో సీతువా, కాకి, డేగ, మైలా, మలి, డేగ పూల, నెమలి డేగ, నెమలి పింగళ జాతులకు చెందిన కోళ్లు ఉంటాయి. ఇందులో కాకి, డేగ, నెమలి జాతులకు చెందిన కోళ్లు పందాలకు ముఖ్యమైనవి. అయితే కొందరు పందెం రాయుళ్లు తమ దగ్గరున్న జాతులు, ఆరోజు నక్షత్రాలను బట్టి పందాలు కాస్తారు. అంతేకాదు మరికొందరైతే కోడి పుంజుల కోసమే రూపొందించిన పంచాంగం కుక్కుట శాస్త్రాన్ని బట్టి కూడా పందాలు కాస్తారు.

వేల రూపాయల ధర పలికే కోడి పుంజుల పెంపకం ఒక కళ అనే చెప్పాలి. ముఖ్యంగా వీటిని పెంచేవారు ఖర్చుకు వెనకాడరు. బాదం, జీడిపప్పుతోపాటు మటన్‌ కీమా, ఉడకబెట్టిన గుడ్లు, నానపెట్టిన గంట్లు, గోధుమలు, రాగులు, జొన్నలు ఆహారంగా అందిస్తారు. నాలుగు రోజులకోసారి స్నానం చేయిస్తారు. దీంతోపాటు చెరువులో వాటికి వ్యాయమం కూడా చేయిస్తారు. సుమారు ఏడాదిపాటు ఎంతో శ్రద్ధగా కోడి పుంజుల పెంపకం చేపట్టి బరుల్లోకి దించుతారు.

విశాఖలో చంద్రనగర్‌కు చెందిన వెంకట రమణ రాజు సుమారు 15ఏళ్ల వయస్సు నుంచి కోళ్లను పెంచుతున్నారు. ఇప్పటికీ వందల సంఖ్యలో కోళ్లను పెంచిన ఘటన ఆయన సొంతం. ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి ఆయన దగ్గరకొచ్చి పుంజులను తీసుకెళ్తుంటారు. అయితే సంక్రాంతి మూడురోజులు కోళ్ల పందాలు నిర్వహించడానికి షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు వెంకట రమణ రాజు.


Show Full Article
Print Article
Next Story
More Stories