రోజాకు ఎదురుగాలి.. తొడగొట్టి సవాల్ విసిరిన..

Roja Disgusted With YSRCP Group Politics
x

రోజాకు ఎదురుగాలి.. తొడగొట్టి సవాల్ విసిరిన..

Highlights

MLA Roja Vs Chakrapani Reddy: రాజకీయ విభేదాలు... ఆదిపత్యపోరు... వెరసి అనుకూల పరిస్థితులు... ప్రతికూలంగా మారుతున్నాయి.

MLA Roja Vs Chakrapani Reddy: రాజకీయ విభేదాలు... ఆదిపత్యపోరు... వెరసి అనుకూల పరిస్థితులు... ప్రతికూలంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో స్వపక్షంలోనే విపక్షం ఎదురైంది. ఆమెకు అడుగడుగునా ఎదురుగాలి వీస్తోంది. సొంతపార్టీ నాయకులే వర్గరాజకీయాలను ప్రోత్సహించడంతో ఆమె రాజకీయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రసవత్తర రాజకీయాలకు వేదికగా నిలిచింది. పొలిటికల‌ ఫైర్ బ్రాండ్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస‌ పార్టీలో విభేదాల కుంపటి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పొడజూపినన విభేదాలు తదనంతర పరిణమాలతో రోజాకు ఇబ్బందికరంగా మారాయి.

నగరి ఎమ్మెల్యే రోజాకి సొంత నియోజకవర్గంలోనే ఎదురు గాలి వీస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు విభేదాలకు ఆజ్యంపోసినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సమయంలో రోజా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో విభేదాలు భగ్గుమన్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎమ్మెల్యే రోజా కళ్లెర్ర జేసింది. రోజాపై అప్పట్లో తొడగొట్టి సవాల్ విసిరిన వ్యక్తికి కీలక పదవులు కట్టబెట్టడంతో రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సొంతపార్టీ నాయకులే నియోజకవర్గంలో తనకు ప్రధాన్యతలేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా మదనపడుతున్నారు.

రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న పార్టీ పెద్దలే పరోక్షంగా తన ఎదుగుదలకు అడ్డుతగులుతున్నారని ఎమ్మెల్యే రోజా భావిస్తోంది. పార్టీలో తిరుగుబాటు చేసిన వారికి నామినేటెడ‌ పదవులు కట్టబెట్టడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఆమెను దిక్కరించి బహిరంగంగా మాట్లాడుతున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పదవులు వస్తుండటంతో కడుపు మండిన రోజా చాలా సార్లే కన్నీరు పెట్టుకుంది. తన దయనీయ స్థితిని ఏకంగా జగన్మోహన్ రెడ్డి ముందే ఏకరువు పెట్టింది. అయినా పరిస్థితులలో మార్పు రాకపోగా మరో ఎదురుదెబ్బ తగిలింది.

నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు, నిండ్ర మండలానికి చెందిన పార్టీ నాయకులు చక్రపాణి రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. రాజకీయాల్లో ఆదిపత్య ధోరణి ఇరువురి మధ్య అగాధాన్ని సృష్టించింది. వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మండల పరిషత్ ఎన్నికలసమయంలో ఎమ్మెల్యే రోజా వర్గ రాజకీయాలను ప్రోత్సహించిందని చక్రపాణిరెడ్డి బహిరంగంగా విరుచుకుపడ్డాడు. అప్పట్లో జరిగిన రాజకీయ రాద్ధాంతం పార్టీలో దుమారం రేపింది. రోజాపై తాను పోటీకి సిద్దమని, ఓడిపోతే ఆమె ఇంటికి వాచ్ మెన్ గా చేస్తానని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ పెద్దాయనతో వినయంగా ఉండే చక్రపాణిరెడ్డికి శ్రీశైలం దేవస్థాన పాలకమండలి ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జిఓ ఆమెకు మింగుడు పడలేదు. ఇప్పటికే ఆమెను వ్యతిరేకించి బహిరంగంగా ఎదురు తిరిగిన నగరి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కెజె కుమార్ కుటుంబం రాష్ట్ర స్థాయిలో పోస్టుల్లో ఉన్నారు. పదవి పొందిన వారు భారీ హోర్డింగులేసి ఆ పెద్దాయనకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో నగరిలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇప్పటికే నియోజకవర్గంలో వడమాల పేటలోనూ రోజాకు వ్యతిరేకంగా గ్రూపు సిద్దమైంది. నగరి నియోజకవర్గంలో కీలకమైన నిండ్ర మండలంలోనూ ప్రత్యర్థులు రోజా రాజకీయ ఎదుగుదలకు ఎదురుగాలి వీస్తోందనే సంకేతాలున్నాయి.

రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకునే తరుణంలో సొంతపార్టీలోనే ప్రత్యర్థులు ఎదురుకావడంతో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాకు ఇబ్బందికర పరిస్థితులు అనివార్యమయ్యారు. సొంతపార్టీ నాయకులే గ్రూపురాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు పొరుగు రాజకీయ పార్టీలకంటే సొంత పార్టీ పెద్దలే వ్యతిరేక సైన్యాన్ని సిద్ధం చేశారని రోజా మదనపడుతున్నారు. నగరిలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పూసగుచ్చినట్లు వివరించినా ఫలితంలేకపోయిందని ఎమ్మెల్యే రోజా రాజకీయంగా సతమతమవుతున్నారు. నగరి నియోజవర్గ రాజకీయ సంక్షోభం సమసిపోయేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories